మరొకసారి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే వార్నింగ్

రెడ్డి సామాజికవర్గంలో ఎక్కువ మంది ఆశావహులు ఉండటంతో ఆయన పేరు పరిశీలనలోకి రావడం లేదు.

తెలంగాణ కేబినెట్ విస్తరణ చేయడానికి అధిష్టానానికి అనేక చిక్కుముడులు ఎదురయ్యాయి. సామాజికవర్గాల సమతుల్యత కుదరలేదు. పలు సామాజికవర్గాల నుంచి మంత్రి పదవులు కావాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. దీంతో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలో అర్థం కాక విస్తరణను వాయిదా వేసింది. అదెప్పుడు జరుగుతుందో తెలియదు. ఇక బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో మహాధర్నా జరిగిన సంగతి తెలిసిందే. దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి, బీసీ మంత్రులు పాల్గొన్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే కావొచ్చు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ విస్తరణపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.

కేబినెట్లో ప్రస్తుతం ఇద్దరు బీసీ మంత్రులు ఉన్నారని, మరో ఇద్దరికి అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి చెప్పానన్నారు. ఈ ప్రతిపాదనపై హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మహేష్ కుమార్ మరో ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలని కోరుతుండగా, మరోపక్క మంత్రి పదవుల కోసం రెడ్డి సామాజికవర్గం నుంచి డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా రంగా రెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం కాంగ్రెసు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేశారు. ఆయన ఎప్పటినుంచో ఈ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వేరే సామాజికవర్గం నాయకుడిని పోటీ చేయించి గెలిపిస్తానని, మరి ఆయనకైనా జిల్లా నుంచి మంత్రి పదవి ఇస్తారా? అని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని సీనియర్ నేత జానారెడ్డి ఇటీవల హైకమాండ్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి మాత్రమే గెలిచారు.

ఆయన మంత్రి పదవి కోసం సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. కానీ రెడ్డి సామాజికవర్గంలో ఎక్కువ మంది ఆశావహులు ఉండటంతో ఆయన పేరు పరిశీలనలోకి రావడం లేదు. జానారెడ్డి ఇప్పుడు పవర్‌ఫుల్‌గా కనిపిస్తూండటంతో ఆయనను మల్ రెడ్డి సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఆయన కోసం జానారెడ్డి లేఖ సాయం చేశారని భావిస్తున్నారు. మరి మల్ రెడ్డి రంగారెడ్డి వార్నింగ్ అధిష్టానంపై పనిచేస్తుందా?

One Reply to “మరొకసారి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే వార్నింగ్”

Comments are closed.