పార్టీ నాయకుల మీద తరచుగా నోరు పారేసుకునే, వివాదాస్పదంగా మాట్లాడే ఆ బీజేపీ ఎమ్మెల్యే మరోసారి సస్పెండ్ అవుతాడని తెలుస్తోంది. ఇంతకూ ఎవరా వివాదాస్పద ఎమ్మెల్యే అంటారా? ఆయనే హైదరాబాద్ సిటీలోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఆయన ఇటీవలే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నోరుపారేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తన గత నిర్ణయాన్ని మార్చుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. వాస్తవానికి ఆ పార్టీకి తగినంత బలం లేదు. అయినప్పటికీ డాక్టర్ గౌతమ్‌రావు అనే అతన్ని పోటీ చేయిస్తోంది.
ఆయన్ని నిలబెట్టడంతో రాజాసింగ్ రెచ్చిపోయాడు. మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి గులాంగిరీ చేసేవాళ్లకు పోస్టులు టిక్కెట్లు కట్టబెడతారా? అంటూ ఘాటుగా ప్రశ్నించాడు. గౌతమ్ రావు కిషన్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గానికి చెందినవాడు. దీంతో కిషన్ రెడ్డిపై విరుచుకుపడ్డాడు. ప్రతి సందర్భంలోనూ పార్టీ నాయకులను విమర్శిస్తూనే ఉంటాడు. విరుచుకుపడుతూనే ఉంటాడు. పార్టీలో తనకు వేధింపులు ఎక్కువయ్యాయని అన్నాడు. పార్టీ నుంచి వెళ్లిపొమ్మంటే పోతానని చెప్పాడు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని రాష్ట్ర కమిటీ నియమిస్తే ఆయన రబ్బరు స్టాంపుగా మిగిలిపోతాడని చెప్పాడు. కొందరు బీజేపీ నేతలు అధికారంలో ఎవరుంటే వారితో అంటకాగుతున్నారని అన్నాడు. గతంలో తనపై పీడీ యాక్టు పెట్టారని, అప్పుడు తన పార్టీ నాయకులే అందుకు కారణమని అన్నాడు. ఇలా చాలాసార్లు పార్టీపై విమర్శలు చేశాడు రాజాసింగ్. నోటి దురుసు కారణంగానే, వివాదాస్పద వ్యాఖ్యల వల్లనే రాజాసింగ్ గతంలో ఒకసారి పార్టీ నుంచి సస్పెండయ్యాడు. ఆ సస్పెన్షన్ చాలకాలం కొనసాగింది. సస్పెన్షన్ తొలగించాలని రాజాసింగ్ చాలా బతిమాలుకున్నాడు.
చివరకు జాతీయ నాయకత్వం ఆయన నుంచి వివరణ తీసుకొని దయతలచి సస్పెన్షన్ ఎత్తేసింది. అయినా రాజాసింగ్లో మార్పు రాలేదు. ఈసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద ఘాటు విమర్శలు చేశాడు కాబట్టి నాయకత్వం చాలా సీరియస్‌గానే తీసుకునే అవకాశం ఉంది. రాజా సింగ్‌పై చర్యలు తీసుకోకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయని కొందరు అంటున్నారు. అందుకే ఆయన సస్పెన్షన్‌కు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాజా సింగ్‌ను సస్పెండ్ చేయాలని అనుకోవడం ఇది రెండోసారి కాబట్టి కఠినంగానే వ్యవహరించవచ్చు. ఇదిలా ఉంటే, మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం రాజా సింగ్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. రాజాసింగ్ చాలా మంచోడని, ఆయనకు ఎవరూ సాటిలేరని అన్నాడు. ఆయన హిందూ ధర్మానికి ఆదర్శమని, సర్వం హిందూ ధర్మం కావాలన్నదే ఆయన లక్ష్యమని బండి సంజయ్ అన్నాడు. రాజాసింగ్ నోటిదురుసు, కిషన్ రెడ్డిపై విమర్శలు బండికి తెలుసు. తెలిసి కూడా రాజా సింగ్‌ను ఎందుకు ఆకాశానికి ఎత్తేశాడనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది.
జాయిన్ అవ్వాలి అంటే