వెలుగు ఆవల చీకట్లే!

జూదమూ తాగుడూ ఆ పనులను గుంపుగా చేయడానికి పడే ఆరాటమూ మాత్రమే ఇవాళ సంక్రాంతికి నిర్వచనం.

భోగి మంటల వెలుగులు చూశావ్..
బుగ్గి అయిన బతుకులు ఎన్ని?
సంక్రాంతి పండుగ విందులు చూశావ్..
కుదేలైన కుటుంబాలు ఎన్ని?
పందెపు కోళ్ల రోషాలే చూశావ్..
పీకలు తెగకుండానే.. శిథిలమైన మానవ జీవితాలు ఎన్ని?

పండగ అంటే.. ఉండే సాంప్రదాయిక ఆచారం, కట్టుబాట్లు, పద్ధతులు లాంటివి ఇప్పుడు ఎందరికి గుర్తున్నాయో మరి! పంట దిగుబడులను చూసుకుని, ప్రకృతిని పశువులను ప్రేమగా పూజించుకుని.. మన కృతజ్ఞతలు చెల్లించుకుని.. ఆనందంగా గడపడమే సంక్రాంతి అనే భావన ఎందరికి తెలుసు? పండగ లో ఉండే అసలైన వేడుక మసకబారిపోతోంది.

జూదమూ తాగుడూ ఆ పనులను గుంపుగా చేయడానికి పడే ఆరాటమూ మాత్రమే ఇవాళ సంక్రాంతికి నిర్వచనం. ఈ రీతిలో పండగను సెలబ్రేట్ చేసుకున్న తరువాత.. భోగిమంటలు, సంక్రాంతి వెలుగుల తర్వాత.. ఎన్ని వేల జీవితాలలో చీకట్లు చిక్కబడిపోయాయో ఎందరికి తెలుస్తుంది? ఎన్ని బరులు వెలిశాయో.. ఎన్ని వేల కోట్ల చేతులు మారాయో అందరూ చెబుతారు? ఎన్ని కుటుంబాలు పతనానికి చేరువ అయ్యాయో.. ఏ పత్రికలు రిపోర్ట్ చేస్తాయి? సంక్రాంతిని.. సర్కారీ ముద్రగల జూదవేడుకగా మార్చేసిన పండుగ యొక్క దుర్మార్గపు వైభవం గురించి ఈవారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘వెలుగు ఆవల చీకట్లే!’

‘సంక్రాంతికి ఊరెళ్లాలి సార్’ అన్నాడు ఒక వాచ్ మ్యాన్. అపార్టుమెంటులో పండగపూట కనీసం చిమ్మి ముగ్గేయడానికి మనిషి లేకుండా సకుంటుంబంగా వెళ్లిపోతే ఎలా? చాలా సేపు మాటల తర్వాత.. ‘పని ఉంటే వెళ్లు.. పండగ అనే వేలం వెర్రితో వెళ్లాల్సిన అవసరం లేదు’ అని ఫ్లాట్స్ వాళ్లు అన్నారు. ‘పని ఉంది సార్.. రేషన్ కార్డు ఉన్నోళ్లకి పక్కా ఇళ్లు ఇస్తున్నారంట.. రాయించుకోవాలి’ అన్నాడు. అదొక అబద్ధం. వాచ్ మ్యాన్ ఏపీకి చెందిన వాడు. ‘చంద్రబాబు సర్కారు అలాంటి స్కీమ్ ఏదీ ప్రారంభించలేదే’ అన్నారు వాళ్లు. దొరికిపోయినట్టు నవ్వాడు. వాళ్లు పొమ్మనలేదు. అతను పోకుండా ఆగలేదు. సకుటుంబంగా ఒక్కోటీ మూడు వేల రూపాయలకు టికెట్లు కొని.. ముగ్గురూ ఊరెళ్లారు. అదే ధరకు తిరుగు టికెట్లు తీసుకుని తిరిగి వచ్చారు. ఇంచుమించుగా ఇరవై వేల రూపాయలు ప్రయాణం కోసమే ఖర్చు పెట్టారు. ఆ వాచ్ మ్యాన్ నెల జీతం రూ.5500 మాత్రమే. అంటే నాలుగు నెలల జీతం తగలేసి.. మూడు రోజుల పండగ కోసం ఊరెళ్లి వచ్చాడు. అంతటి ఆకర్షణ ఏమున్నది పండగలో..?

