టిక్కెట్టు ఇస్తున్నాం.. ఇస్తున్నాం అంటూ చివరివరకు ఆశపెట్టడం.. చివరి నిమిషంలో రకరకాల కాలిక్యులేషన్లు, సమీకరణాల నేపథ్యంలో మాట తప్పడం అనేది అన్ని రాజకీయ పార్టీల్లాగా బిజెపిలో కూడా మామూలే. అదేరకంగా సీటు కోల్పోయిన ఒక ప్రముఖుడు స్వామీ పరిపూర్ణానంద.
తెలుగుదేశంతో పొత్తులతో బరిలోకి దిగుతున్న బిజెపి.. హిందూపురం ఎంపీ స్థానాన్ని ఆశించింది. అక్కడినుంచి స్వామి పరిపూర్ణానందను బరిలోకి దింపాలని ప్లాన్ చేసింది. అయితే ఆ పార్టీకి ఆ సీటు దక్కలేదు. అలిగిన పరిపూర్ణానంద ఇప్పుడు హిందూపురంలో స్వతంత్రంగా పోటీచేస్తానని అంటున్నారు. పోటీకి దిగుతారు సరే.. ఆయన తన ఆగ్రహం కారణంగా.. చంద్రబాబు తరఫు అభ్యర్థులను ఎంత పెద్ద దెబ్బకొట్టగలరు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా హిందూ ఓట్లను పోలరైజ్ చేయడానికి భారతీయ జనతా పార్టీకి పరిపూర్ణానంద తొలినుంచి ఒక అస్త్రంగానే ఉన్నారు. గతంలో తెలంగాణ ఎన్నికల్లో కూడా భాజపా ఆయనను ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లింది.
పార్టీ ఎటూ గెలిచే అవకాశం లేదు కాబట్టి- అక్కడ ఏదో హిందూ స్వాములను ఉద్ధరిస్తున్నట్టుగా ఆయనను సీఎం కేండిడేటేగా ప్రకటించారు. ఆ రకంగా- గెలిచే అవకాశం లేనప్పుడు బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్యను తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటించి తెలుగుదేశం ఎన్నికలకు వెళ్లిన వైనాన్ని బిజెపి వారు ఫాలో అయ్యారు. ఆ ఎన్నికల్లో పరిపూర్ణానంద కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. ఇప్పుడు ఏపీ ఎన్నికల యవనికపై హిందూపురం ఎంపీ సీటుపై ఆయనకు ఆశపెట్టారు.
బిజెపి పట్టుపట్టినప్పటికీ.. చంద్రబాబు లొంగలేదు. చంద్రబాబు తీరు పట్ల ఆగ్రహించిన పరిపూర్ణానంద.. ఆయన తనకు టికెట్ ఇస్తే తెలుగుదేశానికి ముస్లింల ఓట్లు పడవు అని అభ్యంతరపెట్టినట్టుగా చెబుతున్నారు. ముస్లిముల ఓట్ల కోసం చంద్రబాబు పరిపూర్ణానందను పణంగా పెట్టారని ఆయన అంటున్నారు.
ముస్లిముల ఓట్ల కోసం చంద్రబాబు 85 శాతం హిందువుల ఓట్లను పణంగా పెట్టారని కూడా నిందిస్తున్నారు. అందువల్ల చంద్రబాబుకు బుద్ధులకు వ్యతిరేకంగా గళం వినిపించడానికి తాను బరిలోకి దిగుతున్నానని చెబుతున్నారు. ఆయనకు నిరాకరింపబడింది ఎంపీ టికెట్ మాత్రమే అయినప్పటికీ.. ఆయన అటు ఎంపీగానూ, ఎమ్మెల్యేగానూ కూడా ఇండిపెండెంటుగా రంగంలో ఉంటారుట.
అంటే.. నందమూరి బాలయ్యకు కూడా చెక్ పెట్టడానికి పరిపూర్ణానంద సిద్ధమైపోతున్నారన్నమాట. ఈ కాషాయాంబర ధారి ఏదో ఆవేశంలో ఇలా చెబుతుండవచ్చుగానీ.. స్వతంత్రంగా బరిలోకి దిగి, కనీసం డిపాజిట్టు తెచ్చుకోగలరా? లేదా, తెలుగుదేశం అభ్యర్థులకు ఎంత మేరకు ఓటునష్టం చేయగలరు? అనే సందేహాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.