మోహన్ బాబుకు స్వల్ప ఊరట

జర్నలిస్టుపై దాడి కేసులో నటుడు మోహన్ బాబుకు తాత్కాలిక ఊరట లభించింది. అతడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.

జర్నలిస్టుపై దాడి కేసులో నటుడు మోహన్ బాబుకు తాత్కాలిక ఊరట లభించింది. అతడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. దీంతో మోహన్ బాబు ఊపిరి పీల్చుకున్నారు. సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైతే, కచ్చితంగా ఆయన అరెస్ట్ అవ్వాల్సిందే.

గతేడాది డిసెంబర్ 10న జల్ పల్లిలోని తన నివాసంలో టీవీ జర్నలిస్టుపై దాడి చేశారు మోహన్ బాబు. జర్నలిస్ట్ చేతిలో ఉన్న మైక్ లాక్కొని అతడ్ని కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్టు, మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు పెట్టారు.

జరిగిన తప్పు తెలుసుకున్న మోహన్ బాబు హాస్పిటల్ కు వెళ్లి బాధిత జర్నలిస్టుతో పాటు, అతడి కుటుంబ సభ్యులందరికీ క్షమాపణలు చెప్పారు. దానికి సంబంధించి ఆయన లేఖ కూడా విడుదల చేశారు.

మరోవైపు పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 23న హైకోర్టు ఆ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించడంతో కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనారోగ్యం పాలయ్యానని, చికిత్స తీసుకుంటున్నానని ప్రకటించుకున్నారు.

అదే టైమ్ లో సుప్రీంకోర్టుకు ఆశ్రయించారు. ఈ గ్యాప్ లో పోలీసులు పలు మార్లు నోటీసులిచ్చినప్పటికీ మోహన్ బాబు విచారణకు హాజరుకాలేదు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కాబట్టి పోలీసులు కూడా వేచిచూసే ధోరణిలో ఉన్నారు.

ఎట్టకేలకు సుప్రీంకోర్టు నుంచి మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ రావడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడాయన నిర్భయంగా పోలీసుల విచారణకు హాజరవుతారు. మరోవైపు బాధిత జర్నలిస్టుతో రాజీ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు.

2 Replies to “మోహన్ బాబుకు స్వల్ప ఊరట”

Comments are closed.