తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి, వేడిగా సాగుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. తనపై అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ఆరోపణల్ని తిప్పి కొట్టే క్రమంలో హరీశ్‌రావు దూకుడు ప్రదర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో హరీశ్‌రావు కమీషన్లు తీసుకున్నారని, అలాగే పిల్లలైన వాళ్లతో తానేం మాట్లాడాలని, ప్రతిపక్ష నాయకుడు రావాలంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. దీంతో కోమటిరెడ్డిపై హరీశ్‌రావు విరుచుకుపడ్డారు.
రోడ్డుపై వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు చేసినట్టుగా, అసెంబ్లీకి వచ్చే వారికి కూడా అలాంటి పరీక్షలు చేయాలని కోమటిరెడ్డికి పరోక్షంగా చురకలు అంటించారు. ఎందుకంటే, కొందరు సభ్యులు తాగొచ్చి మాట్లాడుతున్నారనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డి మద్యపానాన్ని సేవించి అసెంబ్లీకి వచ్చి, ఏది పడితే అది మాట్లాడుతున్నారనే అర్థాన్ని ధ్వనించేలా హరీశ్‌రావు విమర్శలు చేశారు.
హరీశ్‌రావు ఘాటు కామెంట్స్‌పై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేకలు వేశారు. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు పలు సందర్భాల్లో అధికార, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ఎవరైనా అభ్యంతరకర కామెంట్స్ చేస్తే చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.