ఎట్టకేలకు స్పందించిన నయనతార

తను క్లిప్స్ కోసం ఎన్ఓసీ కోరలేదని, సినిమాలో ఉన్న 4 లైన్లను వాడుకునేందుకు మాత్రమే అనుమతి కోరామని, దానికి కూడా ధనుష్ నిరాకరించాడని చెప్పుకొచ్చింది.

తన డాక్యుమెంటరీలో కొన్ని సినిమా క్లిప్పింగ్స్ వాడేందుకు నిర్మాతగా ధనుష్ అనుమతి ఇవ్వని కారణంగా.. అతడిపై ఓ రేంజ్ లో విరుచుకుపడింది హీరోయిన్ నయనతార. ‘నేనూ రౌడీనే’ సినిమా నుంచి కొన్ని సన్నివేశాల్ని నయనతార డాక్యుమెంటరీ కోసం ఉపయోగించుకునేందుకు, ఆ సినిమా నిర్మాత ధనుష్ అనుమతి ఇవ్వలేదు.

ఆ తర్వాత డాక్యుమెంటరీకి సంబంధించి విడుదల చేసిన ట్రయిలర్ లో సినిమా మేకింగ్ వీడియోస్, స్టిల్స్ అనధికారికంగా వాడినందుకు అతడు నయనతారపై కోర్టులో కేసు వేశాడు. దీనిపై నయనతార భగ్గుమంది. ధనుష్ పై విరుచుకుపడుతూ బహిరంగ లేఖ విడుదల చేసింది.

ఆ లేఖపై తాజాగా స్పందించింది నయనతార. తను క్లిప్స్ కోసం ఎన్ఓసీ కోరలేదని, సినిమాలో ఉన్న 4 లైన్లను వాడుకునేందుకు మాత్రమే అనుమతి కోరామని, దానికి కూడా ధనుష్ నిరాకరించాడని చెప్పుకొచ్చింది.

“నిజానికి మేం సంప్రదించింది క్లిప్స్ కోసం కాదు. సినిమాలో విఘ్నేష్ స్వయంగా రాసిన 4 లైన్స్ వాడుకోవడం కోసం సంప్రదించాం. విఘ్నేష్ రాసిన ఆ 4 వాక్యాలు మా జీవితాలకు, మా ప్రేమకు, మా పిల్లలకు ప్రతిరూపం. అందుకే ఆ వాక్యాలు డాక్యుమెంటరీలో పెట్టాలనుకున్నాం. నేను ఎప్పుడూ ఎవ్వర్నీ సాయం కోసం ఫోన్ చేయలేదు. అలాంటిది ధనుష్ కు కాల్ చేశాను. అతడు కచ్చితంగా ఓకే చెబుతాడని అనుకున్నాను. ఎందుకంటే మా మధ్య అంత శత్రుత్వం లేదు. పుట్టుకతో మేం విరోధులం కాదు. కానీ నేను అనుకున్నట్టు జరగలేదు.”

ఇక వర్కింగ్ స్టిల్స్, వీడియోల వాడకంపై కూడా స్పందించింది నయనతార. చాలామంది అవి కూడా నిర్మాతకు సంబంధించిన ప్రాపర్టీగా భావిస్తున్నారని, కానీ అప్పట్లో అలాంటి అగ్రిమెంట్లు లేవని చెబుతోంది.

“వర్కింగ్ స్టిల్స్, వీడియోలు అనేది ఇప్పుడిప్పుడు అగ్రిమెంట్ లో భాగమయ్యాయి. పదేళ్ల కిందట అలాంటివేం లేవు. చాలామంది ఫొటోలు తీసుకునేవారు, వీడియోలు కూడా తీసుకునేవారు. అప్పట్లో వాటిని పత్రికల్లో కూడా వాడుకునేవారు. మేం కూడా అదే పని చేశాం. మా ఫోన్స్ తో మేం తీసుకున్న వీడియోలవి. వాటిని వాడాం.”

ధనుష్ తో బంధం ఎక్కడ బెడిసికొట్టిందో తనకు నిజంగా తెలియదంటోంది నయనతార. అదే విషయం తెలుసుకోవడానికి అతడికి చాలాసార్లు కాల్ చేశానని, కానీ అతడు స్పందించలేదని అంటోంది. అసలు సమస్య ఏంటో చెబితే సరిదిద్దుకోడానికి తను సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది.

5 Replies to “ఎట్టకేలకు స్పందించిన నయనతార”

  1. డాక్యుమెంటరీ రిలీజ్ అప్పుడు పబ్లిసిటీ కోసం ఓపెన్ లెటర్ రాసి వాడి పరువు తీసి ఇప్పుడు సరిదిద్దుకోడానికి సిద్ధంగా ఉందంట.

  2. పాపులర్ అయ్యేవరకు అణిగిమణిగి వుండటం, పాపులర్ అయ్యాక ఎగిరెగిరి పడడం మానవ సహజ గుణం, దీనికి సినిమా జనాలు, పొలిటిషన్స్ ఏమీ అతీతం కాదు..

Comments are closed.