అప్పటి హామీలు.. ఇప్పుడు గుదిబండలు!

గత ఎన్నికల్లో ఎలాగైనా అధికారానికి రావాలనే ఉద్దేశంతో అప్పట్లో రేవంత్​ రెడ్డి, అధిష్టానం పలువురు నాయకులకు పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవులు ఇస్తామని హామీలు ఇచ్చారు.

తెలంగాణ కేబినెట్​ విస్తరణ ఉగాదికి జరుగుతుందని, ఎవరెవరికి పదవులు ఇవ్వాలో లిస్టు కూడా రెడీ అయిందని వార్తలు వచ్చినా అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందని నమ్మకం లేదు. భర్తీ చేయాలనుకున్న నాలుగు పదవుల కోసమే వివిధ సామాజిక వర్గాలవారు డిమాండ్​ చేస్తున్నారు. మంత్రి పదవులు ఇవ్వాలనుకున్నవారి పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

అధిష్టానానికి ఫిర్యాదులు, విజ్ఞప్తులు వెళుతున్నాయి. కొన్ని వర్గాలవారు నేరుగా ఢిల్లీ వెళ్లి పెద్దలను కలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎలాగైనా అధికారానికి రావాలనే ఉద్దేశంతో అప్పట్లో రేవంత్​ రెడ్డి, అధిష్టానం పలువురు నాయకులకు పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవులు ఇస్తామని హామీలు ఇచ్చారు. కొన్ని సామాజికవర్గాలకు హామీలు ఇచ్చారు.

రేవంత్​ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనతో విభేదించి, విమర్శించి, అధిష్టానాన్ని తూలనాడి పార్టీ నుంచి వెళ్లిపోయిన కొందరు నాయకులు కాంగ్రెసు అధికారంలోకి వచ్చే అవకాశం ఉండటంతో ఎన్నికలకు ముందు పార్టీలో చేరారు. ఎన్నికల్లో గెలిచారు. ఇలాంటివారికి కూడా మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చినా వారికి మంత్రి పదవులు ఇవ్వలేదు.

ఇప్పుడు విస్తరణ సందర్భంగా వారి పేర్లు పరిగణనలోకి తీసుకున్నారు. కాని వారి పట్ల నిరసన వ్యక్తమవుతోంది. మంత్రి పదవులు దక్కుతాయని భావిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి, గడ్డం వివేక్​ ఇద్దరూ కాంగ్రెసు పార్టీని వీడి బయటకు వెళ్లినవారే. గత ఎన్నికల ముందు కాంగ్రెసు పార్టీలో చేరారు. వీరిద్దరికీ ఎన్నికల ముందు మంత్రి పదవులు ఇస్తామని రేవంత్​ రెడ్డి హామీ ఇచ్చారు.

ఆ హామీ ప్రకారం తమకు మంత్రి పదవులు ఇవ్వాలని అడుగుతున్నారు. కాని వీరికి పదవులు ఇవ్వడంపట్ల నిరసన వ్యక్తమవుతోంది. ముదిరాజ్​ సామాజికవర్గం నుంచి వాకిటి శ్రీహరి ఒక్కరే గెలిచారు. ఆయనకు పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్​ జిల్లా నుంచి సుదర్శన్​ రెడ్డికి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన ఆశ పెట్టుకొని ఉన్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికే అవకాశం ఉంది.

మరోపక్క ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆయన ఆల్రెడీ మంత్రి పదవి ఇవ్వకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బెదిరించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. లంబాడా సామాజికవర్గానికి కూడా మంత్రి వర్గంలో చోటు దక్కలేదు.

ఆ సామాజిక వర్గానికి చెందిన బూలూ నాయక్​ పదవి ఆశిస్తున్నారు. కేసీఆర్​ హయాంలో ఈ సామాజికవర్గానికి కేబినెట్​లో చోటు కల్పించారు. ఇంకా మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. భర్తీ చేయాల్సిన నాలుగు మంత్రి పదవులను ఎస్సీ, బీసీ, రెడ్డి, మైనారిటీ సామాజికవర్గాలతో భర్తీ చేయాలి.  కాని పదవులు ఆశిస్తున్నవారు ఎక్కవగా ఉన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే రేవంత్​ రెడ్డికి ఇప్పుడు గుదిబండలుగా మారాయని అనిపిస్తోంది.