సరికొత్త గొడవ: ‘నెత్తిన నీళ్లు’

ఒక పార్టీ అధికారంలో ఉండగా ప్రారంభించిన ప్రాజెక్టుల పనులు- మరొక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తయితే.. వాటిని కొత్త సర్కారు నేతలు ప్రారంభించాలా? వద్దా? ప్రారంభించడం అనేది పద్ధతి ప్రకారం జరగాలా వద్దా?…

ఒక పార్టీ అధికారంలో ఉండగా ప్రారంభించిన ప్రాజెక్టుల పనులు- మరొక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తయితే.. వాటిని కొత్త సర్కారు నేతలు ప్రారంభించాలా? వద్దా? ప్రారంభించడం అనేది పద్ధతి ప్రకారం జరగాలా వద్దా? అంటే ఎవరైనా సరే ఒకే సమాధానం చెబుతారు!

‘ప్రాజెక్టుల పనులు’ అనేవి పార్టీల యొక్క సొంత జేబు డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్న పనులు కాదు- ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మాత్రమే! పార్టీ ఎవరిదనే దానితో నిమిత్తం లేకుండా పనులు యధాతధంగా కొనసాగాలి. పూర్తి కావాలి. ప్రజలకు అందుబాటులోకి రావాలి. కొత్త ప్రభుత్వాలు పనులను ఆపేస్తే- అది ద్రోహం అవుతుంది తప్ప, పూర్తి చేయడం పార్టీ క్రెడిట్ కాదు! ఆ ప్రభుత్వం యొక్క విధి మాత్రమే!

పూర్తిచేస్తే నెత్తిన నీళ్లు చల్లుకునే అధికారం వారికే ఉంటుంది. కావలిస్తే, పనులు మొదలుపెట్టిన పార్టీ నాయకులు కూడా ఇంకోరోజు వెళ్లి అవే నీళ్లు తమ నెత్తిన కూడా చల్లుకుని.. ఫోటోలు దిగి సోషల్ మీడియాలోనూ, సొంత కరపత్రికల మీడియాలోనూ ప్రచారం చేసుకోవచ్చు.

ఈ కోణంలోంచి చూసినప్పుడు ప్రస్తుత భారత రాష్ట్ర సమితి నాయకులు మాట్లాడుతున్న మాటలు చాలా చిల్లరగా అనిపిస్తాయి. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును ప్రారంభించి ఆ నీళ్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నెత్తిన చల్లుకున్నందుకు గులాబీ దళ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. తాము నిర్మించిన ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలు ప్రారంభించి ప్రచారం చేసుకుంటున్నారని అంటున్నారు. ఈ మాటల ద్వారా గులాబీ నాయకుల మనసులోని ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదు.

బారాస మొదలుపెట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయకుండా చరిత్రలో మళ్ళీ ఎప్పుడో ఒకసారి బారాస తిరిగి అధికారంలోకి వచ్చేవరకు వాటిని అలాగే వదిలి పెట్టాలని కోరుకుంటున్నారా? వాటి మానాన వాటిని వదిలేసి ఆ సర్కారు మళ్లీ ఏర్పడిన తర్వాత పనులు చేసుకుంటారులే అనుకోవాలా? లేదా, కొత్త ప్రభుత్వం పనులను పూర్తి చేస్తే కనుక కెసిఆర్ లేదా కేటీఆర్ లను పిలిపించి వారిని ప్రారంభించాల్సిందిగా కోరాలా? వారి మనోగతం ఏమిటో బోధపడటం లేదు.

నెత్తిన నీళ్లు చల్లుకోవడం అనే విమర్శలకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భావోద్వేగంతో స్పందించారు. తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు కూడా ప్రచారం కోసం పాకులాడలేదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పని చేశాను అని కూడా అన్నారు.

నిజానికి సీతారామ ప్రాజెక్టు పూర్తి కావడం అనేది ప్రస్తుతం చాలా స్వల్ప భాగం మాత్రమేనని దానికి సంబంధించి కాలువల పనులన్నీ సుమారు పదివేల కోట్ల విలువైనవి పూర్తి అయితే తప్ప అనుకున్నట్టుగా రైతులకు సాగునీరు అందించడం సాధ్యం కాదనే వాస్తవాన్ని కూడా తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు.

తాము మొదలుపెట్టిన ప్రాజెక్టు అంటూ భారాస క్లెయిం చేసుకోవడం వారి ఆరాటాన్ని సూచిస్తుంది. అంతగా చిత్తశుద్ధి ఉంటే వారే పూర్తి చేసి తమ చేతుల మీదుగానే ప్రారంభించి తమ నెత్తినే నీళ్లు చల్లుకొని ఉండవచ్చు కదా అని కూడా ప్రజలు అంటున్నారు.

4 Replies to “సరికొత్త గొడవ: ‘నెత్తిన నీళ్లు’”

  1. మేట్రొ రైలు కంప్లీట్ చేసింది కాంగ్రెసు మరి మీ అకౌంట్లో వేసుకోలేదా?

Comments are closed.