తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సీటుపై రాజకీయం డైలీ సీరియల్‌ను తలపిస్తోంది. ఇటీవల ఆ ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబునాయుడు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థుల్ని పిలిపించుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా అనపర్తి టీడీపీ ఇన్చార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కూడా పిలిపించుకుని చర్చించారు. బీజేపీతో చర్చించి, అనపర్తి సీటు ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారని రామకృష్ణారెడ్డి తెలిపారు.
కానీ సీట్ల విషయంలో ఇక ఎలాంటి మార్పులుండవని బీజేపీ జాతీయ నాయకత్వం తేల్చి చెప్పింది. నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మను మార్చుతారనే ప్రచారం విస్తృతంగా సాగుతున్న సంగతి తెలిసిందే. నరసాపురం పార్లమెంట్ స్థానాన్ని టీడీపీకి ఇచ్చి, కడప లోక్‌సభ సీటును తీసుకుంటారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అలాగే అనపర్తి సీటును టీడీపీకి, తంబళ్లపల్లె సీటును బీజేపీకి ఇస్తారని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ఏపీ బీజేపీ కో ఇన్చార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిని మార్చేది లేదని స్పష్టం చేశారు. అసలు అభ్యర్థుల మార్పుపై ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు. దీంతో నరసాపురంతో ముడిపడిన మిగిలిన స్థానాల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టమైంది. దీంతో ఇంతకాలంగా సాగుతున్న నరసాపురం, కడప లోక్‌సభ స్థానాలు, అలాగే అనపర్తి, తంబళ్లపల్లె స్థానాల్లో ఇంతకు ప్రకటించినట్టుగా ఆయా పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తారని తేలిపోయింది.
మరీ ముఖ్యంగా అనపర్తి విషయంలో ఉత్కంఠకు తెరపడింది. ఇక టికెట్ దక్కని రామకృష్ణారెడ్డి ఏం చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. టికెట్ దక్కకపోతే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా అయినా బరిలో నిలిచే వాతావరణం నెలకుంది. పరోక్షంగా ఆయన్ను చంద్రబాబు ప్రోత్సహించే అవకాశం వుంది. ఎందుకంటే చంద్రబాబుకు ఇలాంటివి వెన్నతో పెట్టిన విద్య.