గంగుల.. ‘ఇదే.. కొంచెం తగ్గించుకోవాలి’!

జాతీయ రాజకీయాల ఊసెత్తినందుకే ఓడించి కూర్చోబెట్టిన జనం.. దేశం చీలిక అంటే.. ఆ పార్టీని నామరూపాల్లేకుండా చేస్తారని వారు గ్రహించాలి.

దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు సంబంధించి, కేంద్ర పాలకుల నుంచి దక్షిణాది రాష్ట్రాలకు ఉమ్మడిగా జరుగుతున్న అన్యాయం గురించి, ద్రవిడ భావజాలం గురించి గట్టిగా గళమెత్తి ప్రశ్నిస్తూ ఉండే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కూడా.. ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాత్రం.. డీలిమిటేషన్ పర్యవసానాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

నిజానికి ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు.. స్టాలిన్ నిర్వహించిన అఖిలపక్ష భేటీకి హాజరైన భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కూడా వినిపించలేదు. కేటీఆర్ ను మించిన దూకుడును గంగుల ప్రదర్శిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తే.. దక్షిణాది ప్రత్యేక దేశంగా కావాలనే డిమాండ్, తిరుగుబాటు తప్పదు.. అంటూ ఆయన అతివాద ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ప్రజలు మాత్రం.. ‘గంగుల గారూ.. ఇదే కొంచెం తగ్గించుకోవాలి’ అంటూ హితవు చెబుతున్నారు.

డీలిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే మాట వాస్తవం. ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తున్న రెండు మార్గాలలో కూడా.. ఈ రాష్ట్రాలకు నష్టమే. అయితే ఇందుకు ఈ రాష్ట్రాలను ప్రత్యేక దేశంగా మార్చేయడం అనేది ఎన్నటికీ పరిష్కారం కాదు. అసంతృప్తులు, తగాదాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా.. మనం వాటి పరిష్కారం కోసం పోరాడి ఒక తుది నిర్ణయానికి రావాలి.. కావాల్సింది సాధించుకోవాలి తప్ప.. దేశాన్నే చీల్చే ఆలోచనలు చేయడం మంచిది కాదు.. అనే మాట పలువురి నుంచి వినిపిస్తోంది.

తెలంగాణ ప్రత్యేక రాష్టంగా కావాలనే డిమాండ్ తో పోరాడి సాధించుకున్నాం గనుక.. ప్రత్యేక దేశం కూడా సాధించుకుందాం.. అని గంగుల అతిశయమైన ఆలోచనలు చేస్తున్నట్టుంది. కానీ ఈ రెండు రకాల డిమాండ్ల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ అప్పటికి ఎంతో సహేతుకమైనది. దక్షిణాది అన్యాయం అనే మాట నిజమే అయినా.. అందుకు దేశాన్ని చీల్చడం మాత్రం.. ధర్మసమ్మతమైనది కాదు.

ఇలాంటి భావోద్వేగపు ప్రకటనలు మేలుచేస్తాయని, తమ ఇమేజి పెంచుతాయని గంగుల కమలాకర్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. రాష్ట్రాన్ని సాధించి.. తెలంగాణ జాతిపితగా తన గురించి ప్రచారం చేయించుకున్న కల్వకుంట్ల తారకరామరావు.. నిమ్మళంగా ఉన్న పార్టీకి భారత రాష్ట్ర సమితి పేరుతో కొత్తరూపు ఇచ్చి పతనం నిర్దేశించారు.

తమ ప్రయత్నాలు, తాము రెచ్చగొట్టిన ఉద్వేగాలు రాష్ట్రంలో పనిచేశాయి.. అతిగా ఊహించుకున్న జాతీయ రాజకీయాల ప్రయత్నం చేసినందుకు తల బొప్పికట్టింది. ఇప్పుడు గంగుల కమలాకర్ లాంటి వాళ్లు పంపే సంకేతాలతో పార్టీ బహుశా ప్రజాస్పందనను గమనిస్తుంది. అందులో తేడాలు కొట్టి.. ఉద్యమం చేస్తే లాభపడతాం అని భ్రమపడి.. దేశాన్ని చీల్చే ఉద్యమానికి వీరు సారథ్యం వహిస్తేగనుక తేడా కొడుతుంది.

జాతీయ రాజకీయాల ఊసెత్తినందుకే ఓడించి కూర్చోబెట్టిన జనం.. దేశం చీలిక అంటే.. ఆ పార్టీని నామరూపాల్లేకుండా చేస్తారని వారు గ్రహించాలి.

8 Replies to “గంగుల.. ‘ఇదే.. కొంచెం తగ్గించుకోవాలి’!”

  1. కరుణానిధి.. బతికున్నపుడే…ఈ మాట అన్నాడు.. దక్షిణ భారత దేశాన్ని విడదీయండి.. మేము మా డబ్బు మా ఆదాయం తో మేమె పరిపాలించుకుంటాము అని!

    100 రూపాయలు పన్నుల రూపేణా కడితే.. దక్షిణ రాష్ట్రాలకు తిరిగి వచ్చేది.. 19%-40%. అదే బీహార్ కి 105 రూపాయలు..యూపీ కి 179 రూపాయలు మధ్య ప్రదేశ్ కి 78 రూపాయలు బెంగాల్ కి 75 రూపాయలు ..

    రాజస్థాన్ 60 రూపాయలు

    ఒరిస్సా 45.60 రూపాయలు

    ఆంధ్ర ప్రదేశ్ – 40.50 రూపాయలు

    తమిళనాడు 40.80 రూపాయలు

    కర్ణాటక 36.5 రూపాయలు

    తెలంగాణ 21 రూపాయలు

    కేరళ 19 రూపాయలు

    ఇక.. ఈ డీలిమిటేషన్ జరిగితే.. ఇప్పటివరకు.. ఈ డబ్భైయినా.. వెనక్కు వచ్చేది.. ఇక.. ఇది కూడా వస్తున్నది కూడా గారంటీ లేదు ఎందుకంటే.. ఎంపీ సీట్లు పెంచుకుని వాళ్లే మెజారిటీ కొద్ది బిల్లులకు ఆమోదం తెలుపుకుంటారు!

    పార్లమెంటు లో 2014 లో ఇచ్చిన ప్రత్యేక హోదా, పోలవరం , Division of Assets and Liabilities, Establishment of Educational Institutions etc. కె దిక్కు లేదు! ఇంత మంది ఎంపీలు ఉంది.. రైల్వే జోన్ వాల్తేరు డివిజన్ లేకుండా ఇచ్చేసారు! ఇక ఎంపీలు తక్కువుంటే.. పరిస్థితేంటి?

Comments are closed.