గులాబీలకు ఎదురుదెబ్బ: ఇక సుప్రీంకే!

భారాస తరఫున గెలిచి కాంగ్రెసులోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయించే విషయంలో గులాబీ దళానికి ఎదురుదెబ్బ తగిలింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. అనర్హత పిటిషన్లపై…

భారాస తరఫున గెలిచి కాంగ్రెసులోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయించే విషయంలో గులాబీ దళానికి ఎదురుదెబ్బ తగిలింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. అనర్హత పిటిషన్లపై ఎప్పటిలోగా నిర్ణయం తీసుకోవాలనే విషయంలో అసెంబ్లీ స్పీకరుకు గడువును నిర్ణయించజాలమని హైకోర్టు డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు, అయిదేళ్లు పదవీకాలం అనే అంశాలను దృష్టిలో ఉంచుకుని ‘తగిన సమయంలో’ వాటిపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకరుకు సూచించింది. ఈ తీర్పుపై భారాస నాయకులు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్టుగా సమాచారం.

గులాబీ దళం తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి కాంగ్రెసులో చేరారు. దానం నాగేందర్ ఏకంగా సికింద్రాబాద్ ఎంపీగా కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. వీరిమీద అనర్హత వేటు వేయాలంటూ పార్టీ స్పీకరుకు ఫిర్యాదు చేసింది. స్పందన లేకపోవడంతో.. పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కెపి వివేకానంద్ లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. అనర్హత పిటిషన్లకు సంబంధించిన షెడ్యూలును నాలుగు వారాల్లోకా ఖరారు చేయాలంటూ తీర్పు వచ్చింది.

అసెంబ్లీ కార్యదర్శి ఆ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట సవాలు చేయడంతో.. తాజాగా దానిని కొట్టివేస్తూ తీర్పు వచ్చింది. ఈ తీర్పు.. గులాబీ దళానికి అశనిపాతమే అని చెప్పాలి. స్పీకరు పట్టించుకోలేదు గనుక.. కోర్టు ద్వారా.. ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయించగలం అని వారు చాలా ఆశపడ్డారు.

గులాబీ నాయకులైతే.. సింగిల్ బెంచ్ తీర్పు రావడానికంటె ముందునుంచి కూడా త్వరలోనే మన రాష్ట్రంలో మూడు ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ అనేక బహిరంగ వేదికల మీద చెప్పుకుంటూ తిరిగారు కూడా. సింగిల్ బెంచ్ ఉత్తర్వుల సమయంలో కాస్త ఆశ చిక్కబడినప్పటికీ.. తాజాగా డివిజన్ బెంచ్ తీర్పుతో వారికి ఆశాభంగం తప్పలేదు. అయితే ఈ తీర్పు మీద సుప్రీంను ఆశ్రయించనున్నట్టుగా తెలుస్తోంది.

హైకోర్టులో నెగ్గే అవకాశం లేదని కేటీఆర్ ముందునుంచి తలపోస్తున్నట్టుగా సంకేతాలు చెబుతున్నాయి. ఆయన కొన్ని నెలల కిందట ఢిల్లీ పలుమార్లు పర్యటించినప్పుడే.. ఎమ్మెల్యేల అనర్హత గురించి పిటిషన్ పై సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదుల్ని సంప్రదిస్తున్నామని చెప్పారు. అలాగే అవసరమైతే సుప్రీంకైనా వెళ్తామని వారిమీద అనర్హత వేటు వేయిస్తామని చాలాసార్లు అన్నారు. వారు కోరుకున్నట్టే ఇప్పుడు సుప్రీంకు వెళ్లితీరవలసిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు అనుకుంటున్నారు.

4 Replies to “గులాబీలకు ఎదురుదెబ్బ: ఇక సుప్రీంకే!”

  1. వెళ్లి ఏం ఉపయోగం ఉండదు శాసన వ్యవస్థ లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోదు..

Comments are closed.