పుష్ప-2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి నమోదైన కేసులో ఏ-11 నిందితుడు అల్లు అర్జున్ ఇప్పటికే బెయిల్ పై బయటకు రాగా, ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు కూడా బెయిల్ దొరికింది.
తదుపరి ఆదేశాలిచ్చేంతవరకు నిర్మాతలు నవీన్, రవిశంకర్ ను అరెస్ట్ చేయొద్దంటూ చిక్కడపల్లి పోలీసుల్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.
నిజానికి ఈ కేసులో మైత్రీ నిర్మాతల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే, పోలీసులకు ఇచ్చిన లేఖలో సంధ్య థియేటర్ యాజమాన్యం మైత్రీ పేరును ప్రస్తావించింది. సినిమా రిలీజ్ సందర్భంగా 2 రోజుల పాటు థియేటర్ ను నిర్మాతలే ఎంగేజ్ చేసుకున్నారని పోలీసులకు లేఖ ఇవ్వడంతో విషయం మరింత ముదిరింది. మధ్యంతర బెయిల్ రావడంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు అల్లు అర్జున్ కేసుకు సంబంధించి రేపు విచారణ కొనసాగనుంది. రెగ్యులర్ బెయిల్ కోసం నిందితుడు అల్లు అర్జున్, నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అతడికి బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన తీర్పును రేపటికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. ఇక అల్లు అర్జున్ జ్యూడీషియల్ రిమాండ్ పై విచారణ 10వ తేదీన ఉంది.
మరోవైపు ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కలుగజేసుకుంది. రామారావు అనే లాయర్ ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. పిటిషన్ ను పరిశీలించిన కమిషన్, 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ డీజీపీని ఆదేశించింది. మానవ హక్కుల కమిషన్ ఎంట్రీతో ఈ కేసు మరింత జటిలంగా మారినట్టయింది.