మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ ఇరువ‌ర్గాలు

అన్న‌మ‌య్య జిల్లా రైల్వేకోడూరు టీడీపీలో వ‌ర్గ‌పోరు ప‌తాక‌స్థాయికి చేరింది.

అన్న‌మ‌య్య జిల్లా రైల్వేకోడూరు టీడీపీలో వ‌ర్గ‌పోరు ప‌తాక‌స్థాయికి చేరింది. రైల్వేకోడూరు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ముక్కా రూపానంద‌రెడ్డి, ఆ పార్టీ నాయ‌కుడు విశ్వ‌నాథ‌నాయుడు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి. విశ్వ‌నాథ‌నాయుడు సుదీర్ఘ‌కాలంగా టీడీపీలో ఉన్నారు. ముక్కా రూపానంద‌రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరి, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దీన్ని విశ్వ‌నాథ‌నాయుడు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

త‌న వ‌ర్గీయుడైన అర‌వ శ్రీ‌ధ‌ర్‌కు జ‌న‌సేన ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకుని, గెలిపించుకున్న ఘ‌న‌త రూపానంద‌రెడ్డిది. దీంతో ఇత‌ర నాయ‌కుల్ని ఆయ‌న ఖాత‌రు చేయ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో అన్న‌మ‌య్య జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జ‌నార్ధ‌న్‌రెడ్డి రైల్వేకోడూరుకు వెళ్లారు. ఆయ‌న వెళ్లే స‌మ‌యానికే రైల్వేకోడూరు టీడీపీ కార్యాల‌యం అద్దాల‌ను, కుర్చీల‌ను పార్టీ కార్య‌క‌ర్త‌లు ధ్వంసం చేశారు. మంత్రి స‌మ‌క్షంలోనే ఇరువ‌ర్గాల కార్య‌క‌ర్త‌ల కొట్టుకున్నారు.

గొడ‌వ‌ను స‌ర్దుబాటు చేసే ప్ర‌య‌త్నంలో కానిస్టేబుల్‌కు గాయాలు కావ‌డం గ‌మ‌నార్హం. దీన్నిబ‌ట్టి రైల్వేకోడూరు నియోజ‌కవ‌ర్గం టీడీపీలో ఆధిప‌త్య పోరు ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవ‌చ్చు. ముక్కా రూపానంద‌రెడ్డి త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, వైసీపీ నాయ‌కుల‌కు ప‌ని చేసి పెడుతున్నారంటూ ఇన్‌చార్జ్ మంత్రికి విశ్వ‌నాథ‌నాయుడు, ఆయ‌న అనుచ‌రులు ఫిర్యాదు చేశారు. అయితే ఇందులో నిజం లేద‌ని ముక్కా రూపానంద‌రెడ్డి మంత్రికి వివ‌ర‌ణ ఇచ్చారు.

ఇప్ప‌టికే రైల్వేకోడూరులో టీడీపీ మూడు నాలుగు వ‌ర్గాలుగా విడిపోయి, పార్టీ పూర్తిగా బ‌ల‌హీన‌ప‌డింది. వీళ్ల మ‌ధ్య‌లో బ‌త్యాల చెంగ‌ల్రాయులుది కూడా మ‌రో వ‌ర్గం. ఇలా ఎవ‌రికి వారు విడిపోయి, అధికారంలో ఉండ‌డంతో పెత్త‌నం త‌మ‌దంటే త‌మ‌ద‌ని కొట్టుకుంటున్నారు. వీళ్ల‌ను అదుపు చేసే ప‌రిస్థితి క‌నుచూపు మేర‌లో కాన‌రావ‌డం లేదు.

One Reply to “మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ ఇరువ‌ర్గాలు”

  1. ఓహో, నాలుగు వర్గాలు ఉంటే బలహీన పడినట్టా, ఎవరూ లేకుంటే బలంగా ఉన్నట్టా, ఐతే ఈసారి మా అన్న ప్రతిపక్ష నేత అవుతాడు అంటావ్…

Comments are closed.