ఉత్తరాంధ్రా వెనకబాటుతనంతో మగ్గుతూ ఇక్కడ ఉన్న వారు అంతా ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వలస పోతూంటే వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు రాజకీయ పదవులు పొందుతూ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు అని మేధావులు విమర్శిస్తున్నారు. ఉత్తరాంధ్ర సమస్యలు, సంస్కృతి తెలియని వారు కేవలం ఉద్యోగ ఉపాధి కోసం వ్యాపారాల కోసం ఈ ప్రాంతానికి వచ్చిన వారు అందలం ఎక్కుతూంటే ఉత్తరాంధ్ర చోద్యం చూస్తూ ఉండడం దారుణం అని అంటున్నారు.
రకరకాలైన రాజకీయ విన్యాసాలతో స్థానికేతరులు ఉత్తరాంధ్రలో పాగా వేయడానికి చూస్తున్నారు అని విమర్శిస్తున్నారు. ఉత్తరాంధ్రను దోచుకున్న వారు అంతా తాము స్థానికులమే అని చెప్పుకుంటూ జనాలను మభ్యపెడుతున్నారని ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక విమర్శిస్తోంది. విశాఖలో పనిచేయడానికి ఇతర వ్యాపకాలకు వచ్చిన వారు అంతా స్థానికులు ఎలా అవుతారు అని ప్రశ్నిస్తోంది.
అసలైన భూమిపుత్రులను తొక్కిపెడుతూ తాము మాత్రమే రాజకీయ పెత్తనం చేయాలని ఆరాటపడడం దారుణం అని దుయ్యబెడుతోంది. అంతే కాదు ఉత్తరాంధ్ర వేషం భాష కుటుంబ వ్యవహారాలు ప్రత్యేకం అని చెబుతున్నారు. ఇందులో ఆదివాసీ మూలాలు తీర ప్రాంత వాసనలు వుంటాయని గుర్తు చేస్తున్నారు.
అవన్నీ వలస నేతలకు ఈ ప్రాంతాన్ని దోపిడీ చేసే వలస పక్షులకు ఉండవని చెబుతున్నారు. అందువల్ల ఈసారి ఉత్తరాంధ్ర ప్రజలు ఓటు వేసేటపుడు భూమిపుత్రులు ఎవరు అన్నది చూసి మరీ ఓటేయాలని ఉత్తరాంధ్ర మేధావులు కోరుతున్నారు. స్థానిక అన్న మాటను ఉత్తరాంధ్ర ప్రజలు ఈ దృష్టితో చూడాలని అంటున్నారు. ఓట్లు అడిగే వారు మన భూమి పుత్రులా కాదా అని తెలుసుకొని ఓట్లు వెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక మాట మీద భావోద్వేగంతో తొందరపడవద్దని ఓటర్లను కోరుతున్నారు.
ఈసారి ఉత్తరాంధ్రలో వలస నేతల సందడి ఇంకా పెరిగింది. గతంలో విశాఖ వంటి కాస్మోపాలిటిన్ సిటీకే పరిమితం అయిన ఈ రాజకీయ వలస పక్షుల తాకిడి రూరల్ ఏరియాలకు విస్తరించింది. ఇది ప్రమాదకర ధోరణి అని ఉత్తరాంధ్ర మూలవాసులు అంటున్నారు. పోనీలే అని ఓటేస్తే అది ఉత్తరాంధ్రకే చేటూ గొడ్డలి పోటూ అని హెచ్చరిస్తున్నారు. స్థానికులకే ఓటు వేసి వలస పక్షులకు ఈసారి ఎన్నికలతో చెక్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఓటర్లలో ఈసారి ఆ రాజకీయ చైతన్యం వస్తుందా రాదా అన్నది ఎన్నికల్లో తేలుతుంది.