ఎమ్బీయస్‌ : గోడ్సేని ఎలా చూడాలి? – 7

గమనిక – గోడ్సే 6 లో బ్రాకెట్లలో రాసినది నా వ్యాఖ్యలు. ఇటాలిక్స్‌లో వుండాల్సింది. ఇకపై చివర్లో '-వ్యా. (వ్యాసకర్త)' అని పెడతాను. Advertisement గోడ్సే వాదన – 1919 సంవత్సరపు చట్టం ప్రకారం…

గమనిక – గోడ్సే 6 లో బ్రాకెట్లలో రాసినది నా వ్యాఖ్యలు. ఇటాలిక్స్‌లో వుండాల్సింది. ఇకపై చివర్లో '-వ్యా. (వ్యాసకర్త)' అని పెడతాను.

గోడ్సే వాదన – 1919 సంవత్సరపు చట్టం ప్రకారం మతపరమైన ప్రాతినిథ్యం పేర రాష్ట్ర శాసనసభల్లో, స్థానిక సంస్థల్లో విస్తరించబడింది. సమర్థత మీద ఆధారపడి కాకుండా స్వరాజ్యపోరాటానికి దూరంగా వున్నారన్న కారణంగా ముస్లింలకు కీలకమైన ఉన్నతపదవులు రాసాగాయి. మైనారిటీలకు రక్షణ అనే పేరుతో ముస్లింలను ప్రభుత్వం ఆదరించసాగింది. ఈ విధంగా బ్రిటిషువారు ముస్లింలను బుజ్జగించి తమవైపు మార్చుకుంటూ వుంటే గాంధీ మాత్రం తను హిందూ-ముస్లింలకు యిద్దరికీ నాయకుడనే భ్రమలో జీవిస్తూ తాను ఓడిపోయే కొద్దీ మరింత విపరీతమైన పద్ధతుల్లో ముస్లింలను ప్రోత్సహించసాగాడు. ముస్లిం లీగు బలపడిన కొద్దీ జాతీయ పోరాటంలో దాని సహకారం పొందగలననే భ్రమతో వారి గొంతెమ్మ కోరికలను అంగీకరించసాగాడు. దురదృష్టవశాత్తూ గాంధీ రంగంపై వచ్చిన ఐదారేళ్లలో పాతనాయకత్వం మరణించడంతో గాంధీని అదుపు చేసేవారు లేకుండా పోయారు. 

(గోఖలే, టిళక్‌ వంటి నాయకులు మరణించడం చేతనే గాంధీ నాయకుడు కాగలిగాడు అనే గోడ్సే వాదన తప్పు. ఆ తర్వాత కూడా అనేకమంది బలమైన నాయకులు వచ్చారు. దక్షిణాదిన ప్రకాశం, రాజాజీ తూర్పున చిత్తరంజన్‌ దాస్‌, సుభాష్‌ చంద్ర బోస్‌, ఉత్తరాన మోతీలాల్‌ నెహ్రూ.. యిలా ఎందరో బలమైన వ్యక్తిత్వం గల, గాంధీ కంటె తెలివైన నాయకులు వచ్చినా వారందరూ గాంధీ మాట వినవలసి వచ్చింది. ఒక థలో గాంధీకి వ్యతిరేకంగా కాంగ్రెసు నుండి విడిపోయి పార్టీ పెట్టుకున్నా మళ్లీ కాంగ్రెసులోకి వచ్చి గాంధీకి జై కొట్టవలసి వచ్చింది. ఎందుకంటే గాంధీ సామాన్యప్రజలకు అర్థమయ్యే భాష మాట్లాడి, వారి హృదయాన్ని పట్టుకోగలిగాడు. సామాన్యుడికి స్వాతంత్య్ర పోరాటమంటే గాంధీయే! గాంధీ ఏం చెపితే అది వేదవాక్కు. గాంధీ తప్పు చేయడని వారి నమ్మకం. ఆయన నిరాహారదీక్ష చేపడితే దేశమంతా వణికేది. తూర్పు బెంగాల్‌లో మతకల్లోలాలు చెలరేగినపుడు ఆయన నిరాహారదీక్షతోనే కోట్లాది ప్రజలను శాంతి మార్గంవైపు మళ్లించాడు. అందుకే ఆయనను 'ఒన్‌ మ్యాన్‌ ఆర్మీ' అన్నారు. తక్కిన ఏ నాయకుడికీ యింత కరిజ్మా లేదు – వ్యా.)

