ఎస్వీయూ వీసీగా వివాదాస్పద రీతిలో నియమితం అయిన వీవీ రాజేంద్రప్రసాద్ రాజీనామా చేశారు. ఆయన ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోకపోయినా, ఆయనను వీసీగా నియమించింది గత ప్రభుత్వం. ఈ వీవీ రాజేంద్ర ప్రసాద్ వేరేవరో అయితే అది వేరే కథ. ఈయన సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణకు స్వయానా సోదరుడు అట. జనసేన పార్టీ తరఫున విశాఖ నుంచి పోటీచేసిన లక్ష్మినారాయణకు తెలుగుదేశం పార్టీతో ఎంత సఖ్యత ఉందో అప్పటికే చాలా ప్రచారం జరిగింది.
అందులో భాగంగానే ఆయన సోదరుడికి ఎస్వీయూ వీసీగా అవకాశం ఇచ్చారట. ఆయన ఆ పదవికి అనర్హుడు అని అప్పుడే వివాదం రేగింది. వీసీ పదవికి తగిన అర్హతలు ఏవీ ఆయనకు లేవని పలువురు అభ్యంతరం తెలిపారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో వెనక్కు తగ్గలేదు.
కానీ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ వెనక్కు తగ్గక తప్పలేదు. ఆయన నియామకం రద్దు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయనే రాజీనామా చేసి తప్పుకున్నారు. దొడ్డిదారిలో ఎస్వీయూకు వీసీగా నియమితం అయిన ఆయన ఇప్పుడు రాజీనామా చేసి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది.
మరి లక్ష్మినారాయణేమో ఊరందరికీ నీతులు చెబుతూ తిరుగుతూ ఉంటారు. ఆయన సోదరుడేమో దొడ్డిదారిన, కనీసం అప్లికేషన్ కూడా పెట్టుకోకుండా ఎస్వీయూ వంటి ప్రతిష్టాత్మక వర్సిటీకి వీసీగా నియమితుడు అయ్యాడట. అంటే చెప్పేందుకేనా నీతులు? నైతిక విలువలు? పాటించేందుకు కాదా?