రివ్యూ: మయూరి
రేటింగ్: 3.25/5
బ్యానర్: సికె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి., శ్రీ శుభశ్వేత ఫిలింస్
తారాగణం: నయనతార, ఆరి, అమ్జాత్ ఖాన్, లక్ష్మీప్రియ, చంద్రమౌళి, రోబో శంకర్ తదితరులు
సంగీతం: రాన్ యోహాన్
కూర్పు: టి.ఎస్. సురేష్
ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్
నిర్మాతలు: శ్వేతలాన, వరుణ్, తేజ, సి.వి. రావు
కథ, కథనం, దర్శకత్వం: అశ్విన్ శరవణన్
విడుదల తేదీ: సెప్టెంబర్ 17, 2015
'ఇంటర్వెల్ రాదేంటి?' అంటూ 'మయూరి' చూస్తున్న ప్రేక్షకులు పదే పదే ఇంటర్వెల్ కోసం పరితపించిపోయారు. మామూలుగా ఇంటర్వెల్ ఎప్పుడా అంటూ ఆడియన్స్ ఎదురు చూసారంటే సినిమా బాలేదని అర్థం. కానీ 'మయూరి' అందుకు పూర్తిగా భిన్నమైన ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. అసలే హారర్ సినిమా.. అందులోను నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లే.. వద్దన్నా కథలోకి పూర్తిగా ఇన్‌వాల్వ్ అయిపోతూ, ఆ 'మాయా' ప్రపంచంలోకి వెళ్లిపోయి, క్యారెక్టర్ల తాలూకు భావోద్వేగాల్ని అనుభవించేస్తూ ఉంటాం. ఒకవైపు మెదడుకి పని చెప్తూ, ఇంకోవైపు భయకంపిత సన్నివేశాలతో హార్ట్ బీట్ వేగం పెంచుతూ అసలు కాంప్రమైజే తెలీనట్టుగా కొత్త దర్శకుడు అశ్విన్ శరవణన్ సృష్టించిస అట్మాస్ఫరిక్ హారర్‌కి అర్జంట్‌గా ఒక బ్రేక్ కోరుకుంటాం. ఒక్కసారి బాహ్య ప్రపంచంలోకి వచ్చి మనం ఎక్కడున్నామో తరచి చూసుకోవాలని అనుకుంటాం. 'ఇదంతా నిజం కాదు.. నా ప్రపంచం వేరు' అంటూ చూస్తున్న వాళ్లు ఓ చిన్న బ్రేక్ తీసుకోవాలనుకునేలా చేశాడు దర్శకుడు. 'ఇంటర్వెల్' కోరుకునేలా చేయడం 'మయూరి' చిత్రం గొప్పతనమే కానీ బలహీనత కాదు.
హారర్ సినిమాలు అనగానే… పాత్రధారులు భయపడుతుంటే దాన్నుంచి కామెడీ పుట్టించి కాసులు దండుకోవాలని చూస్తున్నారీ మధ్య. హారర్/కామెడీ అనేది మనీ స్పిన్నింగ్ జోనర్ అయిపోవడంతో చాలా మంది దానిపై పడ్డారు. కానీ నిజమైన హారర్ సినిమాలు నవ్వించవు. బిర్ర బిగుసుకుపోయి కుర్చీలకి అతుక్కుపోయేట్టు, గాలి కూడా చేరనంత గట్టిగా చేతులు రెండూ అతుక్కుపోయేట్టు, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి కళ్లు సగం మూసేసుకోవాలన్నట్టు, ఒంటరిగా కూర్చుని చూస్తే గుండె ఆగిపోతుందేమో అన్నట్టు.. ఒక విధమైన ప్రపంచంలోకి పట్టుకుపోతాయి. హారర్ సినిమాలు చూపినంతగా ప్రేక్షకులపై ఇతర జోనర్ సినిమాలు ప్రభావం చూపించలేవు. నిజం కాని దానిని నిజమని నమ్మేలా చేయడం, ఆ భయాన్ని అనుభవించేలా చేస్తూ ఒక విధమైన వింత వినోదాన్నివ్వడం హారర్ సినిమాలకే చెల్లు. డబ్బులిచ్చి మరీ భయపెట్టించుకోవాలా అనే వాళ్లు హారర్ సినిమాల జోలికి కూడా పోరు. ఆ అనుభవంలో ఉన్న మజా తెలిసిన వాళ్లు ఎక్కడ, ఏ హారర్ సినిమా వచ్చినా వదలరు. కాకపోతే గతంలో వచ్చినలాంటి క్లాసిక్ హారర్ మూవీస్ ఈమధ్య రావడం లేదు. జుగుప్సాకరమైన హింసని చూపించే సినిమాల్నే హారర్ అని పేర్కొంటున్నారీ మధ్య. లేదా భయపెడుతూ కితకితలు పెట్టే సినిమాల్నే ఎంజాయ్ చేసేస్తున్నారు.
