ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ఆ ప్రకటన వచ్చినప్పట్నుంచి అది వైరల్ అవుతూనే ఉంది. ఇదేం కాంబినేషన్ అంటూ ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతయింది. ఇవన్నీ పక్కనపెడితే.. అసలు ప్రభాస్ ను అంతలా కదిలించిన ఆ కథ ఏంటనే ఆసక్తి అందర్లో కలిగింది. కథ చెప్పకపోయినా.. ప్రభాస్ సినిమాకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ చెప్పాడు దర్శకుడు నాగ్ అశ్విన్.
“నేను రాసుకున్న సైన్స్ ఫిక్షన్ కథను మోయగలిగే హీరో నాకు ప్రభాస్ ఒక్కడే కనిపించాడు. కేవలం బడ్జెట్ మాత్రమే కాదు, ఆ క్యారెక్టర్ బరువు మోసే హీరో కూడా నాకు ప్రభాస్ తప్ప ఇండస్ట్రీలో ఎవ్వరూ కనిపించలేదు.”
తను ప్రభాస్ కోసం కథ రాయలేదని, తన కథకు ప్రభాస్ మాత్రమే సరిపోతాడని అంటున్నాడు నాగ్ అశ్విన్. సైన్స్ ఫిక్షన్ కథలు ఎలా రాస్తారో ముందు నేర్చుకున్నానని, తర్వాత కథ రాయడం స్టార్ట్ చేశానని తెలిపిన నాగ్ అశ్విన్.. ప్రభాస్ కు కేవలం కథ మాత్రమే చెప్పానని అన్నాడు. స్క్రీన్ ప్లే వర్క్ ఇక స్టార్ట్ చేస్తానంటున్నాడు. అంతా ఊహించుకుంటున్నట్టు ఇది ప్రయోగాత్మకంగా ఉండదని, పక్కా కమర్షియల్ అని అంటున్నాడు దర్శకుడు.
“మహానటి తర్వాత వెళ్లి కలిశాను కాబట్టి కథ, క్యారెక్టరైజేషన్ల పరంగా ప్రభాస్ పెద్దగా నాపై అనుమానాలు పెట్టుకోలేదు. కాకపోతే కమర్షియల్ మీటర్ పైన కాస్త డౌట్ పెట్టుకొని ఉంటాడు. నేను స్టోరీ చెప్పిన తర్వాత షాక్ అయ్యాడు. పూర్తిగా కమర్షియల్ సబ్జెక్ట్ చెప్పాను. మీ నుంచి ఇలాంటి సబ్జెక్ట్ ఊహించలేదన్నాడు ప్రభాస్.”
కథ చెప్పిన వెంటనే ఏమాత్రం ఆలోచించుకోకుండా సినిమా చేస్తానని ప్రభాస్ చెప్పాడట. ప్రభాస్ తో సినిమా సెట్స్ పైకి రావడానికి ఇంకా చాలా టైమ్ పడుతుందని, ఈ గ్యాప్ లో ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేస్తానంటున్నాడు ఈ దర్శకుడు.