చెరుకూరి రామోజీరావు…ఈ పేరు తెలుగు సమాజానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మీడియాధిపతిగా, అలాగే పలు వ్యాపారాల అధినేతగా రామోజీరావును జనం గుర్తిస్తారు. అయితే ఈనాడు అనే పత్రికను అడ్డు పెట్టుకుని తనకు గిట్టని రాజకీయ పార్టీలు, నేతలపై ఆయన చేసిన అక్షర దాడి గురించి ఎంత చెప్పినా తక్కువ. ఆ బాధ ఏంటో కలం పోటుకు గురైన నేతలే చెప్పాలి.
ఎవరిపై అయినా మీడియాను అడ్డు పెట్టుకుని దాడి చేయడం తన జన్మహక్కుగా రామోజీరావు భావిస్తుంటారనే విమర్శలున్నాయి. తెలుగు సమాజంపై చెరగని ముద్ర వేసుకున్న ఈనాడు పత్రికకు సారథ్యం వహిస్తున్న రామోజీరావును ఢీకొట్టడానికి ఎవరూ సాహసించేవారు కాదు. దీంతో రామోజీరావు ఆడిండే ఆట, పాడిందే పాటగా చాలా సంవత్సరాలు సాగింది. తనను సంప్రదించకుండా పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారనే అక్కసుతో నట దిగ్గజం, దివంగత నేత ఎన్టీఆర్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ఎన్నో కట్టుకథలు అల్లి, చివరికి ఆయన్ను అన్యాయంగా గద్దె దింపడంలో రామోజీ పాత్ర తక్కువేం కాదు.
ఆ తర్వాత రామోజీని ఎదిరించడంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తెరపైకి వచ్చారు. వైఎస్సార్ పాలనలోనే మార్గదర్శిపై కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కేసు పెట్టడంతో కష్టాలు మొదలయ్యాయి. నాటి నుంచి రామోజీరావు ఆర్థిక, నైతిక పతనం ప్రారంభమైందనే ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ మరణంతో మార్గదర్శి చిట్‌ఫండ్ అక్రమాలకు సంబంధించి కేసు విచారణ మందగించింది. కానీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా రాజకీయంగా ఎలాంటి సాయం లేకపోయినా సుప్రీంకోర్టులో ఒంటరి పోరాటం చేస్తున్నారు.
సుప్రీంకోర్టులో మార్గదర్శిపై ఉండవల్లి వేసిన పిటిషన్లపై ఏపీ సర్కార్ ఇంప్లీడ్ కావడంతో కేసు మళ్లీ ఊపందుకుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో మార్గదర్శిపై సీఐడీ విచారణ వేగం పెరిగింది. చివరికి రామోజీరావు, ఆయన కోడలు శైలజాకిరణ్‌లను కూడా సీఐడీ విచారించింది. ఈ నేపథ్యంలో ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇవాళ ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈనాడు, మార్గదర్శి సంస్థలపై ఉండవల్లితో ఢిల్లీలో బుధవారం అసత్యాలు, అవాస్తవాలను వెల్లడించే ప్రయత్నం జరుగుతోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించడం గమనార్హం.
ఉండవల్లి ఢిల్లీకి వెళుతున్నారంటే రామోజీతో పాటు టీడీపీ నేతల్లో వణుకు. అందుకే ఎలాగైనా ఉండవల్లిని అడ్డుకునేందుకు కోటంరెడ్డి లాంటి నేతలు చిల్లర ఎత్తుగడలకు పాల్పడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ ఢిల్లీలో ఉండవల్లి ఏం చేయబోతున్నారో అనే ఉత్కంఠ నెలకుంది. ఉండవల్లి మాత్రం రామోజీరావును ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టరనేది నిజం.