సంక్రాంతి కథలు.. చిత్రమ్ కదా!

కొత్త కథలు వుండవు. కొత్తగా చెప్పామా లేదా అన్నదే పాయింట్ అంటున్నారు.

ఇటీవల టాలీవుడ్ లో సక్సెస్ అయిన భారీ సినిమాలు చూసుకుంటూ మరీ ప్యాక్డ్ కథ లేదా మరీ అద్భుతమైన కొత్త కథ అక్కరలేదు సినిమా సక్సెస్ కావాలంటే అనే భావన కలుగుతుంది. సినిమాలో జస్ట్ పాయింట్ వుంటే చాలు. దాన్ని ఎలా పాటలు, ఫైట్లు, ఫన్ తో క్రేజీ గా ప్యాక్ చేసామా అని మాత్రమే జనం చూస్తున్నారు అనిపిస్తుంది. ఏ పెద్ద సినిమా అయినా మరీ అద్భుతమైన కథ అయితే కనిపించడం లేదు. దర్శకులు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు.

కొత్త కథలు వుండవు. కొత్తగా చెప్పామా లేదా అన్నదే పాయింట్ అంటున్నారు. అలాగే మరో ముచ్చట ఏమంటే బ్లాక్ బస్టర్ అయిన భారీ సినిమాలకు యునానిమస్ ఒపీనియన్ కూడ రావడం లేదు. దానికి కారణం కొందరు సరైన కథ, కథనం వుందా లేదా అని చూడడం. మరి కొందరు ఫార్ములాటిక్ నెరేషన్ వుందా లేదా, ఎలిమెంట్స్ సరిపోయాయా లేదా అని చూడడం.

ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్న మూడు పెద్ద సినిమాల కథలను ఎట్ ఎ గ్లాన్స్ ఓ సారి చూస్తే. అది కూడా దర్శకులు చెప్పిన దాని ప్రకారం చూస్తే మరీ ప్రేక్షకుడి ఊహకు అందనంతటి కథలు అయితే కాదని అర్థం అయిపోతోంది.

గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే, నవ్వుతూ, తుళ్లుతూ కాలేజీ పూర్తి చేసిన కుర్రాడు, ఓ కీలక అధికారిగా మారి, స్ట్రిక్ట్ అధికారి అనిపించుకున్న తరువాత సాగించిన పోరు. ఈ పోరు కు ఓ ఇంటర్వెల్ బ్యాంగ్. దాని తరువాత ఓ ఫ్లాష్ బ్యాక్. అందులో మరీ కీలకపాత్ర. అందులోంచి బయటకు వచ్చాక మిగిలిన కథ. నిజానికి ఇది కొత్త పాట్రన్ ఏమీ కాదు. దర్శకుడు శంకర్ ఎలా చెప్పారు. చూపించారు అన్నదే కీలకం.

డాకూ మహరాజ్. బాలయ్య బాబు సినిమాకు పెద్దగా కథ అవసరం లేదు అనే భావన వుంది. నిర్మాత నాగవంశీ కూడా అదే నమ్మకంతో వున్నారు. డాకూ మహరాజ్ కథ ఇంకా జనాల కు అందలేదు. కారణం ఎక్కువ కంటెంట్ బయటకు రాలేదు. అయితే సమరసింహారెడ్డి తదితర బాలయ్య సినిమాల ఛాయలు వుంటాయనే టాక్ వుంది. పైగా ఇప్పటి వరకు రెండు గెటప్ లు బయటకు వచ్చాయి. అంటే ఇక్కడ కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి వుంటుందన్న మాట. ఇంటర్వెల్ బ్యాంగ్ కామన్. విశ్రాంతి తరువాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా కామన్ కావచ్చు. అందువల్ల దర్శకుడు బాబీ స్టయిల్ పాటలు, ఎమోషన్లు, యాక్షన్ సీన్లు కీలకం అనుకోవాలి.

దర్శకుడు అనిల్ రావిపూడి వ్యవహారం వేరు. కథ కన్నా సీన్లు, వాటిలో పుట్టే ఎంటర్ టైన్ మెంట్ కీలకం. ఏ సీన్ కు సీన్ నవ్వుకోవడమే. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కథ కూడా కొత్తగా ఏమీ వుండదనే అనుకోవాలి. ఓ మాజీ పోలీస్.. అతని భార్య… సరదాలు.. సరసాలు.. అంతలో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రంగ ప్రవేశం. ముగ్గురు కలిసి ఓ అపరేషన్ మీదకు వెళ్లడం..అక్కడా ఫన్ పండించడం. ఈ సినిమాలో హీరో రెండు గెటప్ ల్లో కనిపిస్తున్నారు కానీ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ లాంటిది పెద్దగా వున్నట్లు కనిపించలేదు ఇప్పటి వరకు బయటకు వచ్చిన కంటెంట్ చూస్తే. ఎంత ఫన్ పండించారన్నదే చూడాలి.

మొత్తం మీద చూసుకుంటే భారీ యాక్షన్ కోసం డాకూ మహరాజ్, భారీ చిత్రీకరణ కోసం గేమ్ ఛేంజర్, భారీ ఫన్ కోసం సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు టార్గెట్ చేస్తున్నాయని అనుకోవాలేమో?

2 Replies to “సంక్రాంతి కథలు.. చిత్రమ్ కదా!”

Comments are closed.