'మయూరి' దర్శకుడు అసలు సిసలైన హారర్ అనుభవాన్నే ప్రేక్షకులకి ఇవ్వాలనుకున్నాడు. ఎక్కడా కమర్షియల్ హంగుల పేరిట లేదా రీచ్ పెంచాలనే ఉద్దేశంతో కథని పక్కదారి పట్టించలేదు. రెండు కథలు ప్యారలల్‌గా నడుస్తుంటాయి. ఆ రెండిటికీ మధ్య లింక్ ఏంటి అన్నది అంత త్వరగా చెప్పడు. రెండు కథలు అలా నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేతో నడుస్తున్నప్పుడు ఏ కథ ఏది అనే కన్‌ఫ్యూజన్ రాకుండా ఒక కథని కలర్‌లో, మరో దానిని బ్లాక్ అండ్ వైట్‌లో చూపిస్తూ వచ్చాడు. సాధారణంగా హారర్ సినిమాలకి స్ట్రెయిట్ నెరేషన్‌నే ఎంచుకుంటారు. భయం అనే రసాన్ని పండిచేప్పుడు దాని మీదే ఫోకస్ పెడతారు తప్ప ప్రేక్షకుడి మెదడుకి కూడా పని చెప్పే పని పెట్టుకోరు. అది రిస్కుతో కూడుకున్న పని. అసలే హారర్ అంటే యూనివర్సల్ జోనర్ కాదు. మళ్లీ అందులో ఒక వర్గం ప్రేక్షకులకే 'అర్థమయ్యే' విధంగా కథ చెప్పాలనుకుంటే… మైనారిటీ ఆడియన్స్‌లో మైనారిటీని టార్గెట్ చేసినట్టే.
తన సినిమాతో కొత్తరకం హారర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనుకున్న దర్శకుడు అశ్విన్ శరవణన్ ఆ ప్రయత్నంలో పక్కదారులు చూసుకోలేదు. అందులోనే 'మయూరి' బ్యూటీ దాగి వుంది. అదే సమయంలో ఒక్కోసారి ఆ కన్‌ఫ్యూజింగ్ స్క్రీన్‌ప్లే బలహీనతగాను మారింది. కథని చెప్పే ప్రాసెస్‌లో హారర్ కూడా కొన్నిసార్లు బ్యాక్‌సీట్ తీసుకోవాల్సి వచ్చింది. క్లయిమాక్స్‌కి వచ్చే సరికి సాగతీత ధోరణి కనిపిస్తుంది. హారర్ సినిమాకి పతాక సన్నివేశాల్లో తప్పనిసరిగా ఉండాల్సిన పంచ్ మిస్ అయింది. కథని ఆరంభించినప్పుడు చూపించిన కమాండ్ క్లయిమాక్స్‌లో కూడా చూపించి ఉన్నట్టయితే ఈ జోనర్ సినిమాల్లో ఇదో క్లాసిక్ అయిపోయి ఉండేది. ఇప్పటికీ ఈ బలహీనతలతోను 'మయూరి' ఇటీవల వచ్చిన బెస్ట్ హారర్ మూవీస్‌లో ఒకటిగా నిలుస్తుంది. ఇక్కడ బెస్ట్ అంటే.. కేవలం ప్రాంతీయ స్థాయి, జాతీయ స్థాయి కాదు.. అంతర్జాతీయ శ్రేణి హారర్ సినిమాల సరసన నిలబడే సత్తా ఉన్న చిత్రమని చెబుతున్నామన్నమాట.
నయనతార, ఆరి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా నయనతార వివిధ ఎమోషన్లని పండించిన తీరు విశేషంగా ఆకట్టుకుంటుంది. లక్ష్మిప్రియ, అమ్జాత్ ఖాన్ తమ వంతు సహకారాన్ని అందించి తమ ప్రెజెన్స్ తెలిసేట్టు చేశారు. టెక్నికల్‌గా ఈ చిత్రం ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతం. నిశ్శబ్ధాన్ని, శబ్ధాన్ని భయపెట్టడానికి ఎంత చక్కగా వాడుకోవచ్చో రాన్ యోహాన్ ఎంచక్కా చూపించాడు. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం అద్భుతంగా ఉంది. నేచురల్ లైటింగ్‌ని వాడుకోవడం వల్ల హారర్ ఎఫెక్ట్ మరింత పెరిగింది. ఆర్ట్ డైరెక్టర్‌కి కూడా ఈ సక్సెస్‌లో క్రెడిట్ దక్కుతుంది.
హారర్ సినిమా చూసిన అనుభూతిని సంపూర్ణంగా ఇచ్చిన ఈ చిత్రం, ఆ అనుభవాన్ని కొన్నాళ్ల పాటు గుర్తుండిపోయేట్టు చేస్తుంది. అత్యద్భుతమైన రచనా పటిమతో ఈ చిత్ర దర్శకుడు అశ్విన్ చేసిన మాయాజాలం నుంచి తేరుకుని మనసు, మది మళ్లీ మామూలు కావడానికి కనీసం కొన్ని నిముషాలైనా అవసరమవుతుంది. సీరియస్ హారర్ లవర్స్ అయితే మిస్ కాకూడని చిత్రమిది. ఇది ఆర్థికంగానూ సక్సెస్ అయినట్టయితే ఇలాంటి సిసలైన హారర్ అనుభవాన్నిచ్చే చిత్రాలు మరిన్ని రావడానికి మార్గం సుగమం అవుతుంది. అన్నట్టు మయూరి చూసి భయపడకపోతే ఐదు లక్షలిస్తారంట.. ట్రై చేస్తారేంటి?
బోటమ్ లైన్: హడలెత్తించే హారర్!
– గణేష్ రావూరి