ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడయ్యాడు

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుతకుత ఉడికిపోతున్నాడు. ఆయనలో అసహనం పెరిగిపోతోంది

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుతకుత ఉడికిపోతున్నాడు. ఆయనలో అసహనం పెరిగిపోతోంది. మంత్రి అయ్యే చాన్స్ మిస్సయిపోయిందని బాధపడిపోతున్నాడు. అలా మిస్సయిపోవడానికి కారణం ఎవరని అనుకుంటున్నాడు? తెలంగాణ కేబినెట్ విస్తరణ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కారణం…అన్ని సామాజికవర్గాల వారు మాకు మంత్రి పదవులు కావాలంటే మాకు మంత్రి పదవులు కావాలని డిమాండ్ చేయడమే.

రెడ్డి సామాజికవర్గం వారు ఎక్కువమంది మంత్రి పదవులు అడిగారు. మాదిగ, లంబాడా సామాజికవర్గాలవారు పోటీ పడ్డారు. ఒక కులానికి ఇస్తే కులం వారికి కోపం వస్తోంది. ఈ క్రమంలో కొన్ని వర్గాలవారు కాంగ్రెసు పార్టీకే దూరమయ్యే ప్రమాదం ఉంది. కేబినెట్ విస్తరణలో సామాజిక సమతుల్యత సాధించలేని అధిష్టానం చివరకు విస్తరణనే నిరవధికంగా వాయిదా వేసింది. ఇదిలా ఉంటే, కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నాడు కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

ఆయన మధ్యలో బీజేపీలోకి వెళ్లి ఎన్నికల ముందు కాంగ్రెసులో చేరి మునుగోడు నుంచి గెలిచాడు. ఆయనకు మంత్రి పదవి ఇస్తామని రేవంత్‌రెడ్డి, అధిష్టానం పెద్దలు హామీ ఇచ్చారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెసు అభ్యర్థిని గెలిపిస్తే అందుకు ప్రతిఫలంగా మంత్రి పదవి ఇస్తామన్నారు. సరే…అక్కడ కాంగ్రెసు అభ్యర్థి గెలిచాడు. గెలవగానే మంత్రి పదవి వస్తుందని రాజగోపాల్రెడ్డి కలలు కన్నాడు. ఉగాది తరువాత కేబినెట్ విస్తరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే కదా. భర్తీ చేయాల్సినవి ఆరు పదవులైతే నాలుగు పదవులు నింపాలని అనుకున్నారు.

ఆ నాలుగు పదవులకే చాలామంది పోటీ పడ్డారు. అప్పుడు తయారుచేసిన లిస్టులో రాజగోపాల్ రెడ్డి పేరు కూడా ఉంది. ఆయన చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. తనకు హోంమంత్రి కావాలనే కోరిక ఉందని కూడా బహిరంగంగానే చెప్పాడు. కాని మధ్యలో సీనియర్ నేత జానారెడ్డి జోక్యం చేసుకొని రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి మంత్రి వర్గంలో ప్రాధాన్యం లేకుండా పోయిందని హైకమాండ్‌కు లేఖ రాశాడు. అంతే…కేబినెట్ విస్తరణ ఆగిపోయింది. జానారెడ్ది కారణంగానే కేబినెట్ విస్తరణ ఆగిపోయిందని ప్రచారం కూడా జరిగింది.

కేబినెట్ విస్తరణ అంశంపై ఉన్నట్టుండి జానారెడ్డి హైకమాండ్‌కు లేఖ రాయడం కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల వారికి అవకాశం ఇస్తే.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి ఛాన్స్ ఉంటుందని.. అదే జరిగితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉండకపోవచ్చనే టాక్ వచ్చింది. జానారెడ్డి లేఖ కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదని రాజగోపాల్ రెడ్డి మనసులో బాగా పడిపోయింది.

దీంతో తాజాగా ఆయన జానారెడ్డి మీద ఫైర్ అయ్యాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మంత్రి పదవి విషయంలో ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్రను పోషిస్తున్నాడు’ అని మండిపడ్డాడు. తనకు మంత్రి పదవి ఖాయమైనా.. కావాలనే జానా పదేపదే అడ్డుపడుతున్నాడని ఆగ్రహించాడు. 25 ఏళ్లు మంత్రి పదవిలో ఉన్నది సరిపోదా అని ప్రశ్నించాడు. అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటని ప్రశ్నించాడు. రాజగోపాల్ రెడ్డి అన్నయ్య వెంకటరెడ్డి ఆల్రెడీ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే కదా.

One Reply to “ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడయ్యాడు”

Comments are closed.