కొన్ని రోజుల కిందట హైదరాబాద్ లో బంగారం ధర ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. అది త్వరలోనే లక్ష రూపాయల మార్క్ అందుకుంటుందనే అంచనాలు అప్పుడే వెలువడ్డాయి. ఇప్పుడా అంచనాల దిశగా బంగారం దూసుకుపోతోంది. తాజాగా మరో ఆల్ టైమ్ హై అందుకుంది.
ఈరోజు సాయంత్రం 6 గంటల నాటికి ఢిల్లీలో 10 గ్రాముల బంగారం (24 క్యారెట్) ధర రూ.96,450కు చేరుకుంది. ఇటు హైదరాబాద్ లో కూడా దాదాపు అదే ధర (96,430) వద్ద బంగారం ధర ట్రేడ్ అయింది.
బంగారం ఇక ఎంతమాత్రం సామాన్యుడికి అందుబాటు ధరల్లోకి రాదనే విశ్లేషణలు మార్చి మొదటివారంలోనే వచ్చాయి. సరిగ్గా నెల తిరక్కుండానే అది మరో ఆల్ టైమ్ హై రేటు ఉంటుంది. మరికొన్ని రోజుల్లో లక్ష తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా అమెరికా-చైనా కొట్టుకున్న పుణ్యం.
చైనాపై అమెరికా దిగుమతి సుంకం విధించింది. దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికాపై దిగుమతి సుంకాలు పెంచింది. అగ్రరాజ్యానికి కోపమొచ్చింది. ఈసారి 145 శాతానికి పైగా సుంకాలు పెంచేసింది. చైనా కూడా తగ్గలేదు, ఆమెరికాపై ఏకంగా 125 శాతం దిగుమతి పన్నులు పెంచేసింది.
ఇలా అమెరికా-చైనా పన్నులతో కొట్టుకుంటున్న వేళ.. ముదుపర్లు టెన్షన్ పడ్డారు. వాళ్ల టెన్షన్ అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో కనిపిస్తూనే ఉంది. ఇలాంటి టైమ్ లో బంగారానికి మించిన సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఇంకోటి లేదు. అందుకే బంగారం ధర భగ్గుమంది.
అసలే ఇది పెళ్లిళ్ల సీజన్. ఇలాంటి టైమ్ లో బంగారం రేటు ఇంతలా పెరగడం మధ్యతరగతి జనాన్ని చాలా ఇబ్బందిపెట్టే అంశం.
జాయిన్ కావాలి అంటే