ఆ మాజీ మంత్రిని అరెస్ట్ చేయొద్ద‌న్న హైకోర్టు!

మాజీ మంత్రి హ‌రీశ్‌రావుకు తెలంగాణ హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. విచార‌ణ వ‌ర‌కూ ఓకే చెప్పింది.

మాజీ మంత్రి హ‌రీశ్‌రావుకు తెలంగాణ హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. విచార‌ణ వ‌ర‌కూ ఓకే చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ మాజీ మంత్రి హ‌రీశ్‌రావుపై సిద్ధిపేట కాంగ్రెస్ ఇన్‌చార్జ్ చ‌క్ర‌ధ‌ర్‌గౌడ్ ఫిర్యాదు మేర‌కు పంజాగుట్ట పోలీసులు ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు. ఈ నేప‌థ్యంలో త‌న‌పై న‌మోదైన కేసును క్వాష్ చేయాలంటూ హ‌రీశ్‌రావు హైకోర్టును ఆశ్ర‌యించారు.

ఇవాళ హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా కీల‌క ఆదేశాలు ఇచ్చింది. అరెస్ట్ చేయొద్ద‌ని, విచారించుకోవ‌చ్చ‌ని పంజాగుట్ట పోలీసుల‌కు స్వేచ్ఛ‌నిచ్చింది. ద‌ర్యాప్తున‌కు స‌హ‌క‌రించాల‌ని హ‌రీశ్‌కు న్యాయ స్థానం సూచించింది. అలాగే చ‌క్ర‌ధ‌ర్‌గౌడ్‌కు కోర్టు నోటీసులు ఇచ్చి, విచార‌ణ‌ను వాయిదా వేసింది.

బీఆర్ఎస్‌లో హ‌రీశ్‌రావు కీల‌క నాయ‌కుడు. ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుడిగా బ‌ల‌మైన వాయిస్‌ను హ‌రీశ్ వినిపిస్తార‌నే పేరు వుంది. ఈ నేప‌థ్యంలో హ‌రీశ్‌పై గ‌తంలో కూడా చ‌క్ర‌ధ‌ర్‌గౌడ్ త‌న ఫోన్ ట్యాప్ చేయించాడంటూ ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ప‌ట్టించుకోలేదంటూ ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించారు. తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హరీశ్‌రావును ప్రతివాదులుగా చేర్చుతూ ఈ ఏడాది జూలై 16న రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత నవంబర్‌ 22న చక్రధర్‌ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. మళ్లీ ఇదే అంశంపై పంజాగుట్ట పోలీసులకు చక్రధర్ ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం.

రాజ‌కీయ క‌క్ష‌, దురుద్దేశంతోనే త‌న‌పై కేసు న‌మోదు చేశారంటూ హైకోర్టులో వేసిన పిటిష‌న్‌లో హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. త‌ప్పుడు కేసు అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే కేసు కొట్టి వేయాల‌న్న విజ్ఞ‌ప్తిని కోర్టు అంగీక‌రించ‌కుండా, అరెస్ట్ నుంచి మిన‌హాయింపు ఇచ్చింది. ఈ మేర‌కు హ‌రీశ్‌రావుకు హైకోర్టులో ఊర‌ట ద‌క్కిన‌ట్టే.

2 Replies to “ఆ మాజీ మంత్రిని అరెస్ట్ చేయొద్ద‌న్న హైకోర్టు!”

Comments are closed.