డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అడ్డాలో టీడీపీ కార్యకర్తలపై వేర్వేరుగా కేసులు నమోదు అయ్యాయి. ఈ వ్యవహారం కూటమిలో తీవ్ర దుమారం రేపుతోంది. కూటమి పాలనలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై యథేచ్ఛగా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఇదేమీ పెద్ద ఆశ్చర్యం కలిగించడం లేదు. కానీ డిప్యూటీ సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆయన గెలుపు కోసం కృషి చేసిన టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు కావడం ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం వెళ్లిన సంగతి తెలిసిందే. పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నాగబాబు నేతృత్వంలో సాగాయి. అయితే టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వర్మను ఆహ్వానించకపోవడంపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోయాయి. దీంతో నాగబాబు పర్యటనను అడ్డుకున్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య చిన్నపాటి ఘర్షణ కూడా జరిగింది.
ఈ నేపథ్యంలో తనను అడ్డుకుని మోటార్‌బైక్‌ను ధ్వంసం చేశారంటూ జనసేన మొయిళ్ల నాగబాబు టీడీపీ కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సందర్భంలో విధులకు అడ్డం తగిలారంటూ ఏఎస్ఐ జానీబాషా కూడా టీడీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశారు.
ఏఎస్ఐ ఫిర్యాదు చేశాక, ఇక కేసు నమోదు గురించి చెప్పేదేముంది? వెంటనే కేసు నమోదైంది. రెండు వేర్వేరు ఫిర్యాదుల మేరకు అధికారంలో ఉన్న టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు కావడం చర్చనీయాంశమైంది. ఈ కేసులపై వర్మ ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశమైంది.
జాయిన్ కావాలి అంటే