1924లో గాంధీ అకారణంగా ఆర్యసమాజాన్ని తీవ్రంగా విమర్శించి తనకు ముస్లింలపై గల ప్రేమను బడాయిగా చాటుకున్నాడు. ఆర్యసమాజం కూడా గాంధీకి గట్టిగానే జవాబు చెప్పింది. కానీ గాంధీ పలుకుబడి రానురాను పెరిగి, ఆర్యసమాజం బలపడింది. స్వామీ దయానంద అనుయాయులెవ్వరూ గాంధీ కాంగ్రెసులో చేరడానికి వీలు లేకుండా పోయింది. గతంలో లాలా లజపతి రాయ్‌, స్వామి శ్రద్ధానంద్‌ ఆర్యసమాజీయులు, కాంగ్రెసు నాయకులుగా వుండేవారు. తర్వాతి కాలంలో యిలా రెండు సంస్థల్లో నాయకులుగా వుండేవారు లేకుండా పోయారు. గాంధీ ఆర్యసమాజంపై దాడి ముస్లిం యువకులను స్వామి శ్రద్ధానందను హత్య చేయడానికి రెచ్చగొట్టింది. ఆర్యసమాజం తిరోగమనవాద సంస్థ కాదు. హిందూ సమాజంలో సంస్కరణలకై ఆవిర్భవించి, గాంధీకి నూరు సంవత్సరాల ముందే అస్పృశ్యతా నిర్మూలన చేపట్టింది. కులవ్యవస్థను ఖండించి, హిందువులే కాదు, హిందూ సిద్ధాంతాలను పాటించదలచిన వారందరూ ఒక్కటే అని బోధించింది. విధవా పునర్వివాహానికి జనాదరణ కల్పించింది. గాంధీ అహింసావాదం సమాజంపై ఆర్యసమాజ ప్రభావాన్ని దెబ్బ తీసింది. ఆర్యసమాజ స్థాపకుడైన స్వామి దయానంద సరస్వతికి హింసాహింసల గురించి పిచ్చి భ్రమలు లేవు. నైతికంగా అవసరమైనపుడు బలప్రయోగం ఆచరించదగినదే అని ఆయన సిద్ధాంతం. అందుకే ఆర్యసమాజ నాయకులు కాంగ్రెసులో వుండడానికి యిబ్బంది పడ్డారు. గాంధీ అన్ని సమయాల్లో అహింస అని పట్టుబడితే ఆర్యసమాజ సిద్ధాంతాలకు విరుద్ధంగా నడుచుకున్నట్లు అవుతుంది. అందుకే ఆర్యసమాజం రాజకీయంగా ప్రభావితం చేయలేని స్థితికి వచ్చింది.

(గాంధీ అహింసావాద పటిమను గుర్తించకపోవడమే గోడ్సేలో లోపం. హింసకు పాల్పడి వుంటే స్వాతంత్య్రం ఎప్పుడో వచ్చేది అని గోడ్సేయే కాదు, యిప్పటికీ చాలామంది అనుకుంటారు. వలస రాజ్యాల్లో చెలరేగిన హింసాత్మక పోరాటాలను అప్పటి సామ్రాజ్యాలు ఎలా అణచివేశాయో గమనిస్తే తెలుస్తుంది. అంతెందుకు దాదాపుగా 50 ఏళ్లగా నక్సలైట్లు (యిప్పుడు మావోయిస్టులు అంటున్నారు) తుపాకులతో పోరాడుతున్నా యిప్పటివరకు ఒక్క రాష్ట్రాన్నయినా తమ అదుపులోకి తెచ్చుకోగలిగారా? ఫ్రెంచ్‌ వారికి వ్యతిరేకంగా హింసాత్మకంగా పోరాడిన వియత్నాంకు ఎన్నేళ్లకు విముక్తి లభించింది? వియత్నాంతో పోలిస్తే భారత్‌ ఎంత పెద్దది! ఇక్కడి జనంలో ఐక్యత సాధించడం ఎంత కష్టం? ఉద్యమాన్ని హింసాత్మకంగా నడిపి వుంటే గాంధీ ప్రత్యేకత ఏమి వుండేది? గాంధీ పేరు ప్రపంచమంతా తెలిసిందంటే, అనేకమంది అంతర్జాతీయ విప్లవయోధులు గాంధీని ప్రేరణగా తీసుకుని విజయాలు సాధించారంటే దానికి కారణం – గాంధీ చేపట్టిన వినూత్న విధానం. పోలీసులు లాఠీతో కొడుతూ వుంటే సత్యాగ్రహులు తిరగబడకుండా, ఒకరి తర్వాత మరొకరు నేలకూలే దృశ్యం చూసి ప్రపంచం నివ్వెరపోయింది. అప్పటిదాకా కనీవినీ ఎరుగని యీ నిరసనను ఎలా డీల్‌ చేయాలో బ్రిటిషువారికి అంతుపట్టలేదు. గాంధీపై సినిమా తీస్తే ప్రపంచమంతా ఆడింది. ఇప్పుడు గోడ్సేపై సినిమా వస్తోందంటున్నారు. ఎంతమంది చూస్తారో చూడాలి. 

