బెయిల్ పై బయటకొచ్చినా సుఖం లేదు

దర్శన్ కు బెయిల్ దొరికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు తన ఇంట్లోనే కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అయితే బెయిల్ దొరికినా అతడికి సుఖం లేదు. Advertisement రేణుకాస్వామి హత్య కేసు ఇప్పుడు మరో…

దర్శన్ కు బెయిల్ దొరికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు తన ఇంట్లోనే కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అయితే బెయిల్ దొరికినా అతడికి సుఖం లేదు.

రేణుకాస్వామి హత్య కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. దర్శన్ తో పాటు, ఇతర నిందితులపై అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు పోలీసులు.

తొలి విడతగా దాదాపు 3వేల పేజీలతో భారీ చార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు, ఇప్పుడు 1300 పేజీలతో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు. తాజా ఛార్జ్ షీట్ దర్శన్ ను మరింత ఇరకాటంలో పెట్టబోతోంది.

ఎందుకంటే, ఇందులో ఫొటో సాక్ష్యాలున్నాయి. రేణుకా స్వామి హత్య జరిగిన ప్రదేశంలో పవన్ అనే నిందితుడు కూడా ఉన్నాడు. దర్శన్ వ్యక్తిగత సిబ్బందిలో ఒకడు ఇతడు. హత్యా స్థలంలో ఇతడు కొన్ని ఫొటోలు తీశాడు. ఆ ఫొటోల్ని ఇతడి మొబైల్ ద్వారా పోలీసులు సేకరించారు. అంతేకాదు, అతడు డిలీట్ చేసిన మరికొన్ని ఫొటోల్ని కూడా రీస్టోర్ చేయగలిగారు. అందులో దర్శన్ ఉన్నాడు.

ఈ ఫొటోలతో పాటు దర్శన్, ఇతర నిందితులు వాడిన కారు ఫొటోలు.. మరో 30 మంది సాక్ష్యుల వాంగ్మూలాలు కలిపి దాదాపు 40కి పైగా సాక్ష్యాధారాల్ని ఇందులో సమర్పించబోతున్నారు.

ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బెంగళూరు పోలీసులు ఇక్కడితో ఆగడం లేదు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్న దర్శన్ పై సుప్రీంకోర్ట్ కు కూడా వెళ్లబోతున్నారు. అతడి మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని వాదించబోతున్నారు.

మరోవైపు దర్శన్, పవిత్ర గౌడ తదితర నిందితులు పెట్టుకున్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను బెంగళూరు హైకోర్టు 26వ తేదీకి వాయిదా వేసింది.

47 ఏళ్ల దర్శన్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కర్నాటక హైకోర్టు. అతడు వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకోవడం కోసం మాత్రమే ఈ బెయిల్. 6 వారాల్లోపు అతడు ట్రీట్ మెంట్ పూర్తి చేసుకొని తిరిగి కోర్టు ముందు సరెండర్ కావాల్సి ఉంది. ఈలోగా రెగ్యులర్ బెయిల్ వస్తుందని ఆశపడుతున్నాడు దర్శన్. అంతలోనే ఉరుములేని పిడుగులా అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నారు పోలీసులు.

6 Replies to “బెయిల్ పై బయటకొచ్చినా సుఖం లేదు”

Comments are closed.