తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఢంకా బజాయించి గెలిచింది. 3 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడింటినీ గెలుచుకుంది. తెరాస శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. కేటీఆర్ వారిని అభినందించడమూ జరిగింది. అయితే ఈ విజయం మరీ అంత గర్వించదగినది ఎంతమాత్రమూ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచిన తెరాస రాష్ట్రంలో తమకు ఇక ఎదురు లేదనే నిశ్చితాభిప్రాయనికి వచ్చేసింది.
తమకు ప్రత్యర్థి పార్టీ అంటూ మిగల్లేదని, అంతా సర్వనాశనం అయిపోయినట్లేనని వారు అనుకున్నారు. అయితే తమ అంచనాలు తప్పు అని, ప్రజలు తమ పాలన మీద మరీ అంత విచ్చలవిడి సదభిప్రాయంతో ఏమీలేరని వారు గ్రహిచడానికి నాలుగున్నర నెలలు అవసరమైంది. ఈలోగా కేసీఆర్ సర్కారు చాలా దూకుడు నిర్ణయాలను కూడా తీసుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో తెరాసకు గట్టి ఎసరు దెబ్బె తగిలింది. ఏ రకంగా లెక్కలు వేసినప్పటికీ అసెంబ్లీ గణాంకాలతో పోల్చినప్పుడు 16 స్థానాలు తమకు ఖరారుగా దక్కుతాయని పార్టీ అభిమానులు అంతా ఆశించారు. కానీ సగానికి సగం తగ్గిపోయాయి. కవిత కూడా ఓడిపోయింది.
ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణ విజయం దక్కిందని వారు తెచ్చిపెట్టుకున్న సంబరాన్ని ప్రకటిస్తున్నారు. కానీ ఇందులో గర్వించవలసినది ఏమీలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవి లోకల్ బాడీస్ కి జరిగిన ఎన్నికలు. రాష్ట్ర ప్రభుత్వంతో అవసరం ఉంటుంది గనుక వారంతా తెరాస వైపు మొగ్గితే ఆశ్చర్యం లేదు. పైగా అసెంబ్లీ తర్వాత వెంటనే జరిగిన లోకల్ ఎన్నికల్లో మెజారిటీ తెరాస గెలిచింది. కానీ పార్లమెంటు ఎన్నికలు నేరుగా ప్రజలు ఓట్లు వేసినవి. అంటే ప్రజల్లో తమపై వ్యతిరేకత మొదలైందని వారు గుర్తించాలి. లేకపోతే తమ గోతిని తామే తవ్వుకున్నట్లు అవుతుంది