సంక్రాంతి అంటే పొలం దిగుబడులు ఇంటికి చేరే సీజను గనుక.. రైతులు చేసుకునే పండగగా మనం అనుకుంటాం. ఉత్తరాయణ పుణ్యకాలం అంటూ పురాణ గ్రంథాల్లో ఒక వ్యక్తీకరణ ఉంటుంది గనుక.. మకర రాశిలోకి సంక్రమణం అనే జ్యోతిష శాస్త్ర వివరణ ఉంటుంది గనుక అలాంటి ప్రాశస్త్యం భావించుకుని కొందరు మరణించిన కుటుంబ పెద్దలకు తమ తమ శక్తి మేర పూజలు చేసుకుని గుర్తు చేసుకుంటారు. కానీ.. ఇవాళ వేలం వెర్రిగా ఎగబడి వెళుతున్న వారికి ఇలాంటి ఆలోచనలు లేశమాత్రంగానైనా తెలుసా?

ఈ సందేహం చాలా పెద్దది. ఎందుకంటే.. సంక్రాంతి వైభవం ఏపీలో మాత్రమే ఉంటుందని, తెలంగాణలో దసరా వైభవం మాత్రమే ఉంటుందని ఎవరైనా అజ్ఞానంతో సూత్రీకరించవచ్చు. కానీ.. తెలంగాణకి చెందిన అనేక ప్రాంతాల వాళ్లు కూడా సంక్రాంతి అంటే.. ఎగబడి మరీ గోదావరి జిల్లాలకు వెళ్లాలని.. అక్కడి మిత్రుల ఇళ్లకు వెళ్లి ఆతిథ్యం స్వీకరించాలని తాపత్రయపడతారు. అక్కడికేదో సంక్రాంతి పండగను గోదావరి జిల్లాలు గుత్తకు తీసుకున్నట్టుగా భావిస్తూ ఉంటారు. అక్కడి హడావుడి కూడా అలాగే ఉంటుంది. మరి.. అలాంటి వారందరికీ సంక్రాంతి అంటే తెలుసునని ఎలా అనుకోగలం?

సర్కారు అచ్చోసిన తర్వాత..

సంక్రాంతి అంటే గోదావరి జిల్లాల్లో కోడిపందేలు మాత్రమే అని ఇవాళ రేపటి రోజుల్లో ఎవరైనా యువతరం అనుకుంటే.. వారిని తప్పుపట్టలేం. మొన్నమొన్నటిదాకా ఒక చిన్న హద్దుగీత ఉండేది. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకు కొన్ని నెలల ముందు కోడిపందేలు జరగడానికి వీల్లేదని, అది జూదం, ఆ ముసుగులో అనేక దారుణాలు జరుగుతున్నాయని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కొన్ని హైకోర్టుల్లో దాఖలు అయ్యేవి. ఇదే తరహాలో సంక్రాంతి నాటికి తమిళనాడులో జరిగే జల్లికట్టుకు వ్యతిరేకంగా కూడా పిటిషన్లు పడేవి. కోర్టుల్లో ప్రతిసారీ ఒకే రకమైన తీర్పు వచ్చినట్టుగా లేదు. కొన్ని సార్లు ప్రభుత్వాన్ని ఒపీనియన్ అడగడమూ, కొన్ని సార్లు కోడిపందేలు జరగడానికి వీల్లేదని చెప్పడమూ ఇలా తీర్పులుండేవి.

జల్లికట్టును నిషేధిస్తే.. తమిళ ప్రపంచం మొత్తం ఆ తీర్పుకు వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేసింది. తెలుగునాట కోడిపందేలను నిషేధిస్తే.. ఆ స్థాయి వ్యతిరేకత రాలేదు. కానీ తీర్పు అమలు అనేది ప్రహసనప్రాయంగా మారింది. నిషేధించిన సందర్భాల్లో కూడా విచ్చలవిడిగా కోడిపందేలు జరిగాయి. పోలీసులు చూసీచూడనట్టే వ్యవహరించారు.

ఈసారి వ్యవహారం చాలా చిత్రంగా సర్కారు వారి అచ్చోసి వదిలేసినట్టుగా తయారైంది. సాక్షాత్తూ పాలకులే కోడిపందేలు, జల్లికట్టు లాంటివి మన సంస్కృతిలో భాగమైన వ్యవహారాలు అని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు.. ఇక వాటిని అడ్డుకోవడానికి పోలీసులు మాత్రం ఎందుకు సాహసిస్తారు. అడ్డుకుని పాలకుల ఆగ్రహానికి గురయ్యే బదులుగా.. మిన్నకుండిపోయి తమకు దక్కగల వాటాలను పొందడం సుఖం అని ఎవరికైనా అనిపిస్తుంది కదా?

సర్కారు అచ్చోసి వదిలేస్తే.. జూదక్రీడలు ఏ స్థాయిలో జరుగుతాయో అర్థం చేసుకోవడానికి ఈ ఏడాది జరిగిన సంక్రాంతి వేడుకలు మంచి ఉదాహరణ. ఉభయగోదావరి జిల్లాల్లో కలిపి దాదాపు రెండువేల కోట్ల రూపాయల సొమ్ము చేతులు మారినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది చిన్న విషయం కాదు. కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలో రెండు వేల కోట్ల రూపాయల వ్యవహారం అంటే చాలా పెద్దది కింద లెక్క.

గేంబ్లింగ్ అడ్డా చేయదలచుకున్నారా?

కోడి పందేలను సంస్కృతిక వైభవం కింద గుర్తించాలని చెప్పడం ఒక పెద్ద ఆత్మ వంచన. ఆ ముసుగులో జరిగే అతిపెద్ద జూద క్రీడ ఇది. ప్రజల ధనమాన ప్రాణాలను గుల్ల చేసే వ్యవహారం ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవకాశం ఉన్న ప్రతి చోట క్యాసినోలను ఏర్పాటు చేసి దేశంలోనే జూద క్రీడకు ఒక ప్రముఖ స్థావరంగా మార్చడానికి సంకల్పం తీసుకున్న పాలకులు ఉన్నారు. ఆ వ్యవహారం కార్యరూపం దాల్చకపోయినప్పటికీ.. అలాంటి వారినుంచి కోడిపందేలు వంటి వాటి నిషేధాన్ని ఆశించడం అత్యాశ అవుతుంది.

ఈసారి రెండు జిల్లాల్లో కలిపి రెండు వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లుగా చాలా సగర్వమైన వార్తలు వచ్చాయి. ఇక్కడ ప్రధానంగా ఒక సంగతి గుర్తించాలి. కోడిపందేల బరుల ద్వారా జరిగేది మాత్రం అంతే. కేవలం జూదమే. చెప్పుకోడానికి ఒక కోడిపందెం బరి ఏర్పాటు చేస్తారు. ఆ బరి చుట్టూతా ఇతర జూదరూపాలు అన్నింటికీ సముచిత స్థానం కల్పిస్తారు. పేకాటలో అన్ని రకాల ఫార్మాట్లకు అక్కడ వేర్వేరుగా చోటు ఉంటుంది.

మూడుముక్కలాట, గుండాట వంటివి అన్నీ ఉంటాయి. నాన్ వెజ్ ఆహార పదార్థాలను అక్కడికక్కడ వండి అందించే విక్రయశాలలు ఉంటాయి. వీటన్నింటినీ విడివిడిగా సబ్ కాంట్రాక్టులకు కేటాయించినట్టుగా స్టాల్స్ లాగా కేటాయించేస్తారు. వీటన్నింటినీ మించి.. ఆ బరుల వద్ద మద్యం ఏరులై పారుతుంది. బెల్టు షాపు వంటి సంకుచితమైన పదాలు అక్కడ జరిగే లిక్కరు వ్యాపారానికి సరిపోవు. దుకాణాల్లో జరిగే విక్రయాలకు దీటైన రీతిలో బరుల వద్ద మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా సంస్కృతిలో భాగమేనా?

పేకాట, ఇతర ఫార్మాట్లలోని జూదం నిషిద్ధమే. ప్రత్యేకించి సంక్రాంతి కోడిపందేల బరుల వద్ద కోడి పందెం ద్వారా జరిగే లావాదేవీలు పాతిక శాతమే ఉంటాయని అనుకోవచ్చు. కానీ ఆ చుట్టూ ఏర్పాటు అయ్యే ఇతర జూదాలలో, విక్రయాలలో, వ్యవహారాలలో 75 శాతం వ్యాపారం నడుస్తుంటుంది. కుటుంబాలు గుల్ల అయిపోయేది ఈ ఫార్మాట్లలోనే.

రెండు వేల కోట్ల వ్యవహారాలు జరిగాయి అని చంకలు గుద్ది చెప్పుకోవడానికి ఇదేమీ ఉత్పాదక పరిశ్రమ లాంటిది కాదు. ఒక సంస్థ ఏర్పాటు కాలేదు. ‘పని’ జరగలేదు.. ‘ఫలితం’గా భావించడానికి వీల్లేదు. ఇలాంటి వ్యవహారాల్లో– ఎన్ని వేల కోట్లు అయినా సరే.. ఒకరు లాభపడ్డారు అంటే దాని అర్థం మరొకరు కోల్పోతున్నారనే కదా. జూదం అంటేనే అది. నలుగురి నోర్లు కొట్టి.. ఒకరు బాగు పడడమే జూదం. నాలుగు కుటుంబాలు శిథిలం అయితే.. ఒకడు పార్టీ చేసుకుంటూ పండగ చేసుకోవడమే జూదం. నలుగురు ఆత్మహత్యలకు తెగబడిన వాతావరణంలో.. ఒకడు సెలబ్రేట్ చేసుకునే పరిస్థితే జూదం. కోడిపందేలు కావొచ్చు. వాటి చుట్టూ జరిగే వ్యవహారాలు కావొచ్చు.. అన్నీ నిరూపిస్తున్నది ఇదే.

కోడిపందేల వ్యవహారం కూడా నిజానికి ఆ జిల్లాల వారికి కూడా చాలా మందికి ఒక భారంగా మారుతున్నదంటే అతిశయోక్తి కాదు. ఎక్కడెక్కడినుంచో జనం తమ జిల్లాలకు వచ్చేస్తుంటారు. వారందరూ ఒక సాంప్రదాయాన్ని పరిరక్షిస్తున్నంత పోజులో కోడిపందేలు కాస్తుంటారు.

తాము ఆ జిల్లాల్లో ఉండి పందేలు ఆడకపోతే అవమానంగా భావించేవారు వేలల్లో ఉంటారు. వారంతా సంపన్నులు కాదు. అనుచితమైన స్థాయిలో తమ కష్టానికి వందల రెట్లు సంపాదనలు కలిగిఉన్న వారు కాదు. లక్షరూపాయలు విలాసంగా పందెంలో కాసి.. ఆ డబ్బు కోల్పోయినా సరే.. సెలబ్రేట్ చేసుకుంటూ స్కాచ్ విస్కీ తాగేసి ఆనందించగలిగేవారు కాదు. తమ సేవింగ్స్ బయటకు తెస్తారు.. గతిలేకపోతే తమ ఇళ్లలో విలువైన వాటిని తాకట్టు పెట్టి సొమ్ములు తెస్తారు. అక్కడికీ దోవ లేకుంటే.. తెగనమ్ముతారు. బంగారమూ పొలాలు అమ్మి పందేల్లో కాసేవాళ్లు. ఏకంగా ఆస్తులనే పందెంలో ఒడ్డి పూర్తిగా సర్వనాశనం అయ్యేవాళ్లు కూడా మనకు ఈ జూద దందాల్లో కనిపిస్తూ ఉంటారు. ఈ యావత్తు వికృత పోకడలన్నింటినీ సంప్రదాయం పరిరక్షణ అనే ఆత్మవంచన మాటలతో కప్పిపెట్టకుండా.. జాగ్రత్త పడాలి.

అల్లుళ్లకు విందులు ఇంకో దుర్మార్గం..

సంక్రాంతి రోజుల్లో– ప్రత్యేకించి గోదావరి జిల్లాల్లో ఇంకో దుర్మార్గమైన పోకడ ప్రబలంగా కనిపిస్తూ ఉంటుంది. తమ ఇంటికి తొలి సంక్రాంతి పండుగకు వస్తున్న అల్లుడికి కనీ వినీ ఎరుగని విందుభోజనాలను వడ్డించడం. ఇంటి అల్లుడికి కాస్త అతిశయమైన ఆదరణ, ప్రేమతో కూడిన భోజనాలు వడ్డించడం మామూలే. కానీ.. గోదావరి జిల్లాల్లో ఇది కూడా సంక్రాంతి పర్వదినం రోజుల్లో శృతి మించుతూ ఉంటుంది.

అసలు ఈ ప్రపంచంలో మనిషి అనేవాడు ఎవడైనా సరే.. వంద రకాల కూరలతో భోజనం చేయడం సాధ్యమేనా? అనేది పూటకూటికి గతిలేని సామాన్యుడికి సందేహంగా పుడుతూ ఉంటుంది. పత్రికల్లో, టీవీ ఛానెళ్లలో మాత్రం.. అల్లుళ్లకు ఎంత గొప్పమర్యాదలు చేశారో కదా.. అంటూ వంద కూరలు వడ్డించిన పెద్ద విస్తరి ముందు, ఒక అర్భకపు ప్రాణిలాగా అల్లుడు కూర్చుని ఉండే విజువల్స్ ప్రదర్శితం అవుతూ ఉంటాయి. ఏవో కొన్ని అతి సంపన్న లేదా అతి ఆడంబరమైన కుటుంబాల్లో ఇలాంటివి జరగవచ్చు గాక.. అది కూడా కేవలం తమ డాంబికాన్ని ప్రదర్శించుకోవడం కోసం మాత్రమే.

కానీ.. గోదావరి జిల్లాలకు అల్లుడుగా వెళ్లే ప్రతి ఒక్కడూ తమ అత్తగారి ఇంటినుంచి ఇలాంటి మర్యాదలు కోరుకుంటే ఆ కుటుంబాలు ఏమైపోతాయి? ఇప్పటికే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా.. ఒకరిని చూసి మరొకరు ఆడంబరమైన ఆతిధ్యాలకు వెళుతూ.. ఆర్థికంగా నాశనం అయిపోతున్నారు. ఇలాంటి ప్రదర్శనలు వేల కుటుంబాలను మరింతగా ఆర్థిక పతనం వైపు నెడుతుంటాయి.

పండగ అంటే కేవలం.. ఆత్మీయులు, బంధువులూ అందరూ ఒకచోట కలవడం. సుదీర్ఘమైన విరామం తరువాత కలుస్తున్న సందర్భాన్ని ఆత్మీయంగా గడుపుకోవడం మాత్రమే అనే ఆలోచన రావాలి. పండగ అనేది ప్రదర్శన కోసం కాదు.. తమ ఆత్మీయతలను, అనుబంధాలను కలబోసుకోవడానికి మాత్రమే అనే ఆచరణాత్మక దృక్పథం ఉండాలి. ప్రదర్శనాభిలాష కొందరికి తీయగా కనిపించవచ్చు.. కానీ అనేకమందికి భారంగా మారుతున్నదని కూడా అంగీకరించాలి. లేకపోతే.. సంక్రాంతి అనే ముసుగులో.. ఈ వేలం వెర్రి వికట పోకడలు నానాటికీ పెరుగుతూపోయి సమాజాకి సంతులనాన్ని ఛిద్రం చేస్తాయి.

..ఎల్. విజయలక్ష్మి

17 Replies to “వెలుగు ఆవల చీకట్లే!”

  1. ఏం చేద్దాం చెప్పండి? 50. దాటాక చేదస్తం రావడం సహజం. సమాజపు పోకడ పెను పోకడ గా కనిపించడం అంతే సహజం. ఈ పెనుపోకడ లేకపోతే మీకు రాత శోష తగ్గేది. సాహిత్యపు రాతలులో కూడా అదే మార్పు ఉంది గమనించండి from 1900 to 2020.

  2. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  3. Apart from political statements, agree with your views. నిజంగా సంక్రాంతి పండుగ అంటే పాడి పంటలు ప్రకృతిని కృతజ్ఞత భవన తో జరుపుకునే పండుగ. కాని ఇప్పుడు పండుగ అంటే సినిమా, కోడి పందాలు మాత్రమే అనుకునే లాగా చూపిస్తున్నారు media (including socialmedia).

    No need to blame govt, it’s people’s interest and influenced by misleading interpretation by few media.

  4. గోదావరి జిల్లాల మీద బాగా కుళ్లు నీకు.ఏదో రాయాలని పాయటం కాకపోతే, హైదరాబాదులో 5500 లకి వాచ్మెన్ ఎక్కడ దొరుకుతున్నాడు ఈరోజుల్లో?

    మరి హైదరాబాదులో తెలంగాణలో చిన్న ఫంక్షన్ అంటే మందు ముక్క ఉండాల్సిందే. మరి ఆ సంప్రదాయాన్ని తప్పనడానికి నోలేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయెందుకు?

    క్రిస్మస్ న్యూఇయర్ పార్టీల లాంటివే సంక్రాంి పార్టీలు కూడా.. ఉన్నవాడు ఖర్చు పెడతాడు. లేనివాడు లేదు. మధ్యలో నీకెందుకూ?

  5. అసలు ప్రతీ ఊరిలో ఓ పది పబ్లు పెడితే, ఎవరో సెలవిచ్చినట్ట్లు govt కు GST చాలా మందికి ఉపాధి కాలక్షేపం, దొమ్మీ లు , తర్వాత పంచాయితీలు కమిషన్లు, పనిలో పనిగా ఊదడాలు కేసులు వగైరా వగైరా. ఎంతో మందికి పని .

  6. పాఫమ్ “తిరుమల సెట్టింగ్ ‘లేని సంక్రాంతి” చూసి ఈ “ల0జె లచ్చక్క” కి కన్ను కుట్టినట్టు ఉంది.. అవునా లచ్చీ??

  7. సమాజంలో అన్నీ ఉంటాయ్ ఎవడికి ఏది మంచో ఏది కావాలో అది తెలుసుకోవాలి , దాన్నే ఇంగితం అంటారు. ఆ ఇంగిత జ్ఞానం జనాల్లో లోపించింది , ప్రభుత్వాలు కఠినంగా ఉండాలి

  8. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.