ఎమ్బీయస్‍: ఇతర భాషల్లో రాజేశ్వర రావు

తెలుగు సంగీతానికి ఎస్.రాజేశ్వర రావు చేసిన సేవ గురించి వేరే చెప్పనవసరం లేదు. అయితే ఆయన ప్రతిభ కేవలం తెలుగుసీమకు పరిమితం కాలేదు.

తెలుగు సంగీతానికి ఎస్.రాజేశ్వర రావు చేసిన సేవ గురించి వేరే చెప్పనవసరం లేదు. అయితే ఆయన ప్రతిభ కేవలం తెలుగుసీమకు పరిమితం కాలేదు. అసలు రాజేశ్వరరావు బహుముఖ ప్రజ్ఞను దేశమంతా చాటిచెప్పిన “చంద్రలేఖ” తమిళనాట తయారయినదే! తమిళం, తెలుగు, హిందీలలో ఒకేసారి జెమినీ స్టూడియో ద్వారా నిర్మితమైన ఆ సినిమా సంగీతం అతి విస్తృతమైనది. ఇటు కర్ణాటక సంగీతం నుండి అటు జిప్సీ డాన్సుల వరకూ ఆ సినిమాలో వినబడని సంగీతం, వాయిద్యం లేదంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమాకి సంగీతం సమకూర్చేనాటికి రాజేశ్వరరావుకు 26 యేళ్లే అయినా ఆయన కుటుంబనేపథ్యం, అనుభవాల కారణంగా అసాధ్యమైన ఆ కార్యాన్ని సుసాధ్యం చేయగలిగారాయన.

ఇక్కడ రాజేశ్వరరావు గారి నాన్నగారు సన్యాసి రాజు గారి గురించి చెప్పాలి. ఆయన మృదంగ విద్వాంసుడు. హార్మోనియం, తబలా కూడా వచ్చు. గేయకర్త కూడా. విజయనగరం రాజా వారి ఆస్థానంలో పని చేసేవారు. రాజావారి సంగీత కళాశాలలో ప్రిన్సిపాల్‌గా ఉన్న ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వద్ద తన పెద్ద కొడుకు హనుమంతరావుని, అతని కంటె ఐదేళ్లు చిన్నవాడైన రెండో కొడుకు రాజేశ్వరరావుని చేర్పించారు. మరో పక్క అదే ఊరివారైన ఆదిభట్ల నారాయణ దాసు గారి వద్ద రాజేశ్వరరావుకి హరికథలు నేర్పించారు. రాజేశ్వరరావు చైల్డ్ ప్రాడిజీ. ఏడేళ్ల వయసులోనే కచ్చేరీ చేశారు. తండ్రి వెంట వెళ్లి అనేక ఊళ్లలో హరికథలు, కచ్చేరీలు చేసేవారు. నాటకాల్లో వేషాలు కూడా వేసేవారు.

ఎచ్ఎంవి రికార్డింగు కంపెనీ వారు ఈయన్ని బెంగుళూరు తీసుకెళ్లి కొన్ని లలిత గీతాలు పాడించుకున్నారు. వేల్ పిక్చర్స్ వారు ‘‘శ్రీకృష్ణలీలలు’’ (1935)లో కృష్ణుడి వేషానికి ఎంపిక చేశారు. అప్పుడాయన వయసు 13. తర్వాతి ఏడాది అదే నిర్మాత తీసిన ‘‘మాయాబజారు’’లో యీయన బాల అభిమన్యుడిగా వేశారు. అవి చూసి న్యూ థియేటర్స్ వారు ‘‘కీచకవధ’’ తీస్తూ ఉత్తరుడి వేషం యిస్తానంటే సన్యాసి రాజు గారు యీయన్ని తీసుకుని కలకత్తా వెళ్లారు. అక్కడ కెఎల్ సైగల్ దగ్గర శిష్యుడిగా చేర్చి హిందీ పాటలు, లలిత సంగీతం నేర్పుకునేట్లా చేశారు. సైగల్‌కి యీయన ఎంతో నచ్చి ఒక హార్మోనియం బహుమతిగా యిచ్చారు. ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ ప్రాపకంలో హిందూస్తానీ సంగీతం నేర్పించారు. న్యూ ధియేటర్స్ ఆర్కెస్ట్రాలో ఉన్న ఆర్ సి బోరల్, పంకజ్ మల్లిక్ గార్లకు పరిచయం చేసి వారి నుండి వాద్య సమ్మేళనం నేర్చుకునేట్లా చేశారు.

