కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 2020లో సినిమా ప్రముఖులను సమావేశపరిచి హైదరాబాదులో బ్రహ్మాండమైన ఫిలిం సిటీ దాదాపు రెండువేల ఎకరాల్లో నిర్మిస్తానని చెప్పాడు. దాంట్లో అంతర్జాతీయ ప్రమాణాలతో సమస్త సౌకర్యాలు కల్పిస్తానని చెప్పాడు.
సినిమా ప్రముఖులు చాలా సంతోషించారు. కానీ కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం ఆయన చెప్పింది నెరవేరలేదు. ఈ మధ్య అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో కొందరు సినిమా ప్రముఖులు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సమావేశమైనప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పాడు.
బాలీవుడ్, హాలీవుడ్ కూడా హైదరాబాదులో షూటింగులు జరుపుకోవాలన్నాడు. అలా షూటింగులు జరుపుకోవాలంటే ఇప్పుడున్న స్టూడియోలు, సౌకర్యాలు, వ్యవస్థ చాలవు. గతంలో కేసీఆర్ చెప్పాడనో, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడనో తెలియదుగానీ హైదరాబాదులో సినిమా సిటీ ఏర్పాటు చేస్తామని, అందుకు 1500 నుంచి 2000 ఎకరాలు కేటాయించాలని ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
ఈ భూముల్లో అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోల నిర్మాణం చేయడంతో పాటు సమస్త సౌకర్యాలు కల్పిస్తామని చెప్పింది. గతంలో కేసీఆర్ తాము నిర్మించే ఫిలిం సిటీలో విమానాలు వచ్చే ఏర్పాటు కూడా చేస్తామన్నారు. కారణాలు ఏమైనాగానీ కేసీఆర్ చెప్పింది సాకారం కాలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫిలిం చాంబర్ కు సహకారం అందించి, అడిగిన భూమి కేటాయిస్తుందా?
🤣🤣