హైదరాబాద్ లో దారుణం.. గర్భిణిపై రాళ్లదాడి

గర్భంతో ఉందని కూడా చూడకుండా నడిరోడ్డుపై భార్యపై దాడిచేశాడు.

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. భార్య గర్భంతో ఉందని కూడా చూడకుండా అమెపై విచక్షణారహితంగా దాడిచేశాడు ఆ భర్త. దీంతో ఆమె కోమాలోకి వెళ్లింది, ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ట్విస్ట్ ఏంటంటే, వీళ్లది ప్రేమ వివాహం.

హైదరాబాద్ లో ఇంటీరియర్ పనులు చేసుకునే బస్రత్, రెండేళ్ల కిందట అజ్మీర్ దర్గాకు వెళ్లాడు. ఆ టైమ్ లో బస్సులో పశ్చిమ బెంగాల్ కు చెందిన పర్వీన్ ను కలిశాడు. ఇద్దరికీ బస్సులో పరిచయమైంది, ఆ తర్వాత పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొన్ని నెలలు ప్రేమించుకున్నారు. ఓరోజు బస్రత్ నేరుగా పశ్చిమ బెంగాల్ వెళ్లి పర్వీన్ ను పెళ్లి చేసుకొని, హైదరాబాద్ తీసుకొచ్చేశాడు.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కొన్నాళ్ల తర్వాత కుటుంబ కలహాలు మొదలయ్యాయి. బస్రత్ తో వేరుకాపురం పెట్టించింది పర్వీన్. తన తల్లిదండ్రులు ఉన్న ఇంటికి కాస్త దూరంలో మరో ఇల్లు తీసుకున్నాడు. అయినప్పటికీ గొడవలు ఆగలేదు. ఇటీవల పర్వీన్ గర్భం దాల్చింది.

ఆమెకు కాస్త నలతగా ఉందని, గచ్చిబౌలికి దగ్గర్లో ఉన్న కొండాపూర్ లోని ఓ హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. అక్కడామె 2 రోజులు చికిత్స కూడా తీసుకుంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇద్దరూ బయటకొచ్చారు. వస్తూనే గొడవ పడ్డారు. దీంతో బస్రత్ ఆవేశం కట్టలుతెంచుకుంది.

గర్భంతో ఉందని కూడా చూడకుండా నడిరోడ్డుపై భార్యపై దాడిచేశాడు. రోడ్డుపై ఉన్న సిమెంట్ రాయితో ఆమె ముఖంపై కొట్టాడు. ఇలా ఒకసారి, రెండుసార్లు కాదు.. దాదాపు 10 సార్లు సిమెంట్ రాయితో పర్వీన్ తల పగలగొట్టాడు. ఆమె చనిపోయిందని భావించి అక్కడ్నుంచి పరారయ్యాడు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, పర్వీన్ ను హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. బస్రత్ ను గంటల వ్యవథిలోనే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

4 Replies to “హైదరాబాద్ లో దారుణం.. గర్భిణిపై రాళ్లదాడి”

Comments are closed.