ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమానే. తగ్గేదేలే అన్నంతగా దూసుకుపోతోంది టాలీవుడ్. 2024లో కూడా చిత్ర పరిశ్రమ ప్రభంజనం కొనసాగింది. ఎప్పట్లానే విజయాల శాతం సింగిల్ డిజిట్ దాటనప్పటికీ, సక్సెస్ అయిన సినిమాలు మాత్రం సరిహద్దులు దాటేశాయి. రికార్డ్ కలెక్షన్లతో యావత్ దేశం ఆశ్చర్యపోయేలా చేశాయి.
కేవలం మాస్ సినిమాలు, హీరోయిజం ఉన్న చిత్రాలకే పరిమితమైపోలేదు టాలీవుడ్. ఓవైపు ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోల సినిమాల్ని ఆదరిస్తూనే, మరోవైపు విభిన్నమైన కథాంశాలతో వచ్చిన చిన్న సినిమాలకు బ్రహ్మరథం పట్టారు తెలుగు ప్రేక్షకులు. మాస్-కమర్షియల్ సినిమాలకు తోడు ఈ విలక్షణత కూడా కలవడంతో 2024లో టాలీవుడ్ కు ఓ కొత్త కళ వచ్చింది.
వెయ్యి కోట్లు.. విస్తరించిన సామ్రాజ్యం
అప్పట్లో బాహుబలి-2 సినిమా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించి చరిత్ర సృష్టిస్తే, 2024లో వెయ్యి కోట్ల సినిమాలు 2 రావడం విశేషం. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న పుష్ప-2తో పాటు, కల్కి సినిమాలు వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించి టాలీవుడ్ స్టామినా చాటాయి. ఇప్పటివరకు 8 సినిమాలు ఈ ఘనత సాధించగా, అందులో 4 సినిమాలు టాలీవుడ్ వే కావడం విశేషం. ఈ క్రమంలో టాలీవుడ్ మార్కెట్ గణనీయంగా పెరగడం విశేషం. పుష్ప-2 సినిమా కేవలం వారం రోజుల్లో వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిందంటే, తెలుగు సినిమా మార్కెట్ పరిధి ఎంతగా విస్తరించిందో అర్థమౌతుంది.
విజయాలతో టాలీవుడ్ కు కొత్త కళ
2024లో టాలీవుడ్ మంచి విజయాలు సాధించింది. బాలీవుడ్, కోలీవుడ్ తో పోలిస్తే, టాలీవుడ్ లోనే విజయాల శాతం ఎక్కువ. ఈ క్రమంలో హనుమాన్ సినిమా ఊహించని విజయాన్నందుకుంది. తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ ఫాంటసీ అడ్వెంచర్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఓవర్సీస్‌లో 5 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి, యూఎస్ ఆల్ టైమ్ టాలీవుడ్ టాప్-10 చిత్రాల జాబితాలోకి చేరింది. టికెట్ రేట్లు పెంచకుండానే ఈ ఘనత సాధించింది హనుమాన్.
కల్కి, పుష్ప-2, హనుమాన్ సినిమాల తరహాలోనే దేవర-1 కూడా 2024 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అంచనాలు అందుకుంది. ఇక డిఫరెంట్ కథలు, క్యారెక్టర్స్ ఎంచుకునే నాని.. ఈ ఏడాది సరిపోదా శనివారం సినిమాతో హిట్ కొట్టాడు. మరోవైపు దుల్కర్ సల్మాన్ కూడా లక్కీ భాస్కర్ సినిమాతో సక్సెస్ అందుకోగా.. నా సామిరంగ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ సాధించి, హిట్ సినిమాల జాబితాలో చేరింది.
చిన్న సినిమాలు.. ఊహించని విజయాలు
ఏమాత్రం అంచనాల్లేకుండా వచ్చిన కొన్ని సినిమాలు, ఊహించని విజయాలందుకున్నాయి. బన్నీ వాస్ నిర్మించిన ఆయ్ సినిమా బడ్జెట్ కు తగ్గట్టు వసూళ్లు రాబట్టి హిట్ అనిపించుకోగా.. నిహారిక కొణెదల నిర్మాతగా మారి తీసిన కమిటీ కుర్రోళ్లు చిత్రం కూడా కంటెంట్ తో ఆకట్టుకుంది.
