వినోద్‌కు అక్కడ తగిలిన తీగ – ఎంజి మొయినుద్దీన్. యువకుడు. మూగ, చెవిటి. కానీ అద్భుతమైన ఆర్ట్ డైరక్టర్. లినోటైప్ ఆపరేటరుగా కెరియర్ మొదలుపెట్టి పుస్తకాలు చదువుతూ, ప్రయోగాలు చేస్తూ డిజైనింగ్, లేఔట్ నేర్చుకున్నాడు. వినోద్‌కు అతనితో జీవితాంతం అనుబంధం కొనసాగింది. తను ఎక్కడికి వెళ్లినా ఆ పేపరు డిజైనింగ్ అతని చేతనే చేయించుకున్నాడు. డెబెనేర్‌లో చేరగానే వినోద్ అమెరికన్ లైబ్రరీకి వెళ్లి ''ఎస్క్వైర్'', ''న్యూయార్కర్'' వంటి మ్యాగజైన్ల పాత సంచికలు తిరగవేస్తూ ఏ డిజైన్ కంటికి నదురుగా వుంటుందో అవగాహన ఏర్పరచుకోసాగాడు. లెండింగ్ లైబ్రరీకి వెళ్లి ''ప్లేబోయ్'', ''పెంట్‌హౌస్'' వంటి గర్లీ మ్యాగజైన్లను గంటల లెక్కన అద్దెకు తీసుకుని, ఎటువంటి ఫోటోలు ఆకర్షణీయంగా వుంటాయో గమనించసాగాడు. డిజైన్ బాగా నచ్చిన పేజీ ఏదైనా కనబడితే ఫోటో కాపీ చేయించేవాడు. లండన్ నుంచి వచ్చే ''అబ్జర్వర్''తో ఆదివారాలు వుచితంగా వచ్చే కలరు సప్లిమెంట్లు సేకరించి వాటిలో ఏ శీర్షికలు తీసుకోవచ్చో ఆలోచించేవాడు.బుక్ రివ్యూ సెక్షన్ డిజైన్ వాటిల్లోంచి తీసుకున్నాడు. ''ప్లేబోయ్'' నుంచి ఇంటర్వ్యూ ఐడియా తీసుకున్నాడు. మ్యాగజైన్లో హై కల్చరల్ స్టఫ్ – సాహిత్యం, రాజకీయం, సొసైటీ, సంస్కృతి యిలాటివాటితో నింపాలనుకున్నాడు.
అసలుది, అన్నిటికంటె క్లిష్టమైన పని – మోడల్స్ వెతకడం. ఫారిన్ న్యూడ్ ఫోటోల కోసం కింగ్ ఫీచర్స్‌తో ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో ఫోటోకు వారికి రూ.40 చెల్లించేవారు. అప్పట్లో యిండియాలో మామూలు మోడల్స్ దొరకడమే కష్టం. ఇలాటి ఫోటోల కంటె దాదాపు అసాధ్యం. ఎవరైనా ఒప్పుకున్నారంటే వాళ్లు అందంగా వుండరని ముందుగానే వూహించేయవచ్చు. పత్రిక ఆర్థికపరిస్థితి చూస్తే పోటోకు రూ.250 కంటె ఎక్కువ యిచ్చే వెసులుబాటు లేదు. మరెలా? హిప్పీలు, జూనియర్ ఆర్టిస్టులు, వేశ్యలు, ఉద్యోగం పోయిన కాబరే ఆర్టిస్టులు – వీళ్లకోసం వెతికేవారు. ఏం చేసినా ఆ విభాగంలో క్వాలిటీ చీప్‌గా వుంటుందని భావించిన వినోద్, తక్కిన విభాగాల్లో హై క్వాలిటీ యివ్వడానికి చూశాడు. అందువలన పెద్దపెద్ద రచయితలను, జర్నలిస్టులను తీసుకుని వచ్చి రాయించాడు. అయితే యిది అంత సులభంగా జరగలేదు. డెబెనేర్కు రాయడానికి ఎవరూ ముందుకు రాలేదు. పత్రిక మూతపడే థలో వుంది, పాత ఎడిటరు పారిపోయాడు. కొత్త ఎడిటరుకు పత్రికానుభవం లేదు. రచయితగా చూద్దామన్నా రాసిన రెండు పుస్తకాల్లో ఒకటి బొంబాయి రాత్రి జీవితం గురించి! వినోద్ వెళ్లి అడిగిన రచయితలందరూ 'మీ సంపాదకత్వంలో కొన్ని సంచికలు వెలువరించి అప్పుడు కనబడండి' అనసాగారు. పెళ్లయితే తప్ప పిచ్చి కుదరదు… సామెతలా అయింది.
