నియామ‌కాల‌కు ‘ఎక్సైజ్’ చేయ‌రా?

ప‌నిభారంతో ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు ఇబ్బంది ప‌డుతున్నారు.

ప‌నిభారంతో ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు ఇబ్బంది ప‌డుతున్నారు. త‌మ డిపార్ట్‌మెంట్‌లో నియామ‌కాలు చేప‌ట్టి, సిబ్బందిని పెంచితే, ప్ర‌భుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంద‌నే సంబంధిత ఉద్యోగులు అంటున్నారు. చివ‌రిగా 2014లో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుళ్ల నియామ‌కాలు జ‌రిగాయి. అయితే ఉద్యోగుల విర‌మ‌ణ అంత‌కంటే ఎక్కువే జ‌రిగింద‌ని సంబంధిత శాఖ ఉన్న‌తాధికారులు అంటున్నారు.

న‌వోద‌యం పేరుతో సారా నిర్మూల‌న‌కు ఏపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. మొద‌ట సారా విక్ర‌యించ‌కూడ‌ద‌ని అవ‌గాహ‌న క‌ల్పించ‌నున్నారు. మే ఒక‌టో తేదీ నుంచి సారా విక్రేత‌ల‌పై కేసులు న‌మోదు చేయ‌నున్నారు. మ‌రోవైపు బెల్ట్‌షాపులు, అక్ర‌మ రవాణాదారుల‌పై నిఘా పెట్టాల్సిన బాధ్య‌త ఎక్సైజ్ అధికారుల‌పై వుంది. ఇవ‌న్నీ చూసుకోడానికి త‌గినంత మంది ఉద్యోగులు లేరు.

జిల్లాలో ప్ర‌తి ఎక్సైజ్ స్టేష‌న్ ప‌రిధిలో మూడు లేదా ఐదు మండ‌లాలు వుంటాయి. ప్ర‌తి స్టేష‌న్‌లో ఐదుగురు లోపు ఉద్యోగులు మాత్ర‌మే వుంటున్నారు. వీళ్ల‌లో ఒక‌రు త‌ప్ప‌నిస‌రిగా స్టేష‌న్‌లో వుండాల్సి వ‌స్తోంద‌ని చెబుతున్నారు. మిగిలిన వాళ్లంతా ఫీల్డ్‌పైకి వెళుతున్నారు. దీంతో ప‌నిభారం పెరిగింద‌ని, పూర్తిస్థాయిలో ప్ర‌భుత్వ ఆశ‌యాల్ని నెర‌వేర్చ‌లేని ద‌య‌నీయ స్థితి ఏర్ప‌డింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

క‌నీసం హోంగార్డుల్ని నియ‌మించినా ప‌ది మందికి ఉపాధితో పాటు ప్ర‌భుత్వానికి ఆదాయం పెంచేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని వాళ్లు అంటున్నారు. ఎక్సైజ్‌లో హోంగార్డులే లేరు. ఇదే పోలీస్‌శాఖ‌లో హోంగార్డులు ఉండ‌డం వ‌ల్ల ప్ర‌తి గ్రామానికి ఒక పోలీసును బాధ్యుడిని చేశారు. దీంతో గ్రామాల్లో ఏవైనా అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రిగితే, వెంట‌నే సంబంధిత పోలీస్‌కు స‌మాచారం వెళ్ల‌డం, వెంట‌నే అప్ర‌మ‌త్తం అయ్యే అవ‌కాశం వుంది. కానీ ఎక్సైజ్‌శాఖ‌లో అలాంటి వెస‌లుబాటు లేదు. నియామ‌కాల‌కు ప్ర‌భుత్వం ఎక్సైజ్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

2 Replies to “నియామ‌కాల‌కు ‘ఎక్సైజ్’ చేయ‌రా?”

Comments are closed.