ఓవైపు గేమ్ ఛేంజర్ తొలి పాటపై పెదవి విరుపులు తప్పలేదు. ఇక ఫ్యామిలీ స్టార్ లో వైరల్ అయిన పాట ఒక్కటీ లేదు. భారీ అంచనాలతో వస్తున్న పెద్ద సినిమాల్లో సాంగ్స్ ఇలా నిరాశ పరుస్తున్న వేళ.. దర్శకుడు బుచ్చిబాబు పాటలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
త్వరలోనే రామ్ చరణ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తున్నాడు ఈ దర్శకుడు. తనకు పాటలంటే చాలా ఇష్టమని, కాబట్టి చరణ్ సినిమాలో పాటల విషయంలో తగ్గేదేలేది అంటున్నాడు.
ఈ సందర్భంగా తన సినిమాలో పాటలు అదిరిపోయే రేంజ్ లో వచ్చాయని కూడా చెబుతున్నాడు. చరణ్ సినిమా కోసం రెహ్మాన్ ఆల్రెడీ 3 ట్యూన్స్ కంపోజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాటలన్నీ చాలా బాగా వచ్చాయని, ఫస్ట్ సాంగ్ నుంచే సినిమాలో ప్రతి మూమెంట్ బ్లాస్ట్ అవుతుందని ప్రకటించాడు బుచ్చిబాబు.
బుచ్చిబాబుకు మంచి మ్యూజిక్ టేస్ట్ ఉందనే విషయం తెలిసిందే. ఉప్పెన సినిమా కోసం దేవిశ్రీ నుంచి అతడు మంచి ట్యూన్స్ రాబట్టుకోగలిగాడు. చరణ్ సినిమా కోసం రెహ్మాన్ నుంచి కూడా అలానే మంచి ట్యూన్స్ వచ్చాయని చెబుతున్నాడు ఈ డైరక్టర్.
అంతేకాదు.. ఉప్పెన సినిమాకు మించిన సంగీతాన్ని, పాటల్ని చరణ్ సినిమాలో చూస్తారని హామీ ఇస్తున్నాడు. ఓవైపు పాటలన్నీ డిసప్పాయింట్ చేస్తుంటే, మరోవైపు బుచ్చిబాబు చేసిన ప్రకటన అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.