ఇక దానితో అనేక మారుపేర్లు పెట్టుకుని యితనే చాలా ఆర్టికల్స్, ఫీచర్స్ రాశాడు. జైసన్స్లో తన వద్ద పనిచేసిన కాపీరైటర్ చేత యింకో ఆర్టికల్ రాయించాడు. ఎవరైనా ప్రఖ్యాతుడితో యింటర్వ్యూ వేస్తే పేరు వస్తుంది. ఎవరిని అడగాలి? ఆలోచించి, ఆలోచించి టైగర్ పటౌడీని ప్రాధేయపడుతూ ఒక ఉత్తరం రాశాడు. ఆయన ఏ కళన వున్నాడో సరేనన్నాడు. హమ్మయ్య అనుకుని యిక ఫీచర్స్ కొన్ని పెట్టాడు – 'ద ఉమన్ ఐ ఫాంటసైజ్డ్..', 'ప్స్ట్…' 'ద న్యూ మొరాలిటీ..' యిలా. ఇక నార్మన్ మెయిలర్, నీషే, హెన్రీ మిల్లర్, మాస్టర్స్ అండ్ జాన్సన్.. వంటి రచయితలు యిచ్చిన కొన్ని ఆలోచనాత్మక, వివాదాస్పద కొటేషన్స్‌తో మరో ఫీచర్ తయారైంది. తనే పుస్తక సమీక్షకుడి అవతారం ఎత్తి గోరే విడాల్ ''బర్'' పుస్తకాన్ని సమీక్షించాడు. ''న్యూ స్టేట్స్‌మన్'', ''న్యూయార్కర్'' నుండి కార్టూన్లు సేకరించి వారి సౌజన్యం అని వేస్తూ కార్టూన్లు వేశాడు. ఇవన్నీ ఎలాగోలా తయారైనా అసలు విషయం.. అదే సెంటర్ స్ప్రెడ్ మాత్రం చీదేసింది. ఫోటోగ్రఫీ, ఈస్థటిక్స్, వక్షసంపద – ఏవీ బాగా లేవని వినోదే రాసుకున్నాడు. తన సంపాదకీయంలో ''డెబెనేర్ యింకాస్త ధైర్యం చూపించాలని కోరుకునే పాఠకులకు నా మనవి ఒకటే – నేనూ మీ పార్టీయే. కాస్త టైమివ్వండి, మనం జయిస్తాం. ఈ లోపున కాస్త కల్చర్ గట్రా చొరబడనివ్వండి'' అని రాశాడు.
