నిస్సిగ్గుగా.. నిర్లజ్జగా.. ఊసరవెల్లి కంటే వేగంగా!

ఎన్నికల ఫలితాల పురిటివాసన ఇంకా పోకముందే పార్టీల గోడలు దూకేందుకు కొంతమంది ఊసరవెల్లి రాజకీయ నాయకులు సిద్ధమైపోయారు. నెల్లూరు జిల్లాలో పదికి పదిస్థానాలు వైసీపీ క్లీన్ స్వీప్ చేయడంతో.. ఇక టీడీపీకి ఇక్కడ రాజకీయ…

ఎన్నికల ఫలితాల పురిటివాసన ఇంకా పోకముందే పార్టీల గోడలు దూకేందుకు కొంతమంది ఊసరవెల్లి రాజకీయ నాయకులు సిద్ధమైపోయారు. నెల్లూరు జిల్లాలో పదికి పదిస్థానాలు వైసీపీ క్లీన్ స్వీప్ చేయడంతో.. ఇక టీడీపీకి ఇక్కడ రాజకీయ భవిష్యత్ లేదని తేలిపోయింది. ఏకంగా జిల్లాలో ఇద్దరు మంత్రుల్ని సైతం ఘోరంగా ఓడించారు ఓటర్లు. దీంతో చోటామోటా నేతలు అలర్ట్ అయ్యారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

అయితే జిల్లాలోని ఎమ్మెల్యేలెవరూ వీరిని దగ్గరకు కూడా రానీయడం లేదు. నెల్లూరు నగర మహిళా కార్పొరేటర్ల భర్తలు ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లి భంగపడి వచ్చేశారు కూడా. దీంతో రాయబారం ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళ్లింది. టీడీపీ టికెట్ ఇచ్చిన తర్వాత ఆదాల పార్టీ మారి వైసీపీలో చేరి ఎంపీగా గెలిచారు. ఆయనతో చనువు ఉన్న టీడీపీ నేతలంతా శుభాకాంక్షలు చెప్పి పనిలో పనిగా తమ పని చూడమంటున్నారు.

అయితే స్థానిక ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం టీడీపీ నుంచి చేరికలకు ఇష్టపడటం లేదు. ప్రస్తుతం ఈ ఊసరవెల్లి రాజకీయం నెల్లూరులో రంజుగా సాగుతోంది. జగన్ హామీ ఇస్తే.. ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా గోడ దూకేందుకు రెడీగా ఉన్నారు. రూరల్ నియోజకవర్గానికి పోటీచేసిన టీడీపీ అభ్యర్థి అజీజ్.. వైసీపీలో చేరేందుకు ఎదురు చూస్తున్నారు. ఈయన గతంలో వైసీపీ టికెట్ పై గెలిచి మేయర్ అయ్యాక టీడీపీలోకి ఫిరాయించారు.

జనసేన తరపున పోటీచేసిన యువ నాయకులిద్దరు వైసీపీ కండువా కప్పుకుంటామని బాహాటంగానే చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే ఈ ఊసరవెల్లులన్నీ ముందుజాగ్రత్త పడుతున్నాయనేది వాస్తవం. ఇందులో కొంతమంది కాంట్రాక్ట్ పనుల్లో కోట్లు నొక్కేశారు. అవినీతి కాంట్రాక్టర్ల భరతం పడతామని జగన్ హెచ్చరించడంతో వీరంతా హడలి చస్తున్నారు. కండువా మార్చందే బతకడం కష్టమనుకుంటున్నారు.

అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే.. మంత్రి నారాయణ పక్కనే ఉంటూ తామంతా ఆయన ఓడిపోయేందుకు ప్రయత్నం చేశామని, తమ సేవల్ని గుర్తించి వైసీపీలోకి ఆహ్వానించాలని కోరుతున్నారు. సొంత పార్టీ నేతకే వెన్నుపోటు పొడిచామని బాహాటంగా చెబుతూ ప్రత్యర్థి పార్టీ నేతల మనసు గెలవాలనుకుంటున్నారు. ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చేసిన ఈ నాయకగణాన్ని చూసి జనం నివ్వెరపోతున్నారు. 

కోట్లు పెట్టుబడి పెట్టి.. అవినీతి రహిత పాలనకు ఒప్పుకుంటారా?