ఒక దేశం మరొక దేశంపై దాడి చేస్తే దాన్ని హింసతోనే ఎదుర్కోవాలి. కానీ వలసదేశంలో ఆ సౌలభ్యం వుండదు. ఎందుకంటే  వలసరాజ్యంలో గజనీ మహమ్మద్‌లా దోచుకుని వెళ్లిపోరు. అక్కడే వుండి, స్థానిక పరిస్థితులు క్రమంగా మెరుగుపరుస్తూ, స్థానికులలో కొందర్ని ప్రోత్సహిస్తూ వారి చేతనే తక్కిన స్థానికులను అణిచివేస్తారు. బ్రిటిషు హయాంలో అనేకమంది అధికారులు భారతీయులే, పోలీసులు, సైనికులు భారతీయులే. వారి దృష్టిలోనే కాదు, అనేకమంది సామాన్యజనుల దృష్టిలో ఆంగ్లేయులు మన కెంతో మేలు చేశారు. ఈనాడు మెకాలే విద్యావిధానం అని హిందూత్వవాదులు తరచుగా యీసడిస్తూ వుంటారు. మెకాలేకు ముందున్న విద్యావిధానంలో సమగ్రత ఎక్కడుంది? ఎప్పుడో క్రీస్తుపూర్వం నలందా, తక్షశిల గురించి చెప్పడం కాదు. 1820 ప్రాంతంలో ఇండియాలో విద్యాలయాల పరిస్థితి ఏమిటి? అనేది తెలుసుకుని పోల్చి చెప్పాలి. అసలు విద్యపై మమకారం ఎవరికి వుంది? 90% జనాభా విద్యకు దూరంగా వుండేవారు. వీధిబడులు కాకుండా, గురువు గారింట్లో వుండి చదువుకోవడం కాకుండా అన్ని కులాల వారు పక్కపక్కన కూర్చుని ఒక విద్యాలయానికి వెళ్లి చదువుకోవడం వుందా? కొన్ని వర్ణాల వారు మాత్రమే – వారిలోనూ పురుషులు మాత్రమే – చదువుకునేవారు. వారికే ఉద్యోగాలు. బ్రిటిషు వారు వచ్చాకనే అన్ని కులాల వారికీ చదువుకుంటే అవకాశాలు వచ్చాయి. అందుకే ద్రవిడ ఉద్యమకారులు కానీ, జస్టిస్‌ పార్టీ వారు కానీ బ్రిటిషువారిని అభిమానించారు. వారే కాదు, రాజా రామమోహన రాయ్‌, వీరేశలింగం వంటి సంస్కర్తలకు కూడా దన్నుగా నిలిచినది ఆంగ్లేయులే. మన పురాతన వారసత్వ సంపదను వెలికి తీసినది, భద్రపరచినది, తాళపత్రాలను, మరుగున పడిన గ్రంథాలను వెలుగులోకి తెచ్చినది కూడా ఆంగ్లేయులే. ఇక రైళ్లు, తపాలా, టెలిగ్రాఫ్‌, ఆసుపత్రులు, రోడ్లు వంటి అనేక సౌకర్యాల మాట చెప్పనే అక్కరలేదు. 

వలస పాలకులు దోపిడీ దొంగల వంటి వారు కాదు. (నిజానికి పిండారీలు, థగ్గులు,  పాలెగార్లు వంటి మూకల నుంచి ప్రజలకు రక్షణ కల్పించినది వారే) వారి దోపిడీ కనబడని ఆర్థికపరమైన దోపిడీ. విద్యావంతులు కానివారు దాన్ని గుర్తించలేరు. మన దేశస్తుల్లో కొంతమంది ఉన్నతవిద్యకై ఇంగ్లండ్‌ వెళ్లినపుడు ప్రజాస్వామ్య హక్కులంటే ఏమిటో వారికి బోధపడింది. ఒక సామాన్య బ్రిటిషు పౌరుడు అనుభవించే హక్కులు, భారతీయ పౌరుడు ఎందుకు అనుభవించకూడదు, పాలకులను అడిగి అవి తెచ్చుకుందాం అని వారిలో ఆలోచన కలిగి సంస్థలు, సమాజాలు స్థాపించారు. దీనిని సమర్థించిన ఉదారవాదులైన ఆంగ్లేయులే కాంగ్రెసును స్థాపించారు. పోనుపోను అది సంపూర్ణ స్వరాజ్యంవైపు అడుగులు వేసింది. ఈ ప్రయాణం ఒక్క రోజులో, ఒక్క సంవత్సరంలో జరిగినది కాదు. చదువురాని సామాన్యులలో ఆంగ్లపాలన పట్ల విముఖతను, వారితో పోరాడగలమనే ధైర్యాన్ని కలిగించడంలో గాంధీని మించిన వారు లేరు. తక్కినవారు కొందరున్నా వారు వారి ప్రాంతానికి మాత్రమే పరిమితం. ప్రచారసాధనాలు అంతగా లేని ఆ రోజుల్లో, గాంధీకి ఏ మాత్రం ప్రాచుర్యం కల్పించడానికి యిష్టపడని ఆంగ్లేయుల పాలనలో గాంధీ పేరు ఒక్కటే దేశప్రజలందరికీ తెలిసిన పేరు. తన గుర్తింపును కాపాడుకోవడానికి గాంధీ రాజకీయపరమైన పొరబాట్లు ఎన్నో చేశాడు. కానీ మొత్తం అన్నీ బేరీజు వేసి చూస్తే ఆయన నిశ్చయంగా గొప్పవాడు. మహానుభావుడు, మహాత్ముడు. ఇది నా అభిప్రాయం. 