ఇవన్నీ రాజేశ్వరరావుకి వివిధ రకాల సంగీతాలపై పట్టు సాధించేందుకు తోడ్పడ్డాయి. వీటికి తోడు ఆయన జీవితాంతం పాశ్చాత్య సంగీతం కూడా వింటూ నేర్చుకునే వారు. దాన్ని తనకు అనుగుణంగా మార్చుకుంటూ ఉండేవారు. 1938లో తండ్రి మద్రాసుకి తీసుకుని వచ్చాక స్వంతంగా ఓ ట్రూప్ తయారు చేసుకుని జయరామయ్యర్ అనే ఆయనకు అసిస్టెంటుగా రాజా శాండో తీసిన “విష్ణులీల” అనే తమిళ సినిమాకు సంగీతాన్నందించారు. అలా సంగీత దర్శకుడిగా రాజేశ్వరరావు ప్రస్థానం ఓ తమిళ సినిమా తోనే ప్రారంభమయింది! దానిలో బలరాముడిగా వేషం వేసి, కొన్ని తమిళగీతాలు కూడా ఆలపించారు. 60 సంవత్సరాల కెరియర్లో ఆయన అసిస్టెంటుగా పనిచేసిన సినిమా “విష్ణులీల” ఒక్కటే!

ఆ తర్వాతి సంవత్సరమే “వసంతసేన” అనే కన్నడ సినిమాకి ఆర్.సుదర్శనం సంగీత దర్శకత్వం వహించగా రాజేశ్వరరావు కొన్ని పాటలకు ట్యూన్లు అందించారు. అదే సంవత్సరంలో చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో వచ్చిన “జయప్రద” (పురూరవ చక్రవర్తి) (1939) అనే తెలుగు సినిమాతో పూర్తి స్థాయి సంగీత దర్శకుడు అయిపోయారు. అప్పటికి ఆయనకు 18 ఏళ్లు. సినిమా అపజయం పాలవడంతో యింకెవరూ ఛాన్సు యివ్వలేదు. గూడవల్లి రామబ్రహ్మం గారు “ఇల్లాలు” (1940)కి తీస్తూ రాజేశ్వరరావుకి భావకవి వేషం ఆఫర్ చేశారు. సంగీతానికి పెట్టుకున్నది బి.యన్.ఆర్. అనబడే భీమవరపు నరసింహారావు. వేషం వేస్తూన్నందుకు రాజేశ్వరరావుకి తృప్తి లేదు. ఇంత పెద్ద బ్యానర్‌లో సంగీతదర్శకుడిగా గుర్తింపు తెచ్చుకుంటే బాగుంటుంది కదా అనుకుని తండ్రితో చెప్పుకున్నారు.

సన్యాసి రాజు గారు రామబ్రహ్మం గారి వద్దకు వెళ్లి ‘వేషం మాట అటు ఉంచండి. మీరు మ్యూజిక్ డైరక్షన్ ఛాన్సివ్వండి. మాకు పారితోషికం అక్కరలేదు.’’ అన్నారు. రామబ్రహ్మం గారు “వేషం ఇచ్చాను, పాట పాడమంటున్నాను. 18 యేళ్ల కుర్రాడికి మ్యూజిక్ డైరక్షన్ ఎందుకు? పైగా మాకు మా ఆస్థాన సంగీతదర్శకుడు బి.యన్.ఆర్.ని ఎలా వదులుకుంటాను?” అన్నారు. కానీ బిఎన్‌ఆర్‌తో యీ విషయం చెప్పారు. ‘‘నేను ప్రస్తుతం బిజీగా ఉన్నాను. కుర్రాడు ముచ్చట పడుతున్నాడు, ఓ ఛాన్సు ఇచ్చి చూడండి” అన్నారు. ఓ జోలపాట ఇచ్చి ట్యూన్ కట్టమన్నారు. బ్రహ్మాండంగా కుదిరింది. బిఎన్‌ఆర్, రామబ్రహ్మం గార్లు భేష్ అన్నారు. రాజేశ్వరరావు కోరిక తీర్చారు. డబ్బు కూడా యిచ్చారు.

