తహశీల్దార్లకు పవర్స్ ఇవ్వకుండా, పరిష్కారం చూపాలని కూటమి సర్కార్ పెద్దలు ఆదేశాలు ఇస్తున్నారు. అత్యధికంగా రెవెన్యూ సమస్యలపై అధికారులకు వినతులు వెళ్లాయి. కానీ వాటికి పరిష్కారం మాత్రం లభించడం లేదు. కేవలం పరిపాలన సాగుతోందని చూపుకోడానికే వినతుల స్వీకరణ కార్యక్రమం ప్రహసనంగా సాగుతోందన్న విమర్శ వుంది. కేవలం వినతిపత్రాలు తీసుకోవడమే తప్ప, పరిష్కారం చూపకపోవడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇదే విషయాన్ని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పడం చెప్పడం గమనార్హం. సీసీఎల్ఏ కార్యాలయంలో రెవెన్యూశాఖ మంత్రి అధ్యక్షతన శుక్రవారం ప్రాంతీయ రెవెన్యూ సదస్సు ప్రారంభమైంది. 12 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వినతులకు పరిష్కారం లభించలేదని అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ ధోరణిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.
రెవెన్యూ సదస్సుల్లో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరని మంత్రి స్పష్టం చేశారు. మరీ ముఖ్యంగా పరిష్కారం అయ్యాయని రెవెన్యూ అధికారులు చెప్పినప్పటికీ, వారిలో సగం మంది అసంతృప్తిగా ఉన్నట్టు మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించి 2016లో తాము అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ వేదికగా ఇచ్చిన హామీ ఇంత వరకూ నెరవేరలేదన్నారు. రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా పని చేయడం మానుకోవాలని హితవు చెప్పారు.
అవకాశం ఉన్న వినతుల్ని కూడా పరిష్కరించకపోవడం ఏంటని ఆయన నిలదీశారు. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా మాట్లాడుతూ రెవెన్యూ శాఖకు శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం వుందన్నారు. ఈ శాఖపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వుందని ఆయన అన్నారు.