భారతీయులు స్వతహాగా శాంతికాముకులు. యుద్ధజాతి కాదు. అందుకే భారతదేశం ఎల్లలు దాటి తక్కిన దేశాలపై దాడి చేసిన సందర్భాలు చాలా తక్కువ. కర్మ సిద్ధాంతం, ప్రాప్తమున్నంత వరకే దక్కుతుందనే వేదాంతం, యిప్పటి కష్టాలకు గత జన్మ పాపాలే కారణమనే నమ్మకం, రాజు పట్ల విధేయత – వీటి కారణంగానే కాబోలు మన దగ్గర విప్లవాలు అతి తక్కువ. ప్రజలు తిరగబడి రాజుల్ని చంపేసిన సందర్భాలు వేళ్లపై లెక్కించవచ్చేమో! భారతీయుల యీ సైకీ, యీ మనస్తత్త్వాన్ని బాగా అర్థం చేసుకున్నాడు కాబట్టే గాంధీ త్యాగాన్ని, సహనాన్ని, అహింసను బోధించాడు. బలహీనులకు ఆయుధం అహింస, సత్యాగ్రహమే. స్త్రీలు, పిల్లలు యీ మంత్రం పఠించే యింటి పెద్ద నుండి కావలసినవి రాబట్టుకుంటారు. గాంధీ అదే టెక్నిక్కును దేశవ్యాప్తంగా ఉపయోగించి ఆంగ్లేయులను గందరగోళ పరిచాడు. వారికి ప్రపంచంలో పెద్దమనుష్యులని పించుకోవాలనే తాపత్రయం చాలా వుంది. అందుకని భారతస్వాతంత్ర యోధులపై మరీ కటువుగా వ్యవహరించలేకపోయారు. విదేశీవస్త్ర బహిష్కారం వుద్యమం నడుపుతూనే దీని వలన ఇంగ్లండులో నేతపనివారికి కష్టాలు వస్తాయేమోనన్న ఆందోళన వ్యక్తపరచి తన అంతర్జాతీయ దృక్పథాన్ని చాటుకున్న గాంధీకి ఆంగ్ల ప్రజల్లోనే అభిమానులు, భక్తులు ఏర్పడ్డారు. గాంధీ హింసకు పాల్పడినా, హింసాయుతంగా ఉద్యమం నడిపినా అతన్ని మట్టుపెట్టడానికి ఇంగ్లీషువారికి ఆట్టే సేపు పట్టేది కాదు. అలా అసువులు బాసినవారు చాలామంది వున్నారు. వారి వలన ప్రేరేపించబడిన వారు అతి తక్కువ. అల్లూరి సీతారామరాజుని యింత పొగుడుతున్నాం. ఆయనను ఆంగ్లేయులు చంపిన తర్వాత ఆయనలా ఎంతమంది పుట్టుకు వచ్చారు చెప్పండి – కనీసం ఆయన జిల్లాలో!? భగత్‌ సింగ్‌ వారసులెందరు చెప్పండి. గాంధీ సత్యాగ్రహం అంటే మాత్రం జనం తండోపతండాలుగా వచ్చారు. ఎందుకంటే దానిలో ప్రాణాలు పోవు. దెబ్బలు తగులుతాయి, జైల్లో కూర్చోబెడతారు, అంతే. గాంధీ వెంట నడిచినవారి సంఖ్యతో పోలిస్తే హింసామార్గాన్ని సమర్థించినవారి సంఖ్య అత్యల్పం. – వ్యా.) (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click Here For Part-5

Click Here For Part-6