ఎవరో కొద్దిమంది తప్ప చాలామంది రాజకీయ నాయకులకు నోరు ఎక్కువే. నోరు పారేసుకుంటేనే రాజకీయాల్లో మనుగడ సాగించగలుగుతారేమో. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమే ఈనాటి రాజకీయ నాయకులకు తెలిసిన విద్య. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పటినుంచి నోరు పారేసుకుంటూనే ఉన్నారు. ఉద్యమంలో అది అనివార్యం కావొచ్చు.
కానీ, తెలంగాణ ముఖ్యమంత్రిగా పదేళ్లు పనిచేసిన సమయంలో కూడా కేసీఆర్ తన నోటిని అదుపులో పెట్టుకోలేదు. నోటిని అదుపులో పెట్టుకోకపోవడం, ఉన్నత పదవుల్లో ఉన్నవారిని అవమానించడం, అగౌరవపరచడం ఈయన బలమో, బలహీనతో తెలియదు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను అవమానించారు.
ప్రధాని మోదీని అవమానించడమే కాకుండా దుర్భాషలాడేవారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవారు. ఆయన ఏవైనా అధికారిక కార్యక్రమాల కోసం రాష్ట్రానికి వస్తే స్వయంగా వెళ్లి ఆహ్వానించేవారు కాదు. ఓ మంత్రిని పంపేవారు. కేసీఆర్ నోటి దురుసుకు, ఆయన అవమానించిన తీరుకు అనేక ఉదాహరణలు ఇవ్వొచ్చు. కేసీఆర్ తరువాత సీఎం అయిన రేవంత్ రెడ్డి వ్యవహారశైలి కూడా అలాగే ఉంది.
ఆయన కూడా కేసీఆర్‌పట్ల, ప్రధాని మోదీ పట్ల రెచ్చిపోతున్నారు. తన నోటి దురుసును నిరూపించుకుంటున్నారు. ఏదైనా అంటే ఇలా మాట్లాడటం కేసీఆరే నేర్పించారని అంటారు. అసలు తెలంగాణలో తిట్లు మొదలుపెట్టిందే కేసీఆర్ అని చెబుతారు. ప్రభుత్వం నిర్వహించిన కుల గణనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు పాల్గొనలేదు కాబట్టి వారి ముగ్గురిని సామాజిక బహిష్కరణ చేయాలని బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.
వారి ఇళ్ల ముందు మేలుకొలుపు డప్పు కొట్టాలన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ సమాజంలో జీవించే హక్కులేదన్నారు. ఇక ప్రధాని పైనా ఘాటు విమర్శలు చేశారు. మోదీ పుట్టుకతో ఓసీ అయినప్పటికీ ఆయన బీసీగా మారారని అన్నారు. ఎవరైనా మతం మార్చుకుంటారుగాని కులం మార్చుకుంటారా? ఇది సాధ్యమా? మోదీ గుజరాత్ సీఎం అయ్యాక తన కులాన్ని బీసీల్లో చేర్చుకున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన నిజమైన బీసీ అయితే కులగణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
అంటే ఆయన కులగణన చేయలేదు కాబట్టి మోదీ నిజమైన బీసీ కాదని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నాడన్నమాట. ఆయనది ఓసీ మనస్తత్వం అని కూడా చెప్పాడు. ఇక కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు కులగణనలో పాల్గొనలేదు. ప్రభుత్వం నిర్వహించే ఏ కార్యక్రమాల్లోనూ వారు మొదటి నుంచి పాల్గొనడంలేదు.
అంతమాత్రంచేత వారిని సామాజిక బహిష్కరణ చేయాలా? నిజానికి కులగణన సర్వేలో చాలామంది పాల్గొనలేదు. అయినప్పటికీ ప్రభుత్వం బీసీ జనాభా లెక్క తేల్చింది కదా. దాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటోంది కదా. కేసీఆర్ కుటుంబ సభ్యులు కులగణన సర్వేను లెక్కచేయలేదని, అవమానించారని రేవంత్ రెడ్డికి కోపంగా ఉంది. అందుకే సామాజిక బహిష్కరణ చేయాలనే పెద్ద పదం వాడాడు. మొత్తం మీద కేసీఆర్ రేవంత్ మీద విరుచుకుపడితే, రేవంత్ ఆయన మీద విరుచుకుపడతాడు.
ప్లే బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,