జీబ్రా అనే మరో చిన్న సినిమా కూడా గ్రిప్పింగ్ నెరేషన్ తో ఆడియన్స్ ను మెప్పించగా.. 35- చిన్న కథ కాదు అనే సినిమా ఎమోషనల్ కంటెంట్ తో హృదయాలను హత్తుకుంది. ఇక ‘క’ అనే చిన్న సినిమా అయితే అదిరిపోయే ట్విస్టులతో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా భారీ చిత్రాలతో పాటు, చిన్న సినిమాలు కూడా విజయం సాధించడం టాలీవుడ్ కే చెల్లింది.
మెరిసిన సీక్వెల్స్
సీక్వెల్స్ కలిసిరావనే నెగెటివ్ సెంటిమెంట్ కు 2024లో పూర్తిస్థాయిలో చెక్ పడింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది పుష్ప-2 సినిమా. పుష్ప-1 సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ ఈ ఏడాది టాలీవడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాదు, ఈ ఇయర్ ఇండియాలోనే భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఇక డీజే టిల్లూకు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా బ్లాక్ బస్టర్ హిట్టయింది. అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ, అంచనాలు అందుకుంటూ ఏకంగా 100 కోట్ల వసూళ్లు సాధించింది. ఇక పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన మత్తు వదలరా-2 సినిమా కూడా ప్రేక్షకులకు భారీగా వినోదాన్నందించి, బాక్సాఫీస్ ను కొల్లగొట్టింది.
డబ్బింగ్ మెరుపులు కూడా..
ఎప్పట్లానే ఈ ఏడాది కూడా కొన్ని డబ్బింగ్ చిత్రాలు మెరిశాయి. అయితే హిట్టవుతాయని భావించిన డబ్బింగ్ సినిమాలు ఫ్లాప్ అవ్వగా, ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన సినిమాలు సక్సెస్ అవ్వడం విశేషం. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది అమరన్ సినిమానే. శివ కార్తికేయన్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ బయోపిక్ తెలుగులో సైలెంట్ హిట్టయింది.
ఇక రజనీకాంత్ నటించిన వేట్టయాన్ సినిమా కూడా మిక్స్ డ్ టాక్ తో మొదలై సక్సెస్ ఫుల్ వెంచర్ అనిపించుకుంది. కార్తి, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ పోషించిన సత్యం సుందరం సినిమా బాక్సాఫీస్ బరిలో భారీ కాంపిటిషన్ మధ్య కమర్షియల్ గా వెనక్కు తగ్గినప్పటికీ.. కంటెంట్ పరంగా ఈ సినిమా సూపర్ హిట్టయింది. సత్యం సుందరం సినిమాకు కల్ట్ అభిమానులు ఏర్పడ్డారంటే ఈ సినిమా గొప్పదనాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఓటీటీ.. ఈ లెక్క వేరు
థియేటర్లతో సమానంగా ఓటీటీ రిలీజెస్ పై కూడా 2024లో జనాల ఫోకస్ పెరిగింది. అప్పటికే థియేటర్లలో విడుదలైనప్పటికీ, ఓటీటీలో సదరు సినిమా ఫలితం ఎలా ఉందో తెలుసుకోవాలనే ప్రయత్నం జరిగింది. థియేటర్లలో ఆల్రెడీ హిట్టయిన సినిమాకు ఓటీటీలో ఎలాగూ ఆదరణ దక్కుతుంది. అయితే థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాలు కొన్ని ఓటీటీ వీక్షకుల ఆదరణ పొందడం విశేషం. వీటిలో ఆరంభం, పేక మేడలు, మారుతీనగర్ సుబ్రమణ్యం లాంటి సినిమాలున్నాయి.
రీ-రిలీజెస్.. మరోసారి కిక్కు
టాలీవుడ్ లో స్ట్రయిట్ సినిమాలతో సమానంగా కొనసాగుతున్న సంప్రదాయం రీ-రిలీజ్. కరోనా తర్వాత ఊపందుకున్న ఈ ట్రెండ్, 2024లో కూడా కొనసాగింది. స్టార్ హీరోలు నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలు మరోసారి ప్రేక్షకులముందుకొచ్చాయి. ఏడాదిలో దాదాపు ప్రతి నెల ఇలాంటి సినిమాలు రాగా, కేవలం కొన్ని మాత్రమే ఆకట్టుకున్నాయి. రవితేజ కిక్, పవన్ కల్యాణ్ వకీల్ సాబ్, చిరంజీవి ఇంద్ర సినిమా, ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు-నేను, బాలకృష్ణ చేసిన నరసింహనాయుడు సినిమాలు ఈ ఏడాది రీ-రిలీజెస్ జాబితాలో క్లిక్ అయ్యాయి.
Vettayan hit entra nayana ..
y not maharaja