ఈ సీరీస్‌ను ఔత్సాహిక సంపాదకుల కోసం, పబ్లిషర్ల కోసం రాస్తున్నాను కాబట్టి నేను గమనించిన కొన్ని విషయాలు జోడిస్తున్నాను. పత్రికా రంగానికి వెలుపల వుండేవాళ్లు సంపాదకుడు అంటే – పంపించిన రచనలు చదవడానికి తీరిక లేనివాడు, రచయితల పట్ల నిరంకుశంగా ప్రవర్తిస్తూ, టాలెంటు వున్నవాళ్లను కూడా గుర్తించకుండా, గుర్తింపు యివ్వకుండా వేధించేవాడు అనుకుంటారు. 'హాస్యం/శృంగారం/క్రైమ్/సంగీతం/మంచి సాహిత్యం – యిలా ఏదో సబ్జక్ట్‌తో మంచి పత్రికో, వెబ్సైటో, టీవీ ఛానెలో, టీవీ సీరియలో పెడదామనుకుంటున్నాం, నేనే ఎడిటరుగా వుందామనుకుంటున్నాను. పెట్టుబడీ నాదే. ఏదైనా సలహా చెప్పండి' అని నన్ను చాలామంది అడుగుతూంటారు. మనం ఫలానా అంశంతో పత్రిక పెడుతున్నాం అని ప్రకటన యివ్వగానే కుప్పలుతిప్పలుగా వచ్చి పడే రచనల్లోంచి మంచివి ఏరుకోలేక అవస్థపడడ మొకటే కష్టం అని సాధారణంగా అనుకుంటారు. కుప్పలుగా వచ్చిపడేవాటిలో మనకు పనికి వచ్చేవి బహు తక్కువ. సంపాదకులే మంచి రచయితలను వేటాడి, బతిమాలి రాయించుకోవలసిన పరిస్థితి వుందని చాలామందికి తెలియదు. చాలా విభాగాల్లో మంచి రచయితలే లేరు. వాళ్లకు బోల్డు ఆప్షన్లు. మనదానికే ఎందుకు రాయాలనుకుంటారు. పారితోషికం కంటె సర్క్యులేషన్ ముఖ్యం. ఎంత ఎక్కువమందికి చేరితే అంత మంచిదని ప్రతీవాడూ అనుకుంటాడు. పత్రిక ఎదిగితే తప్ప వారు రాయరు, వారు రాస్తే తప్ప పత్రిక ఎదగదు. పేరున్నవారు రాసినా అది మన పత్రిక కారెక్టరుకు సూటవ్వాలి.
సంపాదకుడు/పబ్లిషరు తను ఒక విభిన్నమైన పబ్లికేషన్ తెస్తున్నానని అనుకుంటాడు. రన్ ఆఫ్ ద మిల్ పత్రిక తెచ్చేదానికి తనెందుకు? అనుకుంటాడు. రాయడానికి ముందుకు వచ్చే ప్రసిద్ధ/ఔత్సాహిక రచయిత తనకు కావలసిన ధోరణిలో రాయకపోతే ఆయన చేత రాయించి ప్రయోజనం లేదు. కొందరు రచయితలకు తమ రచనలను ఎడిట్ చేస్తే కోపం. తగ్గిస్తే కోపం. పూర్తిగా వేయడానికి చోటు చాలకపోవచ్చు. నిడివి తగ్గించకపోతే ఆసక్తికరంగా వుండదని ఎడిటరు అనుకోవచ్చు. రచన దొరకగానే సరిపోదు, దానికి తగ్గ బొమ్మ వేయించాలి, దాన్ని అందంగా రూపుదిద్దగల లే ఔట్ ఆర్టిస్టు దొరకాలి. ఆ తర్వాతివి సాంకేతిక విషయాలు, మంచి పేపరు, క్వాలిటీ ముద్రణ గట్రా. ఆ పైన మార్కెటింగ్ – పంపిణీ చేయడానికి మంచి ఏజంటు దొరకాలి, దుకాణానికి వెళ్లాక కొత్త పుస్తకం వచ్చిందని పదిమందికి తెలియడానికి దుకాణాల్లో ప్రముఖంగా డిస్ప్లే చేయించాలి. ధర అందుబాటులో వుందని పాఠకుడు ఫీలవ్వాలి. ఇన్ని చేస్తే పాఠకుడికి పత్రిక చేరుతుంది. అతను మెచ్చితేనే పత్రిక నిలబడుతుంది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)