తెలంగాణ అసెంబ్లీ శుక్రవారం రణరంగంగా మారిన పరిస్థితి తెలిసిందే కదా. ఇందుకు కారణం ఫార్ములా-ఈ రేసుపై చర్చ జరగాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టడం. దీంతో పరిస్థితి అదుపు తప్పి గందరగోళం ఏర్పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే అసెంబ్లీ యుద్ధరంగమైంది.
ఈ సమయంలో అధికార, విపక్ష సభ్యులు ఒకరిపై మరొకరు వాటర్ బాటిల్స్ విసిరుకున్నారు. పేపర్లు చింపి విసిరేసుకున్నారు. స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లారు. అరుపులు, కేకలతో సభ దద్దరిల్లింది. ఈ గందరగోళంలో హరీష్ పాత్ర ఏమిటంటే… పేపర్లు చింపి విసిరేసిన వారిలో ఆయన కూడా ఉన్నాడు.
స్పీకర్‌ను పరుష పదజాలంతో దూషించాడని అంటున్నారు. “దళిత స్పీకర్‌ను దూషిస్తాడా?” అంటూ కాంగ్రెస్ నాయకులు మండిపోతున్నారు. ఈ కారణాలతో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గతంలో పేపర్లు చింపి విసిరేసి, స్పీకర్‌ను దూషించిన సంపత్ కుమార్‌ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని చెబుతున్నారు. మరి ఇప్పుడు హరీష్ రావును సస్పెండ్ చేస్తారా? సభ్యత్వం రద్దు చేస్తారా?
స్పీకర్ శాసన సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని టాక్. రోజుకో మలుపు తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు ఈ విషయంలో ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.