నారా లోకేష్ టీమ్‌కు 27లోనే చాన్స్!

పార్టీకోసం త్యాగాలు చేసిన వారికి ఇప్పుడు అవకాశం కల్పించకపోతే.. ప్రజల్లోకి, పార్టీ కేడర్లోకి తప్పుడు సంకేతాలు వెళుతాయనేది చంద్రబాబు ఆలోచన.

ఇప్పుడు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కాబోతున్నాయి. నిజానికి అయిదు స్థానాలు ఎమ్మెల్సీ కోటాలో నింపుతుండగా.. ఒకటి జనసేనకు దక్కడం వల్ల.. నాగబాబు ఎమ్మెల్సీ కాబోతున్నారు. తెలుగుదేశం చేతిలో ఉన్నది నాలుగు స్థానాలు మాత్రమే. ఆ నాలుగు స్థానాల కోసం పోటీపడుతున్న వారు.. తాము చేసిన త్యాగాలను చెప్పుకుంటూ పదవిని ఆశిస్తున్నవారు పాతికకంటె ఎక్కువమందే ఉన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా యువనాయకత్వాన్ని మండలిలోకి తీసుకువచ్చే ఆలోచనలుకూడా సమాంతరంగా నడుస్తున్నాయి.

వీటన్నిటినీ మించి పార్టీలో చంద్రబాబు తర్వాత కీలకభూమిక పోషిస్తున్న నారా లోకేష్‌ను ఎన్నాళ్లుగానో ఆశ్రయించి ఉంటున్న వారు కూడా.. ఇలా పదవులను ఆశిస్తున్న వారిలో పెద్దసంఖ్యలోనే ఉన్నారు. అయితే పార్టీలోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. నారా లోకేష్ టీమ్ కు ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీ అవకాశాలు దక్కకపోవచ్చునని అంటున్నారు. 2027లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీట్లను వారికి ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నట్టుగా సమాచారం.

దీనికి సంబంధించి సహేతుకమైన విశ్లేషణ కూడా వినవస్తోంది. పార్టీకోసం త్యాగాలు చేసిన వారికి ఇప్పుడు అవకాశం కల్పించకపోతే.. ప్రజల్లోకి, పార్టీ కేడర్లోకి తప్పుడు సంకేతాలు వెళుతాయనేది చంద్రబాబు ఆలోచన.

ఈ ఆలోచనను మించి.. నారా లోకేష్ టీమ్ గా ముద్రపడిన వ్యక్తులు.. కాస్త నిదానంగా అయినా మండలిలోకి ఎంటర్ కావొచ్చుననేది ఒక వ్యూహంగా భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు.. తన కుమారుడు నారా లోకేష్ ను ముఖ్యమంత్రి పదవిలో అధిష్ఠింపజేయడానికి అన్ని రకాలుగానూ రంగం సిద్ధం చేసుకుంటూ వస్తున్నారు. చాపకింద నీరులా ఈ వ్యవహారాలు సాగిపోతున్నాయి.

అన్నీ అనుకున్నట్టుగా సాగితే.. ఈ అయిదేళ్లు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండి.. అమరావతి రాజధానికి ఒక షేప్ తీసుకువచ్చి ప్రజల ముందు తాను అమరావతి నగర నిర్మాతగా కీర్తిని నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా దాదాపుగా పూర్తిచేసి.. 2029 ఎన్నికలలో తెలుగుదేశం ఢంకా బజాయించి గెలిచే వాతావరణం సృష్టించాలనేది కల. ఆ విజయం తర్వాత కొడుకు లోకేష్ ను సింహాసనం పై కూర్చోబెట్టాలని అనుకుంటున్నారు.

అప్పటికి శాసన మండలిలో కూడా కూటమి బలం సమృద్ధిగా ఉంటుంది. అప్పటికి ఎక్కువ పదవీకాలం మిగిలి ఉండేవారిలో లోకేష్ టీమ్ ఎక్కువమంది ఉంటే.. లోకేష్ బలంగా ఉండగలరనేది అసలు వ్యూహం. అందుకే.. లోకేష్ మనుషులుగా గుర్తింపు ఉన్నవారికి 2027లో ఇవ్వవచ్చునని అనుకుంటున్నారు.

పొత్తుల నేపథ్యంలో పార్టీకోసం త్యాగాలు చేసిన త్యాగరాజులు చాలా మందే ఉన్నారు గనుక.. ఈ నాలుగు సీట్లను వారికి పంచేసి.. అలాంటి మిగిలిన వారందరికీ నామినేటెడ్ కీలక పోసులు పంచేసి.. సీనియర్లకు అక్కడితో ఫుల్ స్టాప్ పెడతారు. 2027 లో దక్కే ఖాళీలు గరిష్టంగా లోకేష్ టీమ్ పరమవుతాయి.. అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

3 Replies to “నారా లోకేష్ టీమ్‌కు 27లోనే చాన్స్!”

Comments are closed.