రాజ‌కీయ స్థిర నివాసం కోసం లోకేశ్ త‌ప‌న‌!

ప్ర‌జ‌ల‌కు మంచి చేయ‌డం ద్వారా మంగ‌ళ‌గిరిని త‌న కంచుకోట‌గా మార్చుకోవాల‌నే లోకేశ్ ప్ర‌య‌త్నాల్ని గ‌మ‌నించొచ్చు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి చిత్తూరు జిల్లా కుప్పం రాజ‌కీయ కంచుకోట‌. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌కు వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలోని పులివెందుల ఎవ‌రూ క‌ద‌ల్చ‌లేని రీతిలో రాజ‌కీయ కోట‌. తాను కూడా రాజ‌కీయంగా స్థిర‌మైన‌, ప్ర‌త్య‌ర్థుల నుంచి ఇబ్బంది లేకుండా నియోజ‌క‌వ‌ర్గాన్ని త‌యారు చేసుకోవాల‌ని మంత్రి నారా లోకేశ్ త‌ప‌న ప‌డుతున్నారు. అందులో భాగంగానే మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌న ఇల్లు -మ‌న లోకేశ్ అనే కార్య‌క్ర‌మానికి ఇటీవ‌ల శ్రీ‌కారం చుట్టారు.

మొద‌టి ద‌శ‌లో మూడు వేల మంది పేద‌ల‌కు శాశ్వ‌త ఇంటి ప‌ట్టాల పంపిణీ ఇటీవ‌ల మొద‌లు పెట్టారు. ఆ కార్య‌క్ర‌మం ఇవాళ్టితో పూర్తి చేయ‌నున్నారు. కొన్ని రోజులుగా ఒక పండుగ వాతావ‌ర‌ణంలో శాశ్వ‌త ఇంటి ప‌ట్టాల పంపిణీని లోకేశ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చివ‌రి రోజైన ఆదివారం తాడేప‌ల్లి మ‌హానాడు, డ్రైవ‌ర్స్ కాల‌నీ, స‌లాం సెంట‌ర్‌, ఉండ‌వ‌ల్లి సెంట‌ర్‌, సీతాన‌గ‌ర్‌, ప‌ద్మ‌శాలీ బ‌జార్‌కు చెందిన మొత్తం 832 మంది ల‌బ్ధిదారుల‌కు శాశ్వ‌త ఇంటి ప‌ట్టాలు లోకేశ్ పంపిణీ చేశారు.

శాశ్వ‌త ఇంటి ప‌ట్టాలు ద‌క్కిన ల‌బ్ధిదారులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ల‌బ్ధిదారుల్లో కొంద‌రు వైసీపీకి చెందిన వారు కూడా వుండ‌డం విశేషం. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఎదురు చూస్తున్న శాశ్వ‌త ప‌ట్టాల్ని ఎట్ట‌కేల‌కు మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా తీసుకోవ‌డం ఆనందంగా వుంద‌ని ల‌బ్ధిదారులు చెప్ప‌డం విశేషం. లబ్ధిదారులకు సొంత ఖర్చులతో బట్టలు, పసుపు కుంకుమ పెట్టి, భోజనాలు ఏర్పాటు చేసి లోకేశ్ త‌న మాట నిల‌బెట్టుకున్నార‌ని ల‌బ్ధిదారులు ప్ర‌శంసిస్తున్నారు.

ఇదే సంద‌ర్భంలో మంగళగిరి నియోజకవర్గంలోని చిన్న కాకానిలో వంద పడకల ఆస్పత్రికి మంత్రి లోకేశ్ ఇవాళ భూమి పూజ చేశారు. దేశంలోనే అత్యున్నత ఆస్పత్రిగా ఏడాదిలోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ప్ర‌జ‌ల‌కు మంచి చేయ‌డం ద్వారా మంగ‌ళ‌గిరిని త‌న కంచుకోట‌గా మార్చుకోవాల‌నే లోకేశ్ ప్ర‌య‌త్నాల్ని గ‌మ‌నించొచ్చు.

4 Replies to “రాజ‌కీయ స్థిర నివాసం కోసం లోకేశ్ త‌ప‌న‌!”

  1. చంద్రబాబు స్వయంగా కుప్పం కంచుకోట చేసుకున్నారు. నువ్వు అన్నట్లు లోకేష్ మంగళగిరి లో ఆ ప్రయత్నంలో ఉన్నాడు. మరి జగన్? తండ్రి,బాబాయ్ కంచకోట చేస్తే ఎంజాయ్ చేస్తున్నాడు

Comments are closed.