తాగి పడిపోయిన భేతాళున్ని ఎప్పటిలాగే భుజం మీద వేసుకుని బార్‌లోకి వెళ్లాడు విక్రమార్కుడు. విస్కీ వాసనకి భేతాళుడు కళ్లు తెరిచాడు.
“విక్రమార్కా. మళ్లీ కూడా నన్ను మోసుకెళ్లాల్సింది నువ్వే. శ్రమ తెలియకుండా ఒక కథ చెబుతా విను”
పదికి పది సినిమాలు చిర్రున చీదుతూ శుక్రవారం ఉదయం రావడం, సాయంత్రానికి వెళ్లిపోవడం. నిర్మాతలకి డయేరియాతో మొదలై చలి జ్వరం వచ్చింది. వెళ్లి సెలైన్ పెట్టుకున్నారు.
కుడి చేతి నరానికి సూది గుచ్చుతూ, మనసులోనే బిల్లుని అంచనా వేస్తున్న డాక్టర్‌ని చూసి “అయ్యో, సెలైన్ మాక్కాదు. తెలుగు సినిమాకి ఎక్కించాలంటే ఏం చేయాలి?” అని అడిగాడో అగ్ర నిర్మాత. ఆయన ఈ మధ్య వరుసగా తుస్సు సినిమాలు తీసి డబ్బుతో పాటు నెత్తిమీద జుత్తు కూడా పోగొట్టుకున్నాడు.
డాక్టర్ సుదీర్ఘంగా ఆలోచించి “నేనిచ్చే సలహాకు కూడా ఖర్చు అవుతుంది. అది బిల్లులో యాడ్ అవుతుంది” అన్నాడు.
“కోమా పేషెంట్‌కి ఎనస్తీషియా చార్జి చేయగల సమర్థులు మీరు. అది తెలిసే వచ్చాం. వైద్యం అంటేనే డాక్టర్‌కి నైవేద్యం” అన్నాడు నిర్మాత.
“మీ సినిమాలను బతికించే శక్తి సూది ముక్కు స్వామీజీకి మాత్రమే వుంది”
నిర్మాత కొంచెం కంగారు పడి “ఎవరాయన? ఏమా శక్తి?” అని అడిగాడు.
“ఏక కాలంలో మూడు శంఖాల్ని ఊదుతూ , నాలుగు ఢమరుకాలను వాయించగలడు”
“ప్రేక్షకుడికి ఢమరుకానికి ఏంటి సంబంధం?”
“వాయిస్తేనే ఇద్దరూ మాట వినేది. సూది ముక్కు స్వామీ ప్రత్యేకత ఏమంటే ఆయన జీవితంలో ఎపుడూ సినిమా చూడలేదు”
“సినిమా జడ్జిమెంట్‌కి ఆయనే కరెక్ట్” అని నిర్మాత సెలైన్ పీకేసి తన బృంద సభ్యులతో స్వామీజీ దగ్గరికి పరిగెత్తాడు.
వీళ్ల ముఖాల్లోని లక్ష్మీకళని చూసి , స్వామీజీ మూడు సార్లు హైజంప్, నాలుగు సార్లు లాంగ్ జంప్ చేసి నాట్యమాడాడు.
జనమే జయుడి సర్పయాగాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రేక్షక యజ్ఞం ప్రారంభించాడు. ఈ యాగంతో ప్రేక్షకులు వశీకరణమై థియేటర్ చుట్టూ కుక్కల్లా తిరుగుతారని చెప్పాడు. వెయ్యి కుండలతో నెయ్యి పోసి హోమాన్ని భగభగలాడించారు. బలి పశువుగా ఒక ప్రేక్షకున్ని తెచ్చి,కుర్చీకి గట్టిగా కట్టేసి ఈ మధ్య వచ్చిన సినిమాల్ని చూపించాడు. అతను కాసేపు గింజుకుని తర్వాత శాశ్వత కోమాలోకి వెళ్లిపోయాడు. యాగమంత్రాలు చదువుతూ ప్రేక్షకుని పరిశీలిస్తున్న స్వామీజీ యధాలాపంగా కాసేపు తెరని చూసి తాత్కాలిక కోమాలోకి వెళ్లాడు. స్వామిని కార్పొరేట్ ఆస్పత్రిలోనూ, ప్రేక్షకున్ని సర్వజన ఆస్పత్రిలోనూ చేర్పించారు.
