తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలట!

తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలని మాజీ మంత్రి అండ్ కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు గట్టిగా డిమాండ్ చేశాడు.

తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలని మాజీ మంత్రి అండ్ కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు గట్టిగా డిమాండ్ చేశాడు. కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి దాన్ని గులాబీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని ఆ పార్టీ అధికారంలోకి రాగానే డిమాండ్ చేయడం మొదలు పెట్టారు.

రైతులకు అన్యాయం జరిగిందని, దళితులకు అన్యాయం జరిగిందని, మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేర్చలేదని ప్రతి రోజూ ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ ఆఫీసులపై కాంగ్రెస్ వాళ్ళు దాడులు చేస్తున్నా రేవంత్ రెడ్డి గమ్మున ఉంటున్నాడని మండిపడ్డాడు. రేవంత్ రెడ్డి పాలనలో మత కలహాలు పెరిగాయన్నాడు. రాష్ట్రంలో క్రైం రేటు 23 శాతం పెరిగిందని అన్నాడు.

అందుకే కేంద్రం జోక్యం చేసుకొని రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశాడు. క్రైం రేటు పెరిగినట్లు ఈమధ్య మీడియాలో వచ్చింది. కానీ మత కలహాలు జరిగిన దాఖలాలు ఎక్కడా లేవు. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని హరీష్ రావు విమర్శించాడు.

కాంగ్రెస్ పాలన కంటే గులాబీ పార్టీ పాలనే బాగుందని ప్రజల మెదళ్లలో ఎక్కించేందుకు అదే పనిగా ఆ పార్టీ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. హరీష్ రావు డిమాండ్ చేసినట్లు రాష్ట్రపతి పాలన పెట్టాలంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్రంగా క్షీణించాలి.

ప్రజలకు భద్రత లేదనే భావన కలగాలి. ఒకలాంటి సంక్షోభం ఏర్పడాలి. రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పిందని గవర్నర్ కేంద్రానికి నివేదించాలి. రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. తీవ్రమైన మత కలహాలు జరగలేదు. సంక్షోభం తలెత్తలేదు.

లా అండ్ ఆర్డర్ ను ప్రభుత్వం అదుపు చేయలేని పరిస్థితి లేదు. అటువంటప్పుడు కేంద్రం రాష్ట్రపతి పాలన ఎలా పెడుతుంది? హరీష్ రావు డిమాండ్ చేయగానే సరిపోయిందా? ఇలాంటి డిమాండ్ చేస్తే ముందుగా బీజేపీ నాయకులు చేయాలి. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి.

2 Replies to “తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలట!”

Comments are closed.