కిల్ తెలుగులో తీస్తే!

కిల్ సినిమా హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. హింస న‌చ్చే వాళ్ల‌కు ఇది సూప‌ర్ సినిమా. సున్నిత మన‌స్కులు చూడ‌క‌పోతేనే మంచిది. 1.45 గంట‌లు నాన్‌స్టాప్‌. గ్రిప్పింగ్‌గా న‌డిచే కిల్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే, రీమేక్…

కిల్ సినిమా హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. హింస న‌చ్చే వాళ్ల‌కు ఇది సూప‌ర్ సినిమా. సున్నిత మన‌స్కులు చూడ‌క‌పోతేనే మంచిది. 1.45 గంట‌లు నాన్‌స్టాప్‌. గ్రిప్పింగ్‌గా న‌డిచే కిల్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే, రీమేక్ హ‌క్కుల కోసం చాలా మంది ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌ముఖ సంస్థ‌ల‌తో పాటు, ర‌వితేజ‌తో కిలాడి అనే డిజాస్ట‌ర్ తీసిన ర‌మేశ్‌వ‌ర్మ కూడా లైన్‌లో వున్న‌ట్టు తెలుస్తోంది. ధ‌నుష్ హీరోగా త‌మిళం, తెలుగులో తీసే ప్ర‌య‌త్నం కూడా జరుగుతోంది.

ఆశ్చ‌ర్యం ఏమంటే ఈ టైప్ సినిమాల‌కి ఏదో ఒక ఇంగ్లీష్ సినిమా ప్రేర‌ణ వుంటుంది. కానీ 1995లో జ‌రిగిన ఒక రైలు దోపిడీ దీనికి ప్రేర‌ణ అని నిర్మాత‌లు అంటున్నారు. ల‌య‌న్స్‌గేట్ సంస్థ కిల్‌ని ఇంగ్లీష్‌లో తీయ‌బోతూ వుంది. ప్ర‌పంచంలో అనేక దేశాల్లో కిల్ ప్ర‌శంస‌లు పొందింది. భ‌యాన‌క, హింసాత్మ‌క చిత్ర‌మ‌ని పొగిడారు. కొరియా, నెద‌ర్లాండ్స్‌, ర‌ష్యాల్లో కూడా ఇది రిలీజ్ అయింది.

నిఖిల్ న‌గేష్ భ‌ట్ డైరెక్ష‌న్ చేసిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 7, 2023లో మొద‌టిసారి టొరంటో ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్రీమియ‌ర్ వేశారు. 2024, జూలైలో ఇండియాలోని అన్ని ప్రాంతాల్లో విడుద‌లైంది. హైద‌రాబాద్‌లో వేశారో లేదో కానీ , తెలుగు మీడియా నుంచి ఎక్క‌డా స‌మీక్ష‌లు, విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ట్టు లేవు.

రీమేక్ చేసేంత ఏముంది అంటే, దీంట్లో క‌థ ఏమీలేదు. ఎమోష‌న్స్‌, డైలాగ్‌లు, పాట‌లు వీటికి స్పేస్ చాలా త‌క్కువ‌. కంప్లీట్‌గా యాక్ష‌న్‌, ఫైట్స్. ఆశీష్ విద్యార్థి త‌ప్ప‌, మిగ‌తా వాళ్ల పేర్లు కూడా మ‌న‌కు తెలియ‌వు. సింఫుల్‌గా క‌థ ఏమంటే హీరోయిన్‌కి ఇష్టం లేని నిశ్చితార్థం. ఆమె తండ్రి బాగా ధ‌న‌వంతుడు, ప‌లుకుబ‌డి ఉన్న‌వాడు. తండ్రిని ఎదిరించ‌లేక రాయ‌పూర్‌లో నిశ్చితార్థం చేసుకుంటుంది. హీరో క‌మాండో (నేష‌న‌ల్ సెక్యూరిటీ గార్డ్‌). రాయ‌పూర్‌కి వ‌చ్చి హీరోయిన్‌ని క‌లుస్తాడు. సూప‌ర్ ఫాస్ట్ రైల్లో రాయ‌పూర్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్ర‌యాణం. 30 మందికిపైగా ఉన్న బందీపోటు దొంగ‌ల ముఠా రైల్లో ఎక్కుతుంది. అర‌గంట‌లో దోపిడీ ముగించి వెళ్లిపోవాలి. రైల్లో ఉన్న హీరో, అత‌ని స్నేహితుడు ఎలా ఎదుర్కొంటారు? మొత్తం యాక్ష‌న్‌, ఫైట్స్‌తో మ‌నం ప‌క్క‌కి క‌ద‌ల‌కుండా చూసేలా చేయ‌డం నిజంగా మ్యాజిక్‌.