కోమాలోంచి కొన్ని గంటల తర్వాత బయటపడిన స్వామి భయంగా కళ్లు తెరిచి తాయత్తులని, నిమ్మకాయల్ని మూకుమ్మడిగా మంత్రించి ఇచ్చాడు.
థియేటర్‌కి వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి చేతికి తాయత్తు కట్టి, నిమ్మకాయ వాసన చూపిస్తే వశీకరణమై కాలకృత్యాలు కూడా మరిచి, థియేటర్‌ని వదిలి వెళ్లడని స్వామి చెప్పాడు.
ప్రేక్షకుడికి ఎదురు డబ్బు ఇస్తామని చెప్పి, వచ్చిన వాళ్లందరికీ లక్కీ డ్రా తీసి కారుని బంపర్ బహుమతిగా ఇస్తామని చెప్పినా హాలు సగమే నిండింది. ప్రతివాడి చేతికి తాయత్తు కట్టారు. ధైర్యం కోసం అప్పటికే మందు బిగించి వచ్చిన కొందరు తప్ప , మిగిలిన వాళ్లంతా నిమ్మకాయ వాసన చూసారు.
తలుపులు బిగించి, బయట నాలుగు వీధి కుక్కలు, మూడు జాతి కుక్కల్ని కాపలా పెట్టారు. సినిమా స్టార్ట్ అయ్యింది. పది నిమిషాల్లో హాహాకారాలు, ఆర్తనాదాలు, పెడబొబ్బలు ప్రారంభమయ్యాయి. గాలివాన తుపానుగా మారింది. తలుపులు బద్దలు కొట్టి, తాయత్తులు, నిమ్మకాయల్ని తొక్కు కుంటూ పారిపోయారు. బయట కుక్కల ప్లాన్ ఎందుకు వర్కౌట్ కాలేదని ఆరా తీస్తే, టైమ్ బాగాలేక అవి కూడా థియేటర్‌లోకి వచ్చి సినిమా చూడ్డం వల్ల స్పృహ కోల్పోయాయి. వెటర్నరీ ఖర్చు అదనం.
స్వామి దగ్గరికి వెళ్లి గోడు చెప్పుకుంటే, పిర్రకి గుచ్చిన ఇంజక్షన్‌కి మూలుగుతూ “అరే, ఇన్ని శక్తులున్న నాకే, కాసేపు సినిమా చూసి కళ్లు బైర్లు కమ్మాయి. వాళ్లు సామాన్య ప్రేక్షకులు. తట్టుకోలేరు” అని తాత్కాలిక కోమాలోకి వెళ్లాడు.
మాసిన తలపై చేతులు పెట్టుకున్నారు నిర్మాతలు.
“కథ ముగిసింది. విక్రమార్కా, తెలుగు సినిమా బతకాలంటే ఏం చేయాలి? తెలిసి చెప్పక పోతే బార్‌లో బిల్లు నువ్వే కట్టాలి” అన్నాడు.
“అది ఎలాగూ తప్పదు. మన వాళ్లు హీరోలకి నచ్చే కథలు తీస్తున్నారు. ప్రేక్షకుడికి నచ్చేవి కాదు. హీరోలు డబ్బులు తీసుకుంటారు. ప్రేక్షకుడు ఇస్తాడు. ఆ తేడా తెలియదు” అన్నాడు విక్రమార్కుడు.
“నువ్వు పూర్తిగా కరెక్ట్ కాదు. అసలు సమస్య ఏమంటే మన హీరోలు, డైరెక్టర్లు జీవితం నుంచి విడిపోయారు. తాము ప్రత్యేకమైన వ్యక్తులు, తమది ప్రత్యేక ప్రపంచం అనుకుంటున్నారు. భూమి చుట్టూ తిరిగే అంతరిక్ష వ్యర్థాలు వీళ్లు. ప్రేక్షకుడు వుండేది భూమి మీద. అందుకోలేక నెపం ఎవరి మీదో నెడుతున్నాడు” అని భేతాళుడు టేబుల్ మీద వాలిపోయాడు.
జీఆర్ మహర్షి
భేష్..
ఈ వ్యాసం చదివినా, ఈ వ్యాసం లో చెప్పినట్టు సినిమా ప్రేక్షకుడికి అయినట్టు ఆవడం గ్యారంటీ..
Call boy jobs available 8341510897