“మేం వెళ్లిపోతున్నాం, పిల్లలు జాగ్రత్త” అంటూ సెల్ఫీ వీడియో తీసి కనిపించకుండాపోయిన దంపతుల ఆచూకీ లభ్యమైంది. అయితే అందరూ ఊహించినట్టుగానే ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏలేరు కాలువలో విగతజీవులుగా కనిపించారు. విశాఖలో జరిగిన ఈ ఘటన అందర్నీ కలచివేస్తోంది.
నగరంలోని శివాజీనగర్ కు చెందిన వరప్రసాద్-మీరా దంపతులు, దశాబ్దాలుగా అదే కాలనీలో ఉంటున్నారు. చిన్న వ్యాపారం చేసుకొనే వీళ్లూ.. స్థానికులకు బాగా పరిచయం. కూతురుకు పెళ్లి చేసిన ఈ దంపతులు, కొడుకుతో కలిసి ఉంటున్నారు. కొడుకు స్టీల్ ప్లాంట్ లో టెక్నీషియన్ గా చేస్తున్నాడు.
అంతా బాగుందనుకున్న టైమ్ లో సెల్ఫీ వీడియో తీసి అదృశ్యమయ్యారు వరప్రసాద్-మీరా. కుమారుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఏలేరు కాలువగట్టున వాళ్ల వస్తువులు గుర్తించారు. మరింత గాలించగా రాజుపాలెం వద్ద కాలువతో మృతదేహాలు లభ్యమయ్యాయి.
కరోనా దెబ్బ కొనసాగుతోంది..
కరోనాతో లక్షలాది కుటుంబాల జీవితాలు అల్లకల్లోలం అయ్యాయి. వరప్రసాద్-మీరా కుటుంబం కూడా కరోనా దెబ్బకు చితికిపోయింది. ఇంటిల్లిపాదీ కరోనా బారిన పడ్డంతో చికిత్స కోసం భారీగా అప్పులుచేసి, ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత వ్యాపారం కోసం మరిన్ని అప్పులు చేశారు.
కరోనా తర్వాత వ్యాపారం ఆశించిన స్థాయిలో కోలుకోకపోవడంతో, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక.. దంపతులిద్దరూ ఇలా ఆత్మహత్య చేసుకున్నారు.