ఖైదీలకూ కుంభమేళా పుణ్య స్నానాలు

ఈసారి మహా కుంభమేళాలో పాల్గొనే అవకాశాన్ని జైళ్లలో మగ్గుతున్న ఖైదీలకు కూడా కల్పించాలని భావిస్తోంది ఉత్తరప్రదేశ్ సర్కారు.

144 ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే మహాకుంభమేళా తుది అంకానికి చేరుకుంది. మరో వారం రోజుల్లో మహా కుంభమేళా ముగియబోతోంది. దీన్ని పొడిగిస్తారనే చర్చ ఓవైపు సాగుతున్నప్పటికీ, మరోవైపు శివరాత్రి లోపు స్నానం చేస్తేనే మంచిదనే భావనకు వచ్చేశారు భక్తులు.

ఇదిలా ఉండగా, ఈసారి మహా కుంభమేళాలో పాల్గొనే అవకాశాన్ని జైళ్లలో మగ్గుతున్న ఖైదీలకు కూడా కల్పించాలని భావిస్తోంది ఉత్తరప్రదేశ్ సర్కారు. ఈ మేరకు జైళ్ల శాఖ నిర్ణయం తీసుకొని, తేదీ కూడా ఫిక్స్ చేసింది. ఉత్తరప్రదేశ్ లో 75 జైళ్లలో ఉన్న 90,000 మంది ఖైదీలకు పుణ్యస్నానం చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.

అయితే వీళ్లందర్నీ తీసుకొని ప్రయాగ్ రాజ్ వెళ్లడం లేదు పోలీసులు. ప్రయాగ్ రాజ్ లో ఉన్న త్రివేణి సంగమం నుంచి పవిత్ర జలాల్ని జైళ్లకు తీసుకొచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. సంగం ఘాట్ నుంచి పవిత్ర జలాల్ని ట్యాంకర్లతో రాష్ట్రంలోని జైళ్లకు తరలిస్తారు.

అలా తీసుకొచ్చిన జలాల్ని జైళ్లలో ఉన్న నీటి ట్యాంకుల్లో కలుపుతారు. అలా కలిపిన నీటిని 21వ తేదీ ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు వదులుతారు. ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహించుకొని ఆ టైమ్ కు పవిత్ర జలాల కింద ఖైదీలంతా పుణ్య స్నానాలు చేయొచ్చు. ఈ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ లో ఉన్న జైళ్లలో ఒకేసారి నిర్వహించబోతున్నారు.

కుంభమేళాలు 4 రకాలు. నాలుగేళ్లకు ఒకసారి జరిగేది కుంభమేళా. ఆరేళ్లకు ఒకసారి జరిగేది అర్థ కుంభమేళా. 12 ఏళ్లకు ఒకసారి జరిగేది పూర్ణ కుంభమేళా. 144 ఏళ్లకు ఒకసారి జరిగేది మహా కుంభమేళ. ఇంకా చెప్పాలంటే, 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత వచ్చే కుంభమేళాను మహా కుంభమేళ అంటారు. ఇప్పుడు జరుగుతున్నది అదే.

6 Replies to “ఖైదీలకూ కుంభమేళా పుణ్య స్నానాలు”

Comments are closed.