‘‘ఇల్లాలు’’లో ఒక జంటగా రాజేశ్వరరావు, బాలసరస్వతీదేవి నటించారు. వాళ్లిద్దరూ అంతకుముందు సన్యాసిరాజుగారు రాసిన పాటలను ప్రైవేటు రికార్డులుగా యిచ్చారు. ‘‘ఇల్లాలు’’ మ్యూజిక్ వర్క్ జెమినీ స్టూడియోలో జరగడంతో జెమినీ అధినేత వాసన్ కళ్లలో రాజేశ్వరరావు పడ్డారు. ‘‘నువ్వు నటన, సంగీతం రెండిటిలో ఏదో ఒకదాన్నే ఎంచుకో.’’ అన్నారు సంగీతదర్శకత్వాన్ని ఎన్నుకున్నారు. “ఇల్లాలు” యే నటుడిగా ఆయన ఆఖరి చిత్రం!

తన 19వ ఏట జెమినీలో మ్యూజిక్ విభాగంలో 600 రూ॥ల నెల జీతానికి చేరారు. జెమినీలో ఉండగానే ‘‘మదన కామరాజన్’’ (1941), ‘‘నందనార్’’ (1942), ‘‘మంగమ్మా శబదం’’ (1943), ‘‘దాసి అపరంజి’’ (1944), ‘‘చంద్రలేఖ’’ (1948), ‘‘చక్రధారి’’ (1948) తమిళ సినిమాలకు పని చేశారు. ఎండి పార్థసారథి నేపథ్య సంగీతంలో సహకరించేవారు. బాణీలు మాత్రం రాజేశ్వరరావువే! ‘‘చంద్రలేఖ’’ తెలుగు, హిందీ వెర్షన్‌లకు. ‘‘అపూర్వ సహోదర్‌గళ్’’ (1949) తమిళ, హిందీ వెర్షన్ (‘‘నిషాన్’’) కూడా ఆయనే సంగీతమిచ్చారు. అక్కడ ఉండగానే యితరులకు ‘‘కామధేను’’ (1941), ‘‘భక్త నారదర్’’ (1942), ‘‘దాసిపెణ్’’ (1943), ‘‘మిస్ మాలిని’’ (1947)లకు పని చేశారు. ఆయన చేసిన తెలుగు సినిమాల గురించి యిక్కడ ప్రస్తావించటం లేదు.

“చంద్రలేఖ” తయారయ్యే నాటికి అది ఆయన జీతం 1500 రూ॥లకు పెరిగింది. చంద్రలేఖ మ్యూజిక్ తయారయేందుకు ఒక ఏడాది పట్టింది. డ్రమ్‌లపై డాన్సు దృశ్యానికే చాలా టైము తినేసింది. అటు డాన్సర్లు డాన్సు చేయడం, ఇటు వీళ్లు దానికి తగ్గట్టు మ్యూజిక్ ఇస్తూ రిహార్సలు చేయడం! ఆఫ్రికన్ వార్ ట్రూపు ఓ దాన్ని పట్టుకుని అనేక రకాల డ్రమ్‌లు తెప్పించుకున్నారు. వాటిల్లో ఆఫ్రికావి, ఈజిప్టువి, పెర్షియన్‌వి అన్నీ ఉన్నాయి. పియానో, పది డబుల్ బాస్ వయోలిన్స్, డ్రమ్స్ పెట్టుకుని వంద వాయిద్యాల పెట్టు సంగీతాన్ని సృష్టించారు రాజేశ్వరరావు. కలకత్తాలో ఉండగా సితార, సుర్‌బహార్, తబలా, డోలక్, మృదంగం నేర్చుకున్న రాజేశ్వరరావు తర్వాతి కాలంలో పియానో, హార్మోనియం, మాండోలిన్, ఎలక్ట్రిక్ గిటార్ నేర్చుకుని ఆర్కయిస్ట్రజేషన్‌లో అందె వేసిన చేయి అయ్యారు. అదే “చంద్రలేఖ”కు ఉపకరించింది.

