మెగా సినిమాకు మరో పండగ దొరుకుతుందా?

పండగలతో సంబంధం లేకుండా మధ్యేమార్గంగా ఓ తేదీని లాక్ చేసి, దానికి లాంగ్ వీకెండ్ సెట్ అయ్యేలా చూడాలనేది అందరి ఆలోచన.

తనయుడు రామ్ చరణ్ కోసం తన సినిమా విడుదల తేదీని త్యాగం చేశారు చిరంజీవి. అంతా సిద్ధం అనుకున్న విశ్వంభర సినిమాను సంక్రాంతి బరి నుంచి తప్పించారు. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది. మరి విశ్వంభర సినిమా పరిస్థితేంటి?

ఇటు చూస్తే 2025 సంవత్సరానికి సంబంధించి దాదాపు పండగ తేదీలన్నీ లాక్ అయిపోయాయి. శివరాత్రి, దసరా అనే తేడా లేకుండా ఇతర సినిమాలన్నీ కర్చీఫులు వేసేశాయి. మరి విశ్వంభరకు పండగ కావాలంటే ఎలా? మరో హీరో తన డేట్ ను త్యాగం చేయాల్సిందేనా?

దర్శకుడు వశిష్ఠ చెప్పిన సమాచారం ప్రకారం, ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చే నెలాఖరుకు రెడీ అయిపోతుంది. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా జోరుగా సాగుతోంది. ఇక రిలీజ్ డేట్ సెట్ చేయడమే ఆలస్యం. అదే ఇప్పుడు యూనిట్ కు సమస్యగా మారింది.

విశ్వంభర సినిమాను వేసవిలో విడుదల చేయాలని ప్రాధమికంగా నిర్ణయించారు. మే లేదా జూన్ నెలలో సినిమా రిలీజ్ చేస్తే బావుంటుందని యూనిట్ లో కొందరు అభిప్రాయపడుతుండగా.. నిర్మాతలు మాత్రం జూన్ అంటే మరీ ఆలస్యమౌతుందేమోనని ఆలోచిస్తున్నారు.

పండగలతో సంబంధం లేకుండా మధ్యేమార్గంగా ఓ తేదీని లాక్ చేసి, దానికి లాంగ్ వీకెండ్ సెట్ అయ్యేలా చూడాలనేది అందరి ఆలోచన. చిరంజీవి కూడా ఈ ఆలోచనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే సంక్రాంతికి విశ్వంభర విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారు.

4 Replies to “మెగా సినిమాకు మరో పండగ దొరుకుతుందా?”

Comments are closed.