కొన్ని రోజులు చికెన్ తినకండి

తెలంగాణ ప్రభుత్వం తమ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. కొన్ని రోజుల పాటు చికెన్ కు దూరంగా ఉండాలని సూచించింది.

తెలంగాణ ప్రభుత్వం తమ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. కొన్ని రోజుల పాటు చికెన్ కు దూరంగా ఉండాలని సూచించింది. దీనికి కారణం తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభించడమే.

ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన వారంలో దాదాపు 25 లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ వైరస్ ప్రభావం తెలంగాణలో కూడా కనిపిస్తోంది.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ సమీపంలో ఉన్న ఓ గ్రామంలో ఉన్న పౌల్ట్రీలో భారీ సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. తిర్మలాపూర్, కిష్టాపూర్ ప్రాంతాల్లో కూడా పౌల్ట్రీల్లో వేలాది కోళ్లు చనిపోయాయి. దీంతో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

ప్రజలంతా కొన్నాళ్లు చికెన్ కు దూరంగా ఉండాలని తెలిపింది. పౌల్ట్రీ రైతులు కూడా తమ ఫారాల్లో బయో సెక్యూరిటీ చర్యలు పాటించాలని సూచించింది. చనిపోయిన కోళ్లను సరైన పద్ధతిలో పాతిపెట్టాలని, వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఫారాలు, ఫీడ్ స్టోరేజ్ ప్రాంతాల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించింది.

ఇటీవల కొల్లేరు సరస్సుకు భారీగా పక్షులు వలస వచ్చాయి. వాటి వల్ల కోళ్లకు ఈ వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల కంటే ముందే మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో అంతుచిక్కని వైరస్ తో లక్షలాది కోళ్లు చనిపోయాయి. దీంతో కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది.

తాజా పరిణామాలతో తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ రంగం మరోసారి వణికిపోతోంది. పౌల్ట్రీ రైతులకు భారీగా నష్టాలు వస్తున్నాయి. ఇటు చికెన్ విక్రయించే షాపులు కూడా వెలవెలబోతున్నాయి.

2 Replies to “కొన్ని రోజులు చికెన్ తినకండి”

Comments are closed.