అయితే విప‌రీత‌మైన హింస‌. కొన్ని సీన్స్ సెన్సార్ ఎలా ఒప్పుకుందా? అని ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. క్వెంటిన్ ట‌రంటినో సినిమాలోలాగా ర‌క్తం ఎగ‌ద‌న్న‌డం, మాంస‌పు ముద్ద‌లు క‌న‌ప‌డ‌డం కొన్ని జుగుప్సాక‌ర దృశ్యాలు వుంటాయి. హింస సంగ‌తి ప‌క్క‌న పెడితే, కిల్‌లో నేర్చుకోవాల్సిన అంశం ఏమంటే నాలుగు లైన్ల క‌థ‌తో గ్రిప్పింగ్‌గా సినిమా తీయ‌డం. మ‌న వాళ్లు క‌థ‌ని క‌ల‌గాపుల‌గం చేసి రెండున్న‌ర మూడు గంట‌లు సోది చెప్పి విసిగించి చంపుతున్నారు. కేవ‌లం ఫైటింగ్ సినిమా అయితే దీన్నెవ‌రూ ప‌ట్టించుకోరు. దొంగ‌ల పాత్ర‌ల‌కి కూడా ఒక క్యారెక్ట‌ర్ డిజైన్ వుంటుంది. డైరెక్ట‌ర్ అది ప‌ట్టుకున్నాడు.

తెలుగు రీమేక్ ఆడుతుందా? అంటే చెప్ప‌లేం. ఇంత హింస మ‌న‌కి ఎక్కుతుందా? అనేది ఒక సందేహ‌మైతే, ఒరిజిన‌ల్ క‌థ‌ని నానార‌కాలుగా క‌ల్తీ చేయ‌డంలో మ‌న వాళ్లు సిద్ధ‌హ‌స్తులు. చ‌మ్మ‌క్ చంద్ర కామెడీ బిట్లు, అన్న‌పూర్ణ‌మ్మ మ‌ద‌ర్ సెంటిమెంట్ యాడ్ చేసి చివ‌రికి ఆవు వ్యాసం రాసి సినిమా ఎందుకు పోయిందో అని జుత్తు పీక్కుంటారు.

జీఆర్ మ‌హ‌ర్షి

11 Replies to “కిల్ తెలుగులో తీస్తే!”

  1. //మ‌న వాళ్లు క‌థ‌ని క‌ల‌గాపుల‌గం చేసి రెండున్న‌ర మూడు గంట‌లు సోది చెప్పి విసిగించి చంపుతున్నారు.//

    రెండున్నర గంటలు తీస్తే పరవాలేదు. ఇప్పుడు రెండేసి, మూడేసి పార్ట్లు తీసి ఒక సినిమాకి మూడు టిక్కెట్ల డబ్బు దండుకుంటున్నారు.

  2. Movie is very good (who likes action movies) hatsoff to Director

    For sure it won’t workout in south languages ,..better leave as it is..

    నిర్మాత కు మరీ దూ,…ల ఉంటె మనం చెసెది ఎమి లెదు

  3. అందుకే మహర్షి గారు ఒక కథ రాసి, సొంతే డైరక్షన్ లో తీసి విడుదల చేసి, ఆ సినిమా కి సొంతగా మీరే రివ్యూ రాస్తే చూడాలని వుంది. వేరే వాళ్ళు తీసిన సినిమాలు మీద రివ్యూ లో రాసే బదులు.

  4. ఒక్కసారి కిల్ ని చూసినోడు మళ్ళీ ఒరిజినల్ మూవీ ని చూడాలి అనుకుంటాడు గాని, ss రాజమౌళి రీమేక్ చేసినా చూడాలనుకోడు.

Comments are closed.