KA Review: మూవీ రివ్యూ: క

ఒక క్రైం కథ చెబుతూ ప్రేక్షకులని కూర్చోబెట్టి, చివరిగా మంచి చెడుల విశ్లేషణ, కర్మబంధం లాంటి టాపిక్ లోకి వెళ్లి ముగించడం ఈ చిత్రం ప్రత్యేకత.

చిత్రం:
రేటింగ్: 2.75/5
తారాగణం: కిరణ్ అబ్బవరం, తన్వీ రాం, నయన్ సారిక, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్లే తదితరులు
సంగీతం: శ్యామ్ సి ఎస్
ఎడిటింగ్: శ్రీ వరప్రసాద్
కెమెరా: డేనియల్ విశ్వాస్, సతీష్ రెడ్డి మాసం
నిర్మాత: చింత గోపాలకృష్ణ
దర్శకత్వం: సుజిత్ – సందీప్
విడుదల: 31 అక్టోబర్ 2024

కిరణ్ అబ్బవరం ఈ సారి వినూత్నమైన టైటిల్ “క” తో ముందుకొచ్చాడు. ట్రైలర్ ఆసక్తి గొలిపింది. ఏదో విషయముందనే ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా కనుక ఆడకపోతే మళ్లీ మరొక సినిమా చేయను అని భీషన్ ప్రతిజ్ఞ కూడా చేసాడు కిరణ్ అబ్బవరం ఈ చిత్రం విడుదల ముందు వేడుకలో. అసలీ “క” అంటే ఏవిటో, ఇందులో ఏముందో చూద్దాం.

అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం), రాధ (తన్వి రాం) అనే ఇద్దర్ని ఒక విచిత్రమైన వ్యక్తి కిడ్నాప్ చేసి ఒక చోట బంధిస్తాడు. అయితే ఆ బందిఖానాలో ఆ ఇద్దరికీ ఒక గోడ అడ్డు. ఒకరికొకరు కనపడరు కానీ మాట్లాడుకోగలుగుతారు. విచిత్రమైన వ్యక్తి అదే గదిలో టేబుల్ మీద ఒక వింతైన చక్రాన్ని తిప్పి హిప్నోటైజ్ చేస్తూ అభినయ వాసుదేవ్ మరిచిపోయిన గతాన్ని తవ్వుతుంటాడు.

అలా చెప్పిన విషయాల ద్వారా అసలు కథ అల్లుకుంటూ ఉంటుంది. అభినయ వాసుదేవ్ క్రిష్ణగిరి అనే మారుమూల ఊరిలో ఒక పోస్ట్ మ్యాన్. అదే ఊళ్లో పోస్ట్ మాస్టర్ (అచ్యుత్ కుమార్) కూతురు (నయన్ సారిక) అభినయ వాసుదేవ్ ని ఇష్టపడుతుంది. ఆ ఊళ్ళో ఒక్కోసారి ఒక్కో అమ్మాయి మిస్ అవుతూ ఉంటుంది. ఆ క్రైం కి కారకులెవరో తెలుసుకోవడమే అసలు కథ. ఇంతకీ ఆ క్రైం చేస్తున్నది ఎవరు? ఈ ఇద్దర్నీ బంధించిన ఆ విచిత్ర వ్యక్తి ఎవరు? వాళ్లున్న ఆ బందిఖానా ఏవిటి? వీటికి సమాధానాలు ఆఖరి ఐదు నిమిషాల్లో తప్ప తెలియవు.

వింతగా ఉండే గదిలో బంధించడం అనే పాయింట్, ఆ విచిత్ర వ్యక్తి లేకపోతే ఇది ఒక సాధారణ క్రైం థ్రిల్లర్. కానీ దానికి ఈ లేయర్ కలిపి మిస్టరీని, సస్పెన్స్ ని పెంచి చివరికి తాత్వికమైన ఎండింగ్ ఇచ్చాడు దర్శకుడు. కథనం పరంగా ఇది మంచి ప్రయత్నం. మునుపెన్నడూ చూడని విషయం.