“అపూర్వ సహోదరగళ్”, ‘‘నిషాన్’’ (1950) జెమినీలో ఉండగా ఆయన చేసిన ఆఖరి సినిమాలు. “మల్లీశ్వరి” (1951) నుండి తెలుగు తెరపై ఆయనకు ఎదురులేకపోయింది. అప్పటినుండి తెలుగు సినిమాలకే ఆయన ఎక్కువ సమయం కేటాయించినా ఆయన యితర భాషా సినిమాలకు సంగీతాన్నిచ్చారు. తెలుగు-తమిళం ద్విభాషా చిత్రాలలో ‘‘విప్రనారాయణ’’ (1954), ‘‘మిస్సమ్మ’’- “మిస్సియమ్మ” (1955), ‘‘భలేరాముడు’’-‘‘ప్రేమపాశం’’ (1956), ‘‘చరణదాసి’’- ‘‘మాదరకుల మాణిక్యమ్’’ (1956), “అలాఉద్దీన్ అద్భుతదీపం” (1957, దీనికి హిందీ వెర్షన్ కూడా ఉంది), ‘‘భలే అమ్మాయిలు’’- ‘‘ఇరు సహోదరిగళ్’’ (1957),‘‘సతీ సావిత్రి’’- ‘‘సత్యవాన్ సావిత్రి’’ (1957), ‘‘చెంచులక్ష్మి’’ (1958), ‘‘అప్పుచేసి పప్పుకూడు’’- ‘‘కడన్ వాంగి కళ్యాణం’’ (1958).‘‘నమ్మినబంటు’’– ‘‘పాట్టాలియన్ వెట్రి’’ (1960), ‘‘భక్త ప్రహ్లాద’’ (1967), ‘‘బాలభారతం’’ (1972 – దీనికి కన్నడ, హిందీ వెర్షన్లు కూడా ఉన్నాయి).

తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రాలలో బిఎస్ రంగా గారి ‘‘అమరశిల్పి జక్కన’’ – “అమరశిల్పి జక్కణాచారి” (1964) ఉంది. అప్పటిదాకా రాజేశ్వరరావు అన్నగారు హనుమంత రావు (ఈయన స్టార్ మ్యూజిక్ డైరక్టరు కాలేకపోయారు) గారి చేత మ్యూజిక్ చేయించుకుంటూ వచ్చిన రంగా అప్పణ్నుంచి యీయన చేతనే ‘‘భలే బసవ’’ (1969), ‘‘మన్నిన మగళు’’ (1973) అనే కన్నడ సినిమాలతో పాటు ‘‘సిరిప్పియిన్ సెల్వన్’’ (1964) అనే తమిళ సినిమాకు కూడా చేయించుకున్నారు. ఇతరులకు చేసిన కన్నడ సినిమాల్లో ‘‘బాలనాగమ్మ’’ (1966), ‘‘స్నేహ-సేదు’’ (1978), “ఒందు హెణ్ను ఆరు కణ్ను” (1980) ఉన్నాయి. జెమినీ లోంచి బయటకు వచ్చాక విడిగా చేసిన తమిళ సినిమాలలో ‘‘వాళ పిరందవళ్’’ (1953), ‘‘పానై పిదిదవిల్ భాగ్యశాలి’’ (1958), “అవళ్ యార్” (1959), “విక్రమాదిత్యన్” (1962) ఉన్నాయి.

రాజేశ్వరరావు గారి ఆఖరి చిత్రం ‘‘అమెరికా అబ్బాయి’’ (1987), 1974 తర్వాత రెండు కన్నడ సినిమాలకు తప్ప వేరే భాషా చిత్రాలకు పని చేయలేదు. ‘‘చరణదాసి’’ (1956) సినిమాకు పని చేసే రోజుల్లో విపరీతమైన పని ఒత్తిడి వలన రెండేళ్ల పాటు మతి స్థిమితం లేకుండా పోయింది. ఆయన వీరాభిమాని ఐన డా. మేనోన్ అనే ఆయన స్వయంగా ట్రీట్‌మెంట్ యిచ్చి బాగు చేశారు. అంత బిజీగా ఉన్న రాజేశ్వరరావు మహదేవన్ ధాటికి మూడేళ్లు సినిమాలు లేక ఖాళీగా ఉండాల్సి వచ్చింది. సినిమాలు లేనప్పుడు ప్రైవేటు ఆల్బమ్స్ చేస్తూ పోయారు. అలా 110 ప్రైవేటు ఆల్బమ్స్ చేశారు.

‘‘తాండ్ర పాపారాయుడు’’ (1986) సినిమాకు పని చేస్తూండగా సెరిబ్రల్ పెరాలిసిస్ వచ్చింది. 1999లో 74వ ఏట కన్ను మూశారు. “మిస్సమ్మ” ను “మిన్ మేరీ”గా తీస్తూ ఎవిఎమ్ వారు హేమంత్‌ కుమార్‌ను సంగీతదర్శకుడిగా పెట్టుకున్నారు. ఆయన అన్ని పాటల ట్యూన్లూ మార్చేశాడు కానీ రాజేశ్వరరావు అనుమతి తీసుకుని ‘బృందావనమది..’ ట్యూన్‌ని మాత్రం వాడుకున్నాడు. ఆయనకా పాట అంత బాగా నచ్చింది. రాజేశ్వరరావు ప్రజ్ఞకు సాటి మేటి సంగీత దర్శకుడు యిచ్చిన గౌరవమది! (సినిమా ఫోటోల వివరాలు – వైజయంతిమాల తల్లి వసుంధరాదేవి, రంజన్ నటించిన ‘‘మంగమ్మా శబదం’’, కళ్యాణ కుమార్, బి సరోజాదేవి నటించిన ‘‘అమరశిల్పి జక్కణాచారి’’, టి ఆర్ రాజకుమారి, రంజన్ నటించిన ‘‘చంద్రలేఖ’’) 

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2024)

[email protected]

14 Replies to “ఎమ్బీయస్‍: ఇతర భాషల్లో రాజేశ్వర రావు”

  1. సెరిబ్రల్ పెరలసిస్ క్రియేటివ్ కళా రంగాల్లో వారికే ఎక్కవ రావడం దురదృష్ట కరము.

    ఈ మధ్యనే వైజాగ్ సంగీత కారుడు గారు కూడా ఇదే శారీరక రుగ్మత వలన దూరం అయ్యారు.

    సమయానికి తిండి, నిద్ర అనేవి సినిమా రంగంలో వారికి కుదరవు, మరి వాటి ప్రభావం వలన కూడా మెదడు ఎక్కవ శ్రమ పడి అలాంటి వ్యాకులత చేకూరుతుంది ఏమో.

  2. ఆర్టికిల్ బాగుంది, ఒందు హెణ్ణు ఆరు కణ్ణు చిత్రం విడుదల అయినపుడు నేను బెంగళూరులో చూసాను. రాజేశ్వరరావు సంగీతం అందించగా తెలుగు దర్శకుడు వి. మధుసూదనరావు దర్శకత్వం చేసారు (కానీ ఈ చిత్రం ఏ తెలుగు చిత్రానికీ రీమేక్ కాదు). పాటలు ఏమంత గొప్పగా లేవు.

  3. స్వీట్, రాజేశ్వరరావు గారు సంగీత సామ్రాజ్యము లో ఒక ఆణిముత్యం. చిట్టి చెల్లెలు సినిమాకు, ‘లవ్ ఐస్ బ్లూ’ కాపీ కొట్టారని ఇప్పటికి సోషల్ మీడియా లో కొంతమంది చులకనగా మాట్లాడతారు. బాలు గారు పాడుతా తీయగా కార్యక్రమాల్లో రాజేశ్వర రావు గురించి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్పేవారు.

    1. హిందీ లో అశోక్ కుమార్ అనే నటుడు కి అప్పట్లోనే 20వేలు ఇచ్చేవారు. అంటే ఇప్పట్లో 200 కోట్లు రెమ్యునరేషన్ తో సమానం.

      అప్పట్లో లాయర్లు కి కూడా నోరు పట్టనంత ఫీజు లు వుండేవి.

      కానీ ఇవన్నీ కూడా చేతి వెళ్ల మీద లెక్క పెట్టగలిగే వారికి మాత్రమే అని గుర్తించాలి.

Comments are closed.