ఇంకా న‌యం.. నాలుగేళ్ల స‌మ‌యం అడ‌గ‌లేదు

ఇంకా న‌యం, అదృష్ట‌వ‌శాత్తు నాలుగు సంవ‌త్స‌రాల స‌మ‌యాన్ని అడ‌గ‌లేద‌ని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం వ్యంగ్యంగా పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణ‌లో పార్టీ ఫిరాయింపుల ప‌ర్వంపై న్యాయ విచార‌ణ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. బీఆర్ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే. వాళ్ల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని స్పీక‌ర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. కానీ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. దీంతో బీఆర్ఎస్ న్యాయ పోరాటం మొద‌లు పెట్టింది. ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త బంతి వుంది.

బీఆర్ఎస్ త‌ర‌పున వేర్వేరు అన‌ర్హ‌త పిటిష‌న్లు దాఖ‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ పిటిష‌న్ల‌పై జ‌స్టిస్ గ‌వాయ్‌, జ‌స్టిస్ ఆగ‌స్టీన్ జార్జ్ మ‌సీహ్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ‌లో భాగంగా కీల‌క కామెంట్స్ చేసింది. ఆయారాం, గ‌యారాంల‌ను నిరోధించేందుకే రాజ్యాంగంలో ప‌దో షెడ్యూల్ ఉంద‌ని ధ‌ర్మాస‌నం కామెంట్ చేసింది. ఫిరాయింపుల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోతే, ప‌దో షెడ్యూల్‌ను అప‌హాస్యం చేసిన‌ట్టే అని వ్యాఖ్యానించింది.

వివ‌ర‌ణ ఇచ్చేందుకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీక‌ర్‌ను నాలుగు వారాలు గ‌డువు కోరార‌ని ధ‌ర్మాస‌నం దృష్టికి వెళ్లింది. ఇంకా న‌యం, అదృష్ట‌వ‌శాత్తు నాలుగు సంవ‌త్స‌రాల స‌మ‌యాన్ని అడ‌గ‌లేద‌ని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం వ్యంగ్యంగా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అస‌లు ఫిరాయింపుల‌పై నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఆదేశించే అధికారం సుప్రీంకోర్టుకు వుంటుందా? లేక రాజ్యాంగ ధ‌ర్మాస‌నానికి నివేదించాలా? అని స్పీక‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది ముకుల్ రోహిత్గీ అని ప్ర‌శ్నించారు.

తాము స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసి ఏడాదైనా చ‌ర్య‌లు తీసుకోలేద‌ని బీఆర్ఎస్ త‌ర‌పు న్యాయ‌వాది ధ‌ర్మాస‌నం దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ ఫిరాయింపుల‌కు వార్షికోత్స‌వం అయ్యిందా? అని ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. ఏప్రిల్ 2వ తేదీకి విచార‌ణ వాయిదా ప‌డింది.

2 Replies to “ఇంకా న‌యం.. నాలుగేళ్ల స‌మ‌యం అడ‌గ‌లేదు”

Comments are closed.