ఏ కథకైనా ఎంతో కొంత ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. ఇక్కడ కూడా ఫ్లాష్ బ్యాక్ కథలో ప్రెడిక్టిబుల్ గా ముగిసిన పాత్రలు, సన్నివేశాలు లేకపోలేదు. కానీ మెయిన్ మిస్టరీని ప్రెడిక్ట్ చేయడం, క్లైమాక్స్ ని ఊహించడం ఎవరి తరం కాదు. అంత కొత్తగా ఉంది.

కథనంలో కొత్తదనం ఉన్నా సంభాషణల్లోనూ, టేకింగ్ లోనూ నావల్టీ లేదు. కొన్ని అతిగానూ, కొన్ని అతికినట్టు ఉన్నాయి. ఉదాహరణకి రెడిన్ కింగ్స్లే చేత చేయించిన కామెడీ పండలేదు. అలాగే హీరో హీరోయిన్ ని తొలిసారి చూసినప్పుడు అబ్బురపడి ఆశ్చర్యపోవడం ఓకే కానీ, మరీ చూసినప్పుడల్లా హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్లలాంటివి విసిగిస్తాయి.

ఈ సినిమాకి మ్యూజిక్ బాగుంది. ఎక్కడా డౌన్ అవ్వకుండా బ్యాక్ గ్రౌండ్ కానీ, పాటలు కానీ గ్రిప్పింగ్ గా స్వరపరిచాడు సంగీత దర్శకుడు. “బుజ్జమ్మా..” పాట ఓల్డ్ స్టైల్ మ్యూజిక్ తో బాగుంది. కానీ అది బిట్ సాంగ్ లా కొంచెమే పెట్టినట్టుంది. మిగిలిన పాటల్లో కూడా సాహిత్యవిలువలు ఉన్నాయి.

కెమెరా వర్క్ ఓకే. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. ప్రధమార్ధం అటు ఇటుగా నడుస్తూ అక్కడక్కడ బోర్ కొట్టేలా ఉంది. ఇంటర్వల్ టైం కి కాస్త సర్దుకుంది. ద్వితీయార్ధం యాక్షన్ ఎపిసోడ్స్ తోటి, కొత్త కేరెక్టర్ల ప్రవేశం తోటి కొన’సాగుతూ’ ఉంటుంది. “ఇంత కథ చెబుతున్నాడు.. అసలు మిస్టరీ విప్పడానికి టైమెక్కడ” అని అనిపిస్తుంటుంది. అయితే కేవలం ఆఖరి ఐదు నిమిషాలు మాత్రమే మెయిన్ మిస్టరీని విప్పడానికి కేటాయించాడు దర్శకుడు.

కిరణ్ అబ్బవరం నటన బాగుంది. తనకి తగిన పాత్రని ఎంచుకుని చేసాడు.

నయన్ సారిక చూడడానికి బాగుంది. నటన పరంగా కూడా ఆకట్టుకుంది.

తన్వి రాం కి సెకండాఫులో నిడివి ఉన్న పాత్ర.

బిందు చంద్రమౌళి చివర్లో వచ్చి సర్ప్రైజ్ చేసే క్యారక్టర్.

అచ్యుత్ కుమార్ హీరోయిన్ తండ్రిగా రొటీన్ పాత్రలో కనిపించాడు.

ఈ చిత్రంలో పాత సినిమాల ఇన్స్పిరేషన్లు కూడా కొన్ని ఉన్నాయనిపిస్తుంది.

– కిరణ్ అబ్బవరం పోస్ట్ మ్యాన్ గా సైకిల్ చక్రాల్లో కూడా ఉత్తరాలు అమర్చుకుని తొక్కడం చూస్తే, ఏప్రిల్ 1 విడుదలలో రాజేంద్ర ప్రసాద్ “చుక్కలు తెమ్మనా..” పాటలో వీడియో క్యాసెట్లని సైకిల్ చక్రాల్లో పెట్టుకుని తొక్కే సీన్లు గుర్తోస్తాయి.

– గోడకి అటు ఇటు ఇద్దరు బందీలు మాట్లాడుకోవడం చూస్తే, “వేట”లో చిరంజీవి, జగ్గయ్య సీన్లు గుర్తొస్తాయి.

– అంతరాత్మ ఎపిసోడ్ చూస్తే, ప్రశాంత్ వర్మ తీసిన “ఆ!” గుర్తొస్తుంది.

ఇలా ఎన్ని గుర్తొచ్చినా మెయిన్ మిస్టరీ చివరి వరకు వీడకపోవడం వల్ల ఆసక్తి కలిగిస్తుంది. అయితే క్లైమాక్స్ మొత్తం తాత్వికంగా, కర్మసిద్ధాంతంతో ముడిపడి ఉండడం, ఆ వివరణ వాయిస్ ఓవర్లో ఇవ్వడం కొందరికి ఎక్కొచ్చు, కొందరికి ఎక్కకపోవచ్చు. ఎందుకంటే చివరి వరకు వెయిట్ చేయించి ఆ సస్పెన్స్ ని విప్పిన విధానం, వెనుక కథలో పొయెటిక్ జస్టిస్ చేయకుండా ట్రాజెడీగా ముగించడం ఎంతమంది ఆడియన్స్ కు మింగుడుపడుతుందో చెప్పడం కష్టం. అదే ఇక్కడ దర్శకుడు తీసుకున్న పెద్ద రిస్క్.

ఏది ఏమైనా మంచి ప్రయత్నాన్ని, దర్శకనిర్మాతల ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఇలాంటి వెరైటీ కథనాలని ప్రేక్షకులు థియేటర్ల వద్ద ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. ఒక క్రైం కథ చెబుతూ ప్రేక్షకులని కూర్చోబెట్టి, చివరిగా మంచి చెడుల విశ్లేషణ, కర్మబంధం లాంటి టాపిక్ లోకి వెళ్లి ముగించడం ఈ చిత్రం ప్రత్యేకత.

బాటం లైన్: “క”ర్మ సిద్ధాంతం

28 Replies to “KA Review: మూవీ రివ్యూ: క”

  1. నీ review ను బట్టి మెము assume చెసుకుంటం లెరా సామి …movie చాలా బగుంది అనిపుస్తుంది…నువ్వె 2.75ఇచ్చావ్ అంటె..మెము 3.25 అనుకుంటాం …

    కాని నీకెందుకొ సినిమాని down చెయ్యాలని విదిలెక review ఇచ్చినట్టుంది

  2. Meeru manushulena? Review Peru to story mottam cheppestunnaru. Malli movies aadatledu ani gola? Meekante rabansule nayam chachhaka tintay. Negetives positives chepte ok mystery movies lo mottam meere chepte tappu kaada?

  3. Boss….సినిమా లో కొన్ని సీన్స్ వేరే వేరే సినిమాల్లో చూసినట్లుందని రివ్యూ ఇచ్చావ్…

    మరి నీ రివ్యూ కూడా వేరే వేరే రివ్యూ లలో చదివి నట్లుంది…

  4. ఈ సినిమా ఎలా ఉందో తెల్దు గానీ ఈ సినిమా ప్రెస్‌మీట్‌లో మూర్తితాతగారు “ఈ సినిమాలో విలన్ లాంగ్‌కోట్ వేసుకోవడం చూస్తే ఈ సినిమా నలభై ఏళ్ల నాటి వంశీ అన్వేషణ నుండీ కాపీ చేసారని అనిపిస్తోంది” అని చెప్పడంతో, ఆయన సెనైలిటీకి సినిమా తీసిన వాళ్లు మూర్ఛపోయారని, చూసిన వాళ్లు గొల్లున నవ్వారని నెటిజెన్స్ అనుకుంటున్నారు.

  5. Superhit… Chalabavundi… Roddakottudu… Nalaugu Fights… Aaru Patalu Kakunda… Pedda Herolla Elevations Lekundaa… Simplega… Different Concept to Teesaru…. Climax is Awesome.

  6. ఈ సినిమా ఆడితే కాస్త కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు వస్తాయి. లేకపోతె ఇంక వాల్టైర్ వీరయ్య, దేవర సినిమాలే గతి.

  7. Mee abhiprayam chustunte telugu lo musa cinemale undali, koncham perunna hero natinchali annattu undi, adi mee abhiprayam kani chala mandiki ee movie nachindi. Super hit. Future lo ilanti movies marinni raavali.

Comments are closed.