తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల గారడీ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మాటలతో మాయ చేయగలరు. కేసీఆర్ ప్రసంగాలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈసారి ఆ మాటలు పనిచేస్తాయా అనేది అందరి డౌట్.
జీహెచ్ఎంసీ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. ఓవైపు మంచిగా మాటలు చెబుతూనే, మరోవైపు వరుసగా తాయిలాలు ప్రకటిస్తున్నారు కేసీఆర్.
ఆర్టీసీ ఉద్యోగులకు అడగకుండానే లాక్ డౌన్ బకాయిలు రూ.120 కోట్లు విడుదల చేశారు. తాను బతికున్నంత వరకు ఆర్టీసీని బతికించుకుంటాననే ఓ భారీ డైలాగ్ కూడా కొట్టారు.
నిన్నటికి నిన్న పారిశుధ్య కార్మికులకు ఒక్కొకరికి 3వేల రూపాయల జీతం పెంచారు. ఆస్తి పన్ను సగానికి సగం తెగ్గోసి.. మధ్యతరగతి ప్రజలకు పండగ కానుక అందించారు. వరదసాయం అదనంగా మరో 100కోట్లు ఇస్తామన్నారు.
ఓవైపు కేసీఆర్ పార్కులు ప్రారంభిస్తుంటే, కొడుకు కేటీఆర్ సర్కారు దవాఖానలు ఓపెనింగ్ చేస్తూ ప్రజల్లో కలియదిరుగుతున్నారు. వారం రోజులుగా హైదరాబాద్ లో జరిగినన్ని ఓపెనింగ్ లు.. కొత్త తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే లేవంటే అతిశయోక్తి కాదు.
ఇవన్నీ చూస్తుంటే రోజు రోజుకీ తెలంగాణ ప్రజలు, ఉద్యోగులంటే కేసీఆర్ కి ఎక్కడలేని ప్రేమ పుట్టుకొస్తోందనడంలో సందేహం లేదు. ఇదంతా కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం అనేది సగటు తెలంగాణ వాసికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మరి ఈసారి కేసీఆర్ వరాలు, మాటలు పనిచేస్తాయా? గ్రేటర్ వాసి మరోసారి కేసీఆర్ కు జై కొడతాడా? అసలు కేసీఆర్-కేటీఆర్ ద్వయం ఈసారి ఇంత ఆందోళన చెందడానికి కారణం ఏంటి? దీనంతటికీ కారణం దుబ్బాక ఫలితం.
దుబ్బాక భయంతోనే ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్తున్నారు కేసీఆర్. అందుకే ఎప్పుడూ లేనంతగా ఈ దఫా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
గ్రేటర్ ఎన్నికల విషయంలో అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విమర్శల కంటే ఎక్కువగా తాయిలాలు, సెంటిమెంట్-ఓదార్పు మాటలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మరి ఈసారి కేసీఆర్ మాటలు ఫలిస్తాయా? వెయిట